logo

ఆ వర్గాలకుసీట్లేవి?

ఉమ్మడి విశాఖలో రెండు ప్రధాన సామాజిక వర్గాలను వైకాపా పక్కన పెట్టడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Published : 28 Mar 2024 09:11 IST

యాదవ, గవరలకు వైకాపా మొండిచేయి
ఈనాడు-విశాఖపట్నం

మ్మడి విశాఖలో రెండు ప్రధాన సామాజిక వర్గాలను వైకాపా పక్కన పెట్టడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. బలమైన గవర, యాదవ సామాజిక వర్గాల నాయకుల్ని అణగదొక్కి, వారికి రాజకీయ భవిష్యత్‌ లేకుండా చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సీట్లు కేటాయించకుండా మొండిచేయి చూపడంపై ఆయా సామాజికవర్గాల నాయకులు, కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఉపయోగించుకుని, ప్రస్తుతం ప్రాధాన్యత ఇవ్వకుండా పక్కన పెట్టేస్తుండటంపై ఆ సామాజిక వర్గాల్లో వైకాపాపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది.

విశాఖలోయాదవులకు ఝలక్‌..

విశాఖ అర్బన్‌లో యాదవ సామాజిక వర్గాన్ని వైకాపా పూర్తిగా పక్కన పెట్టింది. తూర్పు టికెట్‌ ఆశించి, పార్టీలో గౌరవం ఇవ్వడం లేదంటూ యాదవ సామాజిక వర్గానికి చెందిన వంశీకృష్ణ శ్రీనివాస్‌ వైకాపా నుంచి బయటకు వచ్చిన విషయం విదితమే. అదే నియోజకవర్గంలో పోటీ చేసేందుకు మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి, వీఎంఆర్డీఏ మాజీ ఛైర్మన్‌ అక్కరమాని విజయనిర్మల ఆసక్తి చూపారు. అప్పటి వరకు తూర్పు ఇన్‌ఛార్జిగా ఉన్న అక్కరమానిని తప్పించి, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు కొత్తగా సమన్వయకర్త బాధ్యతలిచ్చి, ఇటీవల అభ్యర్థిగా వచ్చే ఎన్నికలకు ప్రకటించారు. దీంతో పార్టీ కార్యక్రమాలకు అక్కరమాని వర్గం దూరంగా ఉంటూ వచ్చింది. అయితే సామాజిక సమీకరణల్లో భాగంగా అక్కరమానికి భీమిలి, మేయర్‌కు గాజువాక టికెట్‌ ఇస్తారంటూ సర్వేలతో హడావుడి చేసి అక్కడా మొండిచేయి చూపారు. తెదేపా కూటమి యాదవ సామాజికవర్గానికి పెద్దపీట వేస్తూ గాజువాకలో పల్లా శ్రీనివాసరావుకు, విశాఖ దక్షిణంలో వంశీకృష్ణ శ్రీనివాస్‌కు అవకాశం కల్పించారు. వంశీకృష్ణ శ్రీనివాస్‌ అభ్యర్థిత్వాన్ని జనసేన అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

అనకాపల్లిలోగవర సామాజికవర్గం విస్మరణ

ఒక పక్క సామాజిక సాధికారిత అంటూ బస్సు యాత్రలు చేసిన వైకాపా, గవర సామాజిక వర్గానికి ఝలక్‌ ఇచ్చింది. తరతరాల నుంచి గవర సామాజికవర్గం ప్రాతినిథ్యం వహిస్తున్న అనకాపల్లి పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాలలో ఏ ఒక్కటీ ఇవ్వకుండా మొండిచేయి చూపింది. ఎన్నికల్లో అసెంబ్లీ లేదా పార్లమెంట్‌ సీట్లలో ఏదో ఒకటి గవర సామాజిక వర్గానికి కేటాయించడం అనకాపల్లిలో ఆనవాయితీ. అయితే  సిట్టింగ్‌ ఎంపీ సత్యవతికి సీటు ఇచ్చే అవకాశం లేదని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో అనకాపల్లి అసెంబ్లీ టికెట్‌ను కాపు సామాజిక వర్గానికి చెందిన మలసాల భరత్‌కు ఇవ్వడంతో, అనకాపల్లి ఎంపీ టికెట్‌ కోసం గవర సామాజికవర్గానికి చెందిన బొడ్డేటి కాశీ విశ్వనాథ్‌, పీలా రమాకుమారిలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. వీరిద్దరినీ, సిట్టింగ్‌ను కాదని బూడి ముత్యాలనాయుడును ఎంపీ అభ్యర్థిగా వైకాపా ప్రకటించడం గమనార్హం.
ఇక్కడ తెదేపా పొత్తులో గవర సామాజికవర్గానికి చెందిన జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణకు అసెంబ్లీ టికెట్‌ను కేటాయించారు. ఉమ్మడి విశాఖలో గవర సామాజికవర్గం బలంగా ఉంది. అనకాపల్లిలో 19.46% గవర సామాజిక ఓటర్లు ఉన్నారు. యలమంచిలిలో 23.13%, పెందుర్తిలో 7.37%, మాడుగులలో 4.87%, చోడవరంలో 5.77%, నర్సీపట్నంలో 2.65%, విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 7.55%, గాజువాకలో 5.77% ఓటర్లున్నారు. విశాఖ గ్రామీణ పరిధిలో గవర సామాజికవర్గాన్ని పక్కన పెట్టడంపై ఎన్నికల్లో వైకాపాకు గుణపాఠం చెప్పేందుకు నాయకులు అంతర్గతంగా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని