logo

కర్కశ ప్రభుత్వమా.. కనిపించదా కష్టం..!

రాజకీయంగా లబ్ధి పొందాలనే దురాలోచనతో అధికార పార్టీ ఆడిస్తున్న వికృత క్రీడకు రాష్ట్ర ప్రభుత్వం వంత పాడుతోంది. ఇంటి వద్దే పింఛన్లు అందజేసే అవకాశాలన్నింటినీ పక్కన పెట్టేసి.. జగన్‌ సర్కారుకు లబ్ధి చేకూర్చాలనే శైలిలో వ్యవహరిస్తోంది.

Published : 01 May 2024 06:52 IST

పింఛన్ల పేరిట ప్రభుత్వం వికృత క్రీడ
లబ్ధిదారులను ఇబ్బంది పెట్టేందుకు కుట్ర
న్యూస్‌టుడే, శ్రీకాకుళం అర్బన్‌

రాజకీయంగా లబ్ధి పొందాలనే దురాలోచనతో అధికార పార్టీ ఆడిస్తున్న వికృత క్రీడకు రాష్ట్ర ప్రభుత్వం వంత పాడుతోంది. ఇంటి వద్దే పింఛన్లు అందజేసే అవకాశాలన్నింటినీ పక్కన పెట్టేసి.. జగన్‌ సర్కారుకు లబ్ధి చేకూర్చాలనే శైలిలో వ్యవహరిస్తోంది. మండుటెండలో పండుటాకులను బ్యాంకుల వైపు అడుగులు వేయించి.. వారిని అష్టకష్టాలు పెట్టాలనే కుట్రకు తెరలేపింది. ఆ అభాండాన్ని ప్రతిపక్షాలపై నెట్టేయాలనే కుట్రలో అవ్వాతాతలను బలి చేసేందుకు రంగం సిద్ధం చేసింది. బ్యాంకులకు వెళ్లలేమని.. ఇంటి వద్దే పింఛను అందించేలా చూడాలని వృద్ధులు వేడుకుంటున్నా మానవత్వం లేకుండా వ్యవహరిస్తోంది.

  • కొత్తూరు మండలంలో 8,109 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి అందుబాటులో 7 బ్యాంకులు మాత్రమే ఉన్నాయి. అంటే సగటున ఒక్కో బ్యాంకు శాఖ ద్వారా 1,158 మందికి పింఛను అందించినా.. అందరికీ నగదు చేతికి అందేసరికి పది రోజులు పడుతుంది. ఆ బ్యాంకులకు వెళ్లాలంటే చాలా మంది కొండలు దాటి, కి.మీ. ప్రయాణించి చేరుకోవాలి. ఇదంతా వ్యయప్రయాసలతో కూడుకున్న పని. మందస మండలంలోనూ దాదాపు ఇదే పరిస్థితి.
  • కంచిలి మండలంలో 3 బ్యాంకులు మాత్రమే సేవలందిస్తున్నాయి. ఆ మండల పరిధిలోని నువగడ, కుంబరినౌగం గ్రామాల ప్రజలు బ్యాంకులకు రావాలంటే సుమారు 20 కి.మీ. ప్రయాణించాలి. వారికి బస్సు సౌకర్యం లేదు. ఆటోలు కూడా అంతంతమాత్రమే.
  • సంతబొమ్మాళి, నందిగాం, ఎల్‌ఎన్‌పేట, లావేరు, కంచిలి, హిరమండలం, జి.సిగడాం, బూర్జ మండలాల్లో కేవలం మూడు బ్యాంకు శాఖలు మాత్రమే ఉన్నాయి. ఆయా మండలాల పరిధిలో పింఛను లబ్ధిదారులు మాత్రం 9 నుంచి 4 వేల మధ్యలో ఉండటం గమనార్హం.

శ్రీకాకుళం నగరంలోని ఓ బ్యాంకు వద్ద పింఛను నగదు కోసం వేచి ఉన్న సచివాలయ ఉద్యోగిని

జిల్లాలో 732 సచివాలయాలు ఉన్నాయి. ఆయా సిబ్బంది ద్వారా బుధవారం 77,929 మంది పింఛనుదారులకు రూ.20.78 కోట్లు పంపిణీ చేయనున్నారు. 2,42,957 మందికి 243 బ్యాంకుల ద్వారా రూ.72.88 కోట్లు అందజేస్తామని అధికారులు చెబుతున్నారు. డీబీటీ విధానంలో బ్యాంకుల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తే.. ఎవరి ఖాతాల్లో డబ్బులు పడ్డాయో.. పడలేదో అనే సమాచారం తెలిసే అవకాశం ఉండదు. ప్రభుత్వం మూడు నెలల కిందట ఆసరా పథకం కింద డ్వాక్రా మహిళలకు డీబీటీ విధానంలోనే నగదు జమ చేశామని చెప్పింది. నేటికీ చాలా మంది ఖాతాల్లో డబ్బులు పడలేదు. పింఛన్ల విషయంలోనూ ఇలాగే జరిగితే వృద్ధులు సొమ్ముల కోసం బ్యాంకులు చుట్టూ ప్రదక్షిణలు చేయక తప్పదు. మేడే సందర్భంగా ఒకటో తేదీన బ్యాంకులన్నిటికీ సెలవు. లబ్ధిదారులు డబ్బులు తీసుకోవాలంటే రెండో తేదీ నుంచి బ్యాంకులకు వెళ్లాలి.

బ్యాంకుల వద్ద ఈ ఇక్కట్లు తప్పవు..

  • ఒక్క బ్యాంకు శాఖలో సిబ్బంది, సమయాభావం పరిస్థితుల దృష్ట్యా రోజుకు 100 మంది కంటే ఎక్కువ నగదు ఉపసంహరణకు అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు.
  • లావాదేవీలు జరపకుండా ఆగిపోయిన ఖాతాలు పునరుద్ధరించాలంటే లబ్ధిదారులు కచ్చితంగా బ్యాంకులకు రావాల్సిందే. ఇందుకు కనీసం ఒకట్రెండు వారాల సమయం పడుతుంది.
  • ఖాతాలు సక్రమంగా ఉంటే ఏటీఎం కేంద్రాలు, బ్యాంకు మిత్రల వద్ద నగదు తీసుకోవచ్చు. ప్రైవేటుగా ఏఈపీఎస్‌ ద్వారా నగదు పొందాలంటే.. అక్కడ రూ.1,000కి రూ.100 కమీషన్‌ వసూలు చేస్తున్నారు. అలా డబ్బులు తీసుకోవాలంటే ఒక్కో లబ్ధిదారుడు రూ.300 కమిషన్‌ రూపంలో సమర్పించుకోవాల్సి వస్తుంది.
  • బ్యాంకుల ద్వారా ఆర్థిక లావాదేవీలకు ఎక్కువగా సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. వాటిపై వృద్ధులు, దివ్యాంగులకు అవగాహన ఉండే వీలు లేకపోవడంతో సేవలందడంలో తప్పనిసరిగా జాప్యం జరుగుతుంది.
  • ప్రతి నెలా మొదటివారంలో సాధారణంగానే సామాజిక భద్రత పింఛన్లతో పాటు, మాజీ ఉద్యోగుల పెన్షన్‌, ప్రభుత్వ ఉద్యోగులు జీతాల కోసం బ్యాంకులకు క్యూ కడతారు. ఇలాంటి రద్దీ సమయంలో వృద్ధులకు అక్కడి వెళ్తే కష్టాలు తప్పవు.

సరైన నిర్ణయం కాదు..

పింఛను సొమ్ము బ్యాంకుల ద్వారా ఇవ్వాలనే నిర్ణయం సరికాదు. ఏ బ్యాంకు శాఖలో కూడా వంద మంది కంటే ఎక్కువ నగదు ఉపసంహరణలు జరపడం సాధ్యం కాదు. గ్రామీణ ప్రాంతాల్లో సగానికిపైగా వృద్ధుల ఖాతాలు లావాదేవీలు జరగకపోవడంతో నిలిచిపోయాయి. అలాంటి వారికి కష్టాలు తప్పవు. వారందరికీ పింఛను డబ్బులు చేతికందేసరికి నెలరోజులు పడుతుంది.

జె.శ్రీనివాసరావు, విశ్రాంత మేనేజర్‌, ఏపీజీవీబీ


20 కిలోమీటర్లు ప్రయాణించాలి..

మా ఊరి నుంచి పింఛన్‌ కోసం చాపరలో ఉన్న బ్యాంకుకు వెళ్లాలంటే 8 కిలోమీటర్లు కాలినడకన నేలబొంతు చేరుకోవాలి. ఆటోలో 10 కి.మీ. దూరం ప్రయణించి మెళియాపుట్టికి.. అక్కడి నుంచి మరో రెండు కిలోమీటర్లు వెళ్తే చాపర వస్తుంది. వయో భారంతో అంత దూరం ప్రయాణించలేను. ఇంటి వద్దే పింఛను అందించాలి.

గూడ పొట్టెమ్మ, చందనగిరి, మెళియాపుట్టి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని