logo

అభియోగాలపై ఏం చేద్దాం?

విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ)లో కొందరు ఉద్యోగులపై ఉన్న అభియోగాల ఉపసంహరణ దిశగా దస్త్రాలు కదులుతున్నాయి.

Published : 09 Dec 2022 05:42 IST

ఉద్యోగులపై నివేదిక కోరిన ప్రభుత్వం

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ)లో కొందరు ఉద్యోగులపై ఉన్న అభియోగాల ఉపసంహరణ దిశగా దస్త్రాలు కదులుతున్నాయి. గతంలో ఎస్టేట్‌ అధికారిగా చేసిన ఒకరు తనపై ఉన్న ఛార్జిస్‌ ఉపసంహరణకు ప్రభుత్వానికి రాత పూర్వక వివరణ సమర్పించారు. ప్రభుత్వం అతనిపై అభియోగాలను ఉపసంహరించుకుంది. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొందరు కొద్ది నెలల కిందట ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. వీరిలో స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఒకరు, పరిపాలన అధికారులు (ఏవో స్థాయి) ముగ్గురు ఉన్నారు.

* మధురవాడలో ‘ఓజోన్‌ వ్యాలీ’ పేరుతో వుడా రెండు దశల కింద గతంలో లేఅవుట్లను అభివృద్ధి చేసింది. ఇక్కడి స్థలాల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారంటూ పలువురు ఉద్యోగులపై అప్పట్లో అభియోగాలు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ ఉద్యోగులంతా పదవీ విరమణ పొందారు. అయినప్పటికీ కేసు మాత్రం అలానే కొనసాగుతూ ఉంది. తమపై ఉన్న అభియోగాలను తొలగించాలని  ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు గతంలో దరఖాస్తు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వాటికి సంబంధించిన నివేదిక పంపాలని గత నెలలో వీఎంఆర్‌డీఏను అడిగింది. దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటారనేది కీలకంగా మారింది.

ఆ కొందరి అతి తొందర..

మరో వైపు.... ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన ఓ అధికారి తనపై ఉన్న అభియోగాలను న్యాయస్థానం ద్వారా ఉపసంహరించుకున్నారు. దీన్ని ఆధారంగా చేసుకొని గతంలో ప్లానింగ్‌ విభాగంలో పనిచేసిన ఓ ఉన్నతాధికారి, మరికొందరు తమపై ఉన్న అభియోగాలు తొలగించాలని వీఎంఆర్‌డీఏ అధికారులను కోరారు. ఈ దరఖాస్తులు వచ్చిన తరువాత సంబంధిత సెక్షన్‌ ఉద్యోగులు కొందరు వెంటనే ఆ దిశగా దస్త్రం సిద్ధం చేసేయడం గమనార్హం. పైఅధికారులను సంప్రదించకుండా వారికి వారే దస్త్రం ముందుకు నడిపారనే విమర్శలు వస్తున్నాయి. అధికారుల సంతకానికి తీసుకువెళ్లిన సమయంలో దీన్ని గుర్తించి ప్రభుత్వానికి రాయలంటూ ఆ దస్త్రాన్ని వెనక్కి పంపినట్లు తెలిసింది. పరిపాలన అంశాలకు సంబంధించి కొందరు ఉద్యోగులు ఇష్టానుసారంగా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని