logo

టిడ్కో ఇళ్లకు వీడని గ్రహణం

తెదేపా హయాంలో పేదలకు కోసం కట్టించిన టిడ్కో ఇళ్లపై వైకాపా రాజకీయం చేస్తోంది. పార్టీ రంగులు వేసి ఎన్నికల్లో లబ్ధిపొందాలన్న ఆలోచనతో హడావుడిగా ప్రారంభించారు.

Updated : 29 Mar 2024 05:59 IST

తెదేపా నిర్మించిన ఇళ్లకు వైకాపా రంగులు

ఎన్నికల్లో లబ్ధికే నేతలతో ప్రారంభోత్సవం

నాడు తెదేపా హాయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లకు వైకాపా రంగులు

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: తెదేపా హయాంలో పేదలకు కోసం కట్టించిన టిడ్కో ఇళ్లపై వైకాపా రాజకీయం చేస్తోంది. పార్టీ రంగులు వేసి ఎన్నికల్లో లబ్ధిపొందాలన్న ఆలోచనతో హడావుడిగా ప్రారంభించారు. అనకాపల్లి మండలంలోని సత్యనారాయపురంలో తెదేపా హయాంలో టిడ్కో ఇళ్లు నిర్మించారు. ఎన్నికల కోడ్‌ అనంతరం వైకాపా అధికారంలోకి రావడంతో ఇళ్ల కేటాయింపు నిలిచింది. లబ్ధిదారుల ఎంపిక పేరుతో 2019 నుంచి 2024 వరకు కాలయాపన చేసిన వైకాపా నాయకులు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భవనాలకు వైకాపా రంగులు వేసి, రోడ్లు, డ్రైన్లు నిర్మించారు. ఈ ఏడాది జనవరి నాలుగున టిడ్కో ఇళ్లను వైకాపా ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ప్రారంభించారు. లబ్ధిదారులు ఫ్లాట్‌లోకి దిగడమే తరువాయి అన్నట్లుగా ప్రచారం చేశారు. అయితే ఇక్కడ కనీసం తాగునీటి సదుపాయం కల్పించకపోవడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. టిడ్కో ఇళ్లకు సంపతిపురం మెగా తాగునీటి ప్రాజెక్టు నుంచి తాగునీటిని అందించే పనులు జరుగుతున్నాయి. ఇవి పూర్తయితేనే లబ్ధిదారులకు తాగునీరు అందుతుంది. ఈ పనులు పూర్తికాకుండానే లబ్ధిదారులకు హుటాహుటిన ఇళ్లను కేటాయించి ప్రారంభించారు.

మీటర్ల కోసం డబ్బులు: తెదేపా ప్రభుత్వ హయాంలో ఆర్‌ఏఆర్‌ఎస్‌ నుంచి టిడ్కో ఇళ్లకు ఉచితంగా విద్యుత్తు మీటర్లు బిగించారు. వీటిని తొలగించి కొత్తగా ఏర్పాటుచేయాలని లబ్ధిదారుల నుంచి విద్యుత్తు సంస్థ అధికారులు నగదు తీసుకుని విద్యుత్తు మీటర్లు బిగిస్తున్నారు. పట్టణంలో రూ. వేలకు వేలు అద్దెలు చెల్లించి ఉండలేని పేదలు సత్యనారాయణపురం వచ్చేద్దామని కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇక్కడ తాగునీటి సదుపాయం లేకపోవడంతో నివాసానికి యోగ్యం కాని ఫ్లాట్లుగా మారాయి. హడావుడిగా ప్రారంభోత్సవం చేసిన వైకాపా నాయకులు తాము ప్రారంభించి రెండు నెలలు దాటినా లబ్ధిదారులకు సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని