logo

సమరయోధుల ఖిల్లా ఎవరి సొంతం?

మహానేత కామరాజర్‌.. విరుదునగర్‌లో జన్మించి కాంగ్రెస్‌లో చేరి, తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహించి, జాతీయ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగారు.

Published : 17 Apr 2024 01:50 IST

బాణసంచా పరిశ్రమ

ప్యారిస్‌, న్యూస్‌టుడే: మహానేత కామరాజర్‌.. విరుదునగర్‌లో జన్మించి కాంగ్రెస్‌లో చేరి, తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహించి, జాతీయ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగారు. మాజీ ముఖ్యమంత్రి పి.ఎస్‌.కుమారసామి రాజా, స్వాతంత్య్ర సమరయోధులు శంకరలింగనార్‌, విశ్వనాథదాస్‌ తదితరులంతా ఈ జిల్లా వాసులే. బాణసంచాకు పేరొందని శివకాశి ఇదే జిల్లా పరిధిలో ఉంది.

పునర్విభజన తర్వాత..

నియోజకవర్గాల పునర్విభజన తర్వాత విరుదునగర్‌ లోక్‌సభ స్థానంలో విరుదునగర్‌, సాత్తూర్‌, శివకాశి, అరుప్పుక్కోట్టై, మదురై జిల్లాలోని తిరుప్పరకుండ్రం, తిరుమంగళం అసెంబ్లీ స్థానాలున్నాయి. 2009లో జరిగిన ఎన్నికల్లో డీఎంకే కూటమి తరఫున కాంగ్రెస్‌ అభ్యర్థి మాణిక్కం ఠాగూర్‌ గెలుపొందారు. ఆయనకు ప్రత్యర్థిగా ఎండీఎంకే తరఫున బరిలో నిల్చిన వైగో 15,764 ఓట్ల వ్యత్యాసంతో ఓడిపోయారు. 2014లో అన్నాడీఎంకే అభ్యర్థి రాధాకృష్ణన్‌ గెలుపొందారు. వైగో రెండో స్థానానికి పరిమితమయ్యారు. ఆ ఎన్నికల్లో డీఎంకే, ఎండీఎంకే, కాంగ్రెస్‌ ఒంటరిగానే పోటీ చేశాయి. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీచేసిన మాణిక్కం ఠాగూర్‌ మళ్లీ గెలుపొందారు.

ప్రధాన సమస్యలివి..

విరుదునగర్‌ నియోజకవర్గంలో ముక్కులత్తోర్‌, నాయక్కర్‌, నాడార్‌, ఆదిద్రవిడర్‌, మూప్పర్‌, సెట్టియార్‌, రెట్టియార్‌, పిళ్లైమార్‌ తదితర సామాజికవర్గాలు గణనీయంగా ఉన్నాయి. కరవు ప్రాంతం కావడంతో వ్యవసాయం కూడా అంతంతమాత్రమే. పత్తి, పప్పుధాన్యం పండుతాయి.

ఇక్కడి నుంచే బాణసంచా భారీగా తయారై దేశ, విదేశాలకు తరలుతుంటుంది. అగ్గిపెట్టెల తయారీ, ముద్రణ పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. బాణసంచా పరిశ్రమను నమ్ముకుని ఉన్న లక్షల మంది కార్మికుల భద్రతకు ఎలాంటి పథకాలు తీసుకురాలేదు. విరుదునగర్‌-సాత్తూర్‌ మధ్య వంతెన నిర్మాణ పనులు ఆగిపోయాయి. మదురై ఎయిమ్స్‌ ఏర్పాటు కానున్న ప్రాంతం విరుదునగర్‌ లోక్‌సభ నియోజకవర్గం సరిహద్దులో ఉంది. 2019లో శంకుస్థాపన చేసినా పనులు మొదలవలేదు.

విరుదునగర్‌ నియోజకవర్గ మ్యాప్‌

విజయం ఎవరి సొంతం?

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే కూటమి తరఫున కాంగ్రెస్‌ అభ్యర్థి మాణిక్కం ఠాగూర్‌ మళ్లీ బరిలో ఉన్నారు. భాజపా నుంచి నటి రాధికా, డీఎండీకే తరఫున విజయకాంత్‌ కుమారుడు విజయ ప్రభాకర్‌ పోటీలో ఉన్నాయి. గెలుపొందితే విరుదునగర్‌లో ఇల్లు తీసుకుని ఉంటానని విజయప్రభాకరన్‌ ప్రచారంలో చెపుతున్నారు. రాధికా ప్రజలను ఆకర్షించేందుకు వీధివీధికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. అతి పెద్ద పథకాలను తీసుకొస్తానని హామీ ఇస్తున్నారు. నామ్‌ తమిళర్‌ కట్చి అభ్యర్థి కౌసిక్‌ యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని