logo

భూతాపం తగ్గేలా కసరత్తు!

రాబోయే 10, 20 ఏళ్లలో రాష్ట్రంలోని చెన్నై సహా చాలా ప్రాంతాలు వాతావరణ మార్పుల ప్రభావానికి లోను కానున్నాయని పలు నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ప్రత్యేకించి పెరగనున్న ఉష్ణోగ్రతలు ముప్పుగా మారే అవకాశముందని తేల్చాయి.

Updated : 10 Mar 2023 04:27 IST

యూఎన్‌ఈపీతో కీలక ఒప్పందం

ఈనాడు, చెన్నై

రాబోయే 10, 20 ఏళ్లలో రాష్ట్రంలోని చెన్నై సహా చాలా ప్రాంతాలు వాతావరణ మార్పుల ప్రభావానికి లోను కానున్నాయని పలు నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ప్రత్యేకించి పెరగనున్న ఉష్ణోగ్రతలు ముప్పుగా మారే అవకాశముందని తేల్చాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం పలు హరిత కార్యక్రమాల్ని చేపట్టింది. తాజాగా మరో అడుగు ముందుకేసింది. ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేసే యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రాం (యూఎన్‌ఈపీ)తో చేతులు కలిపింది. ఇందులో భాగంగా మరిన్ని కీలక కార్యక్రమాలు చేపట్టనుంది.

ప్రణాళికలో భాగంగా చేపట్టే వాతావరణ మార్పుల ప్రాజెక్టులో వినూత్న కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పట్టణ ప్రాంతాల్లో వేడిని తగ్గించేందుకు యూఎన్‌ఈపీతో ఈ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌-డెనార్క్‌ గ్రీన్‌ స్ట్రాటజిక్‌ భాగస్వామ్యంలో భాగంగా ఇది కుదిరినట్లుగా అధికారులు చెప్పారు. నగరాలు, పట్టణాల్ని అధిక వేడి నుంచి ఎలా కాపాడాలనే దానిపై విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలకు అదనంగా వీటిని చేపట్టేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

ఉద్దేశం ఇదీ.. రాష్ట్రంలోని పర్యావరణ మార్పులు, అటవీ, పురపాలక, నీటిసరఫరా, గృహ పట్టణాభివృద్ధి తదితర శాఖలు యూఎన్‌ఈపీతో కలిసి పనిచేయనున్నాయి. ఆయా ప్రాంతాల్లో శాస్త్రీయ పద్ధతిలో మొక్కల్ని విరివిగా పెంచడం, వేడిని తగ్గించే ప్రాజెక్టులు రూపొందించడం, భూతాపాన్ని తగ్గించే సుస్థిర భవన డిజైన్లకు స్థానం కల్పించడం, ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరుగుతున్న జిల్లాల్ని గుర్తించి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం వంటివాటిపై దృష్టి పెట్టనున్నాయి.

ఇరువర్గాల ప్రతినిధుల మధ్య ఒప్పంద దృశ్యం


శాస్త్రీయ పరిష్కారం

పరిష్కారాల్ని శాస్త్రీయ పద్ధతుల్లో చూపనున్నారు. ప్లాస్టిక్‌ వ్యర్థాల్ని సేకరించడంతోపాటు వాటిని నిర్వహించాల్సిన తీరును ఆయా పట్టణాలు, నగరాల్లో అమల్లోకి తీసుకురానున్నారు. దీనికి అనుబంధంగా ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్‌ నిర్మూలన, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా పర్యావరణానికి హాని కలిగించే, భూతాపాన్ని పెంచే సమస్యలకు పరిష్కారం చూపించనున్నారు.

విదేశీ సాంకేతికత కూడా...

ఒప్పందంలో భాగంగా ప్రభుత్వం యూఎన్‌ఈపీకి అనుబంధంగా నిపుణుల్ని నియమించనుంది. ఎలాంటి సాంకేతికత అవసరం, విధానాల్లో తేవాల్సిన మార్పులు, సంస్థాపరంగా చూపాల్సిన పరిష్కారాలతో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించనున్నారు. ఇందులో భాగంగా మానవ వనరుల వ్యవస్థను తీసుకురావాలని నిర్ణయించారు. వారికి ప్రత్యేక శిక్షణ, అవగాహన కల్పించనున్నారు. పరిష్కారాల కోసం ఇతర దేశాలు, రాష్ట్రాలకు చెందిన బృందాలతోనూ కలిసి పనిచేయనున్నారు. భూతాపాన్ని తగ్గించేందుకు చేపడుతున్న వినూత్న కార్యక్రమాల్ని సైతం అధికారులు, నిపుణుల బృందాలు పరిశీలించనున్నాయి. దీనికి సహకారాన్ని యూఎన్‌ఈపీ అందించనుంది.


రూ.వెయ్యి కోట్ల నిధి

దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో క్లైమేట్ ఛేంజ్‌ యాక్షన్‌ప్లాన్‌ అమలు కార్యక్రమాలకు స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ (ఎస్పీవీ)ను ఏర్పాటుచేశారు. దీని ద్వారా ప్రత్యేక అధికారిక వ్యవస్థను తెచ్చి నిధులు ఖర్చుచేయడం, పనుల్ని పర్యవేక్షించడం లాంటివి చేయనున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం గ్రీన్‌ రాష్ట్రం మిషన్‌, రాష్ట్రం వెట్ల్యాండ్‌ మిషన్‌, రాష్ట్రం క్లైమేట్ ఛేంజ్‌ మిషన్‌ కార్యక్రమాలకు సంబంధించిన పనులు ఈ ఎస్పీవీ ఆధ్వర్యంలో జరిగేలా ప్రణాళిక చేశారు. ముందు జాగ్రత్త చర్యగా రూ.1000కోట్లతో ప్రత్యేక నిధిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. రాష్ట్రంలోని 38 జిల్లాల్లోనూ ఈ నిధులతో కీలక ప్రాజెక్టులు చేపట్టనున్నారు.

మరో 4 ప్రాజెక్టులు

ఐఐటీ మద్రాస్‌ పరిశోధకులు డెన్మార్క్‌తో కలిసి మరిన్ని ప్రాజెక్టులు చేపడుతున్నారు. తక్కువ కర్బన ఉద్గారాలు వెదజల్లే విద్యుత్తుకు సంబంధించి 4 ప్రాజెక్టులపై వీరితో ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా పలు కీలక పరిశోధనలు జరుగుతున్నాయి. మరోవైపు యూఎన్‌ఈపీ ఉద్దేశాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఇప్పటికే 20 గిగావాట్ల పునరుత్పాదక శక్తితో ఉత్పత్తయ్యే విద్యుత్తు సామర్థ్యం ఉంది. ఇందులో 10 గిగావాట్లు పవన విద్యుత్తు ద్వారానే ఉత్పత్తి చేస్తున్నారు. గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌కు ఆనుకుని ఉన్న రాష్ట్రానికి పవన్‌ విద్యుత్తుకు అనువుగా తీరం ఉండటం కలిసొచ్చే అంశం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని