logo

విక్రయానికి వీఎంఆర్‌డీఏ మిగులు ప్లాట్లు

విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) విజయనగరం, విశాఖ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో గతంలో అభివృద్ధి చేసిన లేఅవుట్లలో ప్రస్తుతం మిగిలి పోయిన ప్లాట్లకు వేలం నిర్వహించనున్నారు.

Published : 22 Dec 2022 04:26 IST

అధికంగా కొన్నింటి ప్రాథమిక ధర
ఈనాడు, విశాఖపట్నం

విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) విజయనగరం, విశాఖ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో గతంలో అభివృద్ధి చేసిన లేఅవుట్లలో ప్రస్తుతం మిగిలి పోయిన ప్లాట్లకు వేలం నిర్వహించనున్నారు.

పీ ప్రభుత్వ ఈ వేలం పోర్టల్‌ konugolu.ap.gov.in ద్వారా 2023 జనవరి 3, 4 తేదీల్లో 46 ప్లాట్ల విక్రయానికి ప్రకటన జారీ చేశారు. వీటిల్లో కొన్ని ప్లాట్ల ప్రాథమిక ధర అధికంగా నిర్ణయించడంపై విమర్శలు వస్తున్నాయి. గతంలో మిగులు ప్లాట్ల విక్రయానికి వేలం పాట నిర్వహించినా ప్రజల నుంచి స్పందన కనిపించలేదు. కొన్ని ప్లాట్లకు అధిక ధర నిర్ణయించడం, సరైన రూపు లేని వాటికి ఎక్కువ ధరపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. దాకమర్రి, మిగిలిన చోట ప్లాట్ల కోసం రెండేళ్లలో నాలుగు దఫాలు వేలం పాట నిర్వహించగా స్పందన రాలేదు. ఈసారి విశాఖకు అన్ని వైపులా మిగిలి పోయిన ప్లాట్లను గుర్తించి వాటి విక్రయానికి ప్రణాళిక రూపొందించారు. ఇటీవల సెక్రటరీగా టి.వేణుగోపాల్‌ నియమితులవ్వడంతో ఈ ప్రక్రియను వేగవంతం చేశారు.

పాత వుడా లేఅవుట్లలోవి గుర్తించి..

గతంలో నిర్వహించిన వేలంలో దాకమర్రిలో మిగిలిపోయిన అధిక ఆదాయ వర్గాలకు (హెచ్‌ఐజీ) చెందిన ప్లాట్లనే విక్రయానికి ఉంచేవారు. వీటికి ఎన్నిసార్లు ప్రకటన ఇచ్చినా వీటిల్లోవి ఎవరూ కొనుగోలు చేయలేదు. ప్రస్తుత వేలంలో వీటిని పక్కన పెట్టారు. ఇటీవల అధికారులు మిగులు స్థలాలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా పాత లేఅవుట్లకు సంబంధించిన దస్త్రాలను తిరగేసి ఎన్ని లేఅవుట్లు వేశారు, వాటిల్లో మిగిలినవి ఎన్నో గుర్తించారు. ఇలా గుర్తించిన వాటిల్లో పెదగంట్యాడ, మాధవధార, భీమిలి, కూర్మన్నపాలెం, మర్రిపాలెం ప్రాంతాల్లో విలువైన అధిక విస్తీర్ణం కలిగిన ప్లాట్లను గుర్తించారు. కొన్ని ఆక్రమణకు గురవ్వగా వాటిని స్వాధీనం చేసుకొని తాజాగా విక్రయానికి ఉంచారు.

ప్రాథమిక ధర చ.గజం రూ.55 వేలు..

విక్రయానికి ఉంచిన వాటిల్లో కూర్మన్నపాలెం ఫేజ్‌ 1, 2, 6లో వేసిన లేఅవుట్లలో మిగిలినవి, పెదగంట్యాడ ఫేజ్‌ 1, 2,3 లేఅవుట్లలోవి, మర్రిపాలెం, మాధవధార, మధురవాడలోని ప్లాట్లకు ప్రాథమిక ధరను అధికంగా నిర్ణయించారు. ఈ ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్‌ విలువకు సమానంగా ఈ ధరలు నిర్ణయించారు. మర్రిపాలెం లేఅవుట్‌లోని 533.33 చ.గజాలు, 660.45 చ.గజాల హెచ్‌ఐజీ ప్లాట్లకు చ.గజం ప్రాథమిక ధర రూ.55 వేలుగా నిర్ణయించారు. మాధవధార లేఅవుట్లోని రెండు ప్లాట్లకు చ.గజం రూ.50 వేలుగా పేర్కొన్నారు.

* పెదగంట్యాడలో వివిధ రకాల 12 ప్లాట్ల ప్రాథమిక ధరను రూ.45 వేలుగా నిర్ణయించారు. అలాగే కూర్మన్నపాలెంలోని 12 స్థలాలకు చ.గజం రూ.35 వేలుగా ప్రకటించారు.

* విజయనగరం జిల్లా కానపాక అయ్యన్నపేటలో మిగిలిన ప్లాట్లకు చ.గజం రూ.20 వేలుగా నిర్ణయించారు. గత ఏడాది నిర్వహించిన వేలంలో ఇక్కడ వాటికి చ.గజం రూ.12 వేలు నిర్ణయించారు. ఆ సమయంలో రూ.13 వేలకు ఒకటి, రెండు ప్లాట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇప్పుడు ఆ ప్రాంతంలో డిమాండు నెలకొనడంతో అమాంతం ప్రాథమిక ధరను రూ.20 వేలకు పెంచారు.

* భీమిలి మండలం కుమ్మరిపాలెం, డా.పద్మావతి జేవీ లేఅవుట్‌లోని స్థలాలకు ప్రాథమిక ధరను రూ.13 వేల నుంచి రూ.14 వేలు నిర్ణయించారు.

* వేలంలో పాల్గొనే వారు ప్లాట్లకు నిర్ణయించిన ప్రాథమిక ధరలో పది శాతం ముందుగానే చెల్లించాలి. దరఖాస్తు చేసుకోవడం, ఇతర అంశాలపై ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసేలా ప్రత్యేక సహాయ కేంద్రం వీఎంఆర్‌డీఏలో అధికారులు ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని