logo

తీరం గుండెకోత

సముద్ర అలల తాకిడికి కురుసురా మ్యూజియం వద్ద తీరం బాగా కోతకు గురైంది. ప్రహరీ కుప్పకూలింది. మట్టి భారీగా కిందకు జారిపోయింది. సుమారు పావు కిలోమీటరు వరకు దాని తీవ్రత కనిపించింది.

Published : 06 Dec 2021 02:48 IST

అలల తీవ్రతకు ధ్వంసమైన పిల్లల పార్కు

నాలుగేళ్ల క్రితం..

సముద్ర అలల తాకిడికి కురుసురా మ్యూజియం వద్ద తీరం బాగా కోతకు గురైంది. ప్రహరీ కుప్పకూలింది. మట్టి భారీగా కిందకు జారిపోయింది. సుమారు పావు కిలోమీటరు వరకు దాని తీవ్రత కనిపించింది.

ఏడాదిన్నర కిందట..

దివ్యాంగుల కోసం జీవీఎంసీ నిర్మించిన విభిన్న ప్రతిభావంతుల పార్క్‌ వద్ద తీరం కోతకు గురైంది. అలలు కింద నుంచి మట్టిని తొలిచేయడంతో ఈ పార్క్‌ ఒక వైపునకు ఒరిగిపోయినట్లయింది.

తాజాగా..

బీచ్‌ రోడ్డు మరోసారి కోతకు గురైంది. ఆర్‌కే బీచ్‌కు సమీపంలోని చిల్డ్రన్‌ పార్క్‌ వద్ద భూకంపం వచ్చినట్లు నేల విడిపోయింది. జవాద్‌ తుపాను కారణంగా అలల తీవ్రత ఎక్కువ అవ్వడంతో కోత ఏర్పడి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. పార్క్‌ నుంచి బీచ్‌ వైపున్న ప్రహరీతో పాటు పార్క్‌లోని కొంత స్థలం కుప్పకూలింది. సముద్రంలో అలజడి రేగినపుడల్లా నగర పరిధిలోని తీరప్రాంతం ఎక్కడో ఒకచోట కోతకు గురవుతూనే ఉంది. యారాడ నుంచి రుషికొండ వరకు ఈ ముప్పును గుర్తించొచ్చు. ముఖ్యంగా కోస్టల్‌ బ్యాటరీ పరిసరాలు, ఆర్‌కే బీచ్‌, కురుసురా, తెన్నేటిపార్క్‌, వీఎంఆర్‌డీఏ పార్క్‌, రుషికొండ, సాగర్‌నగర్‌, సాయిప్రియా రిసార్టు వద్ద గతంలో పలు మార్లు తీరం ముందుకొచ్చి కోతకు గురిచేసింది.

ఇంకెన్నో..

* తీరంలో సరిపడినంత ఇసుక లేకపోయినా ఈ నష్టం జరిగేందుకు అవకాశం ఉంటుందని నిపుణలు పేర్కొంటున్నారు. బీచ్‌ల్లో ఇసుక పుష్కలంగా ఉంటే తీర ప్రాంత కోతను కొంత వరకు నియంత్రించొచ్చు.

* విశాఖలో బంగాళాఖాతం నుంచి ఇసుక దక్షిణం నుంచి ఉత్తరం వైపునకు వస్తుంది. వచ్చే క్రమంలో ఎక్కువ మొత్తంలో ఇసుక మధ్యలో ఉన్న యారాడ కొండ వద్ద నిలిచిపోతుంది. దీంతో నగరం వైపున్న తీరానికి సహజంగా వచ్చే ఇసుక తక్కువగా ఉంటోంది. దీంతో తరచూ కోత ఏర్పడుతోంది.

* తీర ప్రాంతంలో అభివృద్ధి, సముద్రంలో నీటిమట్టం పెరగడం వంటివి సహజంగా వచ్చే ఇసుకపై ప్రభావం చూపుతున్నాయి. ఈకారణంగా కొన్ని చోట్ల తక్కువ ఇసుక ఉండడాన్ని మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. ఆ సమయంలో సముద్రం ముందుకొచ్చినపుడు ముప్పు ఏర్పడుతుంటుంది.

-ఈనాడు, విశాఖపట్నం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని