logo

మైన్స్‌ విజిలెన్స్‌ ఏడీ ప్రతాప్‌రెడ్డికి మెమో

ముందస్తు అనుమతి లేకుండా గనుల శాఖ విజిలెన్స్‌ ఏడీ ప్రతాప్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించడంపై ఆ శాఖ ఉన్నతాధికారులు తప్పుబట్టారు. ఈమేరకు పది రోజుల్లోగా

Published : 22 Jan 2022 02:15 IST

పది క్వారీలపై విచారణ

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: ముందస్తు అనుమతి లేకుండా గనుల శాఖ విజిలెన్స్‌ ఏడీ ప్రతాప్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించడంపై ఆ శాఖ ఉన్నతాధికారులు తప్పుబట్టారు. ఈమేరకు పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆ శాఖ డైరెక్టర్‌ వెంకటరెడ్డి శుక్రవారం మెమో జారీచేశారు. ప్రస్తుతం విజయనగరం జిల్లా విజిలెన్స్‌ ఏడీగా ప్రతాప్‌రెడ్డి పనిచేస్తున్నారు. ఇదివరకు ప్రాంతీయ విజిలెన్స్‌ ఏడీగా విశాఖ జిల్లాలో క్వారీలపై దాడులు చేసిన సందర్భంలో ఆయనపై కొన్ని ఆరోపణలు వచ్చాయి. కుటుంబసభ్యులను బినామీలుగా పెట్టి లావాదేవీలు నిర్వహించినట్లు ఇటీవల ఓ ఆడియో టేపు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. దీంతో ఆ ఆడియో టేపులో స్వరం తనది కాదని, ఎవరో మార్ఫింగ్‌ చేశారని, మైనింగ్‌ అధికారుల్లో కొందరు మాఫియాతో చేతులు కలిపి తనపై బురద జల్లుతున్నారని ఈ నెల 16న విశాఖలో మీడియా సమావేశం పెట్టి ఆరోపించారు. అవసరమైతే రాజీనామా చేసి వెళ్లిపోతానని ఆవేశంగా మాట్లాడారు. అయితే సంబంధిత శాఖ ఉన్నతాధికారుల అనుమతి లేకుండా మీడియా సమావేశం నిర్వహించడం సర్వీస్‌ రూల్స్‌కు వ్యతిరేకమని మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆయనకు మెమో జారీచేశారు.

అనకాపల్లి మండలంలోని వివాదాస్పద మార్టూరు క్వారీతో పాటు మామిడిపాలెం, బవులువాడ ప్రాంతాల్లోని క్వారీల్లో అక్రమాలను తేల్చేందుకు ప్రత్యేక బృందం విచారణ చేపట్టబోతోంది. ఇటీవల స్థానిక తెదేపా నేతలు బవులవాడలోని ఓ క్వారీ ప్రాంతానికి వెళ్లి అక్కడ అక్రమాలపై సంబంధిత విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో గనుల శాఖ ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు తెలిసింది. ఆ క్వారీ నిర్వాహకునికి సంబంధించిన అన్ని క్వారీలపైనా విచారణ చేయాలని నిర్ణయించారు. దీనికోసం కాకినాడకు చెందిన గనుల శాఖ ఉప సంచాలకుడిని, ఏలూరు ప్రాంతీయ విజిలెన్స్‌ స్క్వాడ్‌ ఏజీ ఒకర్ని, విజయవాడ నుంచి ఇద్దరు సర్వేయర్లను బృందంగా నియమించారు. పది రోజుల్లోగా ఆ క్వారీల నిర్వహణలో అక్రమాలను తేల్చాలని ఆదేశించారు. వీరికి అనకాపల్లి గనుల శాఖ ఏడీని సహకరించాల్సిందిగా సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని