logo

అర్హులకు ఆర్థిక చేయూత

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్‌ వాత్సల్య పథకం కింద స్పాన్సర్‌షిప్‌(ప్రాయోజిత పథకం)కు అర్హులైన బాలలు దరఖాస్తు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ సభ్యులు గొండు సీతారామ్‌ విజ్ఞప్తి చేశారు.

Published : 28 Mar 2023 04:16 IST

మిషన్‌ వాత్సల్య కింద స్పాన్సర్‌షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం
ఏప్రిల్‌ 15 తుది గడువు

గొండు సీతారామ్‌

న్యూస్‌టుడే, ఎంవీపీకాలనీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్‌ వాత్సల్య పథకం కింద స్పాన్సర్‌షిప్‌(ప్రాయోజిత పథకం)కు అర్హులైన బాలలు దరఖాస్తు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ సభ్యులు గొండు సీతారామ్‌ విజ్ఞప్తి చేశారు. 18 సంవత్సరాల్లోపు ఉండి...రక్షణ, సంరక్షణ అవసరమైన వారి కనీస అవసరాలను తీర్చేందుకు ప్రతి నెలా ఆర్థిక చేయూత అందించటం జరుగుతుందన్నారు. ఈ పథకం గురించి ఆయన వివరిస్తూ.. అర్హులకు ఆర్థిక, ఇతరత్రా వైద్య, విద్య, అభివృద్ధి అవసరాలను తీర్చేందుకు మిషన్‌ వాత్సల్య కింద షరతులతో కూడిన సహాయం అందిస్తారని, .స్పాన్సర్‌షిప్‌ ద్వారా ఎంపికైన పిల్లలకు నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారని పేర్కొన్నారు.

వార్షికాదాయం :

గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ సంవత్సర ఆదాయం రూ.72వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.96వేలకు మించకూడదు. కాల పరిమితి...జెజె బోర్డు, సీడబ్ల్యూసీ కోర్టు లిఖితపూర్వకంగా నమోదు చేసిన కారణాల ఆధారంగా అవసరాన్ని బట్టీ స్పాన్సర్‌షిప్‌ను పొడిగించవచ్చు.  బీ ఏ సమయంలోనైనా స్పాన్సర్‌షిప్‌ అందుకుంటున్న బాలలు, ఏదైనా వసతిగృహం, బాల సదనంలో చేర్పించిన తర్వాత సహాయం నిలిపివేస్తారు.  బీ ప్రత్యేక అవసరాలు కలిగిన బాలల విషయంలో మినహా పాఠశాలలకు వెళ్లే వారు పాఠశాల హాజరు 30 రోజులకుపైగా సక్రమంగా లేదని తేలినా సమీక్షించి, తాత్కాలికంగా నిలిపివేస్తారు.

ఎవరిని సంప్రదించాలి

మిషన్‌ వాత్సల్య స్పాన్సర్‌షిప్‌ కోసం ఎక్కువ మంది సద్వినియోగం చేసుకునేలా జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. పాఠశాలలు, ఇతరత్రా ప్రాంతాల్లో బాలలను గుర్తించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఏప్రిల్‌ 15లోగా అర్హులైన బాలలచే దరఖాస్తు చేయిస్తున్నారు.

ఎవరు అర్హులు?

* అనాథలుగా ఉంటూ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్న వారు  

* తల్లి వితంతువు, విడాకులు తీసుకున్న, కుటుంబం విడిచిపెట్టిన పిల్లలు.

* తల్లిదండ్రులు ప్రాణాపాయ/ ప్రాణాంతక వ్యాధికి గురై ఉంటే...

* తల్లిదండ్రులు ఆర్థికంగా, శారీరకంగా అసమర్థులై పిల్లలను చూసుకోలేని కుటుంబంలోని వారు

జువైనల్‌ జస్టిస్‌ చట్టం 2015 ప్రకారం రక్షణ, సంరక్షణ అవసరమైన పిల్లలు (ప్రకృతి వైపరీత్యానికి గురైన బాలలు, బాలకార్మికులు, అంగవైకల్యం కలిగిన పిల్లలు, ఇంటి నుంచి పారిపోయి వచ్చిన వారు, బాల యాచకులు, వీధుల్లో నివసించే బాలలు, సహాయం, పునరావాసం అవసరమైన వారు, దోపిడీకి గురైన బాలలు)

* కొవిడ్‌-19 కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి ‘పీఎం కేర్స్‌ ఫర్‌’ పథకం కింద నమోదైన వారు.

సంప్రదించాల్సిన నెంబర్లు:

జిల్లా ఇన్‌ఛార్జి బాలల సంరక్షణ అధికారి ఎం.రమేష్‌ (89789 17154), రక్షణ అధికారి మమత(98498 55562).

సంప్రదించాల్సిన కార్యాలయాలు

జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, ప్రగతి భవన్‌, సెక్టారు-9, ఎంవీపీకాలనీ, విశాఖపట్నం.

* జిల్లా పరిధిలోని అర్బన్‌-1 ఐసీడీఎస్‌ కార్యాలయం, విశాఖ అర్బన్‌-2 ఐసీడీఎస్‌ కార్యాలయం, పెందుర్తి ఐసీడీఎస్‌, భీమిలి ఐసీడీఎస్‌ కార్యాలయం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని