logo

Vijay: ఎన్నికలకు దళపతి సిద్ధం.. పార్టీ పేరు నమోదు?

తమిళనాట సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తర్వాత ఆ స్థాయి స్టార్‌డమ్‌ ఉన్న నటుడు విజయ్‌. అభిమానులు ‘దళపతి’ అని ముద్దుగా పిలుస్తుంటారు.

Updated : 01 Feb 2024 08:31 IST

కోడంబాక్కం, న్యూస్‌టుడే: తమిళనాట సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తర్వాత ఆ స్థాయి స్టార్‌డమ్‌ ఉన్న నటుడు విజయ్‌. అభిమానులు ‘దళపతి’ అని ముద్దుగా పిలుస్తుంటారు. కెరీర్‌ మొదలైన కొంతకాలం నుంచే కన్నడ, మలయాళంలో కూడా ఆయనకు మార్కెట్‌ మొదలైంది. ఇప్పుడు తెలుగులోనూ పెద్ద మార్కెట్ ఏర్పడింది. ఇటీవలే ఓ సినిమాకు తమిళంలో రూ.100 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. తాజాగా ఓ చిత్రంలో తెలుగు మార్కెట్ కోసం రూ.40 కోట్లు కలుపుకొని మొత్తం రూ.140 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. సినిమాల్లో తీరికలేకుండా ఉన్న విజయ్‌.. రాజకీయాలపై కూడా పూర్తిస్థాయిలో దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా సేవా కార్యక్రమాలు చురుగ్గా చేపడుతున్నారు. ప్రతిభ కనబరిచిన పదో తరగతి, ప్లస్‌వన్‌, ప్లస్‌టూ విద్యార్థులకు ప్రోత్సాహకాలను కూడా అందిస్తున్నారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రానని స్పష్టం చేయడంతో.. విజయ్‌ తన రాజకీయ ప్రవేశాన్ని వేగవంతం చేస్తున్నారు. అందులో భాగంగానే విజయ్‌ మక్కల్‌ ఇయక్కం(అభిమానుల సంఘం) నిర్వాహకులతో ఇప్పటికే నాలుగుసార్లు సమావేశమయ్యారు. తాజాగా చెన్నై శివారు పనైయూర్‌లో 150 మందితో సమావేశమై పార్టీ పేరు, జెండా, అజెండాలపై చర్చించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

నిర్వాహకులతో చర్చించి..

పార్టీ పేరుపై ఆయన ఎక్కువసేపు నిర్వాహకులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. పార్టీకి మక్కల్‌(ప్రజలు), తమిళగం(తమిళనాడు), మున్నేట్రం(అభివృద్ధి), కళగం(పార్టీ) వంటి పదాలు విజయ్‌ సూచించినట్లు తెలుస్తోంది. ఈ మూడు పదాలు కలిసేలా ‘తమిళగ మున్నేట్ర కళగం’ పేరును వినిపించినట్లు తెలుస్తోంది. ఇదే పేరు తాజాగా ఎన్నికల సంఘంలో కూడా నమోదు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్‌, ఆయన అభిమాన సంఘం ఈ విషయంపై స్పష్టత ఇవ్వలేదు. విజయ్‌కి 2026లో జరిగే శాసనసభ ఎన్నికలే టార్గెట్గా తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు అరంగేట్రం చేసి ఎదురయ్యే తప్పొప్పులు సరిచేసుకుని.. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలనే నిశ్చయానికి వచ్చినట్లు సమాచారం.

తెలుగు చిత్రాల ప్రభావం

విజయ్‌కి ఈస్థాయి స్టార్‌డమ్‌ రావడం వెనుక తెలుగుచిత్రాల ప్రభావం కూడా ఎక్కువగానే ఉంది. విజయ్‌ కెరీర్‌లో ‘పోక్కిరి’, ‘గిల్లి’, ‘బద్రి’, ‘ఆది’, ‘వేలాయుధం’, ‘యూత్‌’ వంటి సినిమాలు ముఖ్యమైనవి. కెరీర్‌ను మలుపుతిప్పాయి కూడా. ఇవన్నీ తెలుగు సినిమాలే కావడం విశేషం. పవన్‌కల్యాణ్‌ను ఎక్కువగా అనుకరించేవారు. ఆయన పాటలు, సినిమాలను రీమేక్‌ చేశారు. తమిళంలో అభిమానులకు ప్రాధాన్యం ఇస్తుంటారు. ఏడాదిలో రెండుసార్లు నేరుగా సమావేశమై వారికి బిరియాని వడ్డించడం, బహుమతులు ఇవ్వడం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని