logo

బెండపూడి పిల్లల్లా..విజయనగరం అనేదెన్నడో?

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బెండపూడి అభ్యసన విధానం అమలు చేయాలని, ప్రతి ఉపాధ్యాయుడు చరవాణిలో ‘గూగుల్‌ రీడ్‌ లాంగ్‌ యాప్‌’ ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో

Published : 21 May 2022 04:27 IST


చదవడం, రాయడంపై సర్వే నిర్వహిస్తున్న జిల్లా కమిటీ సభ్యులు (పాత చిత్రం)

హాయ్‌ సర్‌.. వియ్‌ ఆర్‌ ఫ్రమ్‌ బెండపూడి.. అంటూ ఆంగ్లంలో అదరగొట్టారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. ఇప్పుడు ఏ విద్యార్థి నోట విన్నా.. ఏ ఇద్దరు ఉపాధ్యాయులు కలిసినా వీరి గురించే. రాష్ట్రంలో ఇన్ని బడులు ఉండగా.. అక్కడే ఎందుకు అంత చక్కగా మాట్లాడుతున్నారు అన్నదే చర్చ. 
మరి మన దగ్గరో..
ఉమ్మడి విజయనగరం జిల్లా విద్యార్థులు ఆంగ్లంలో వెనుకబాటు కనిపిస్తోంది. సగటున 40 శాతం మందికి చదవడం, రాయడం రాదని డైట్‌ చేసిన సర్వేలో తేటతెల్లమైంది. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడిన బెండపూడి విద్యార్థులతో పోల్చితే ఎంతో వ్యత్యాసం ఉంది. అక్కడున్న విద్యా విధానాలు జిల్లాకు పూర్తి భిన్నమనే చెప్పొచ్చు. - న్యూస్‌టుడే, విజయనగరం విద్యావిభాగం 

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బెండపూడి అభ్యసన విధానం అమలు చేయాలని, ప్రతి ఉపాధ్యాయుడు చరవాణిలో ‘గూగుల్‌ రీడ్‌ లాంగ్‌ యాప్‌’ ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఆంగ్లం అభివృద్ధి కాకపోవడానికి కారణాలు, నేర్చుకునేందుకు విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై ‘న్యూస్‌టుడే’ కథనం. 
కాకినాడ జిల్లా బెండపూడిలో ఆంగ్లం కోసం ఆరేళ్ల కిందటే ప్రత్యేక ప్రాజెక్టును రూపొందించారు. ప్రయోగశాలను ఏర్పాటు చేయడంతో ఉత్తమ ఫలితాలు వచ్చాయి. మన దగ్గర ఎక్కడా ల్యాబ్‌లు లేవు. నిర్ణీత పీరియడ్లలోనే బోధిస్తున్నారు. భావ వ్యక్తీకరణ నైపుణ్యాల ఊసే లేదు. తరగతి గదుల్లో సాంకేతిక పరిజ్ఞానం కానరాదు. ప్రత్యేకంగా ఉపాధ్యాయుల నియామకం ఉండదు. ఫలితంగా విద్యార్థులు ఆంగ్లమంటేనే భయపడుతున్నారు. 

మాట్లాడే ఉపాధ్యాయులేరీ 
ఆంగ్ల ఉపాధ్యాయుల కొరత ఉంది. ఉన్న వారు కూడా ఆంగ్లంలో మాట్లాడరు. కొందరిలో ప్రతిభ ఉన్నా బోధనకు  అనాసక్తత చూపుతున్నారు. జిల్లాలో ప్రస్తుతమున్న 4,478 ఎస్జీటీల్లో సుమారు 1500 మందే ఆంగ్లంలో మెథడాలజీ, ఎం.ఎ. ఆంగ్లం వంటి కోర్సులు పూర్తిచేశారు. పాఠశాల సహాయకుల్లో 471 మంజూరు పోస్టులకు 440 మంది పనిచేస్తున్నారు. ఇంకా 31 ఖాళీలున్నాయి. 

మన తర‘గతి’ ఇంతే..
తరగతి గదిలో అంతర్జాలం, ల్యాప్‌ట్యాప్‌లు,  మైక్రోఫోన్లు ఉండాలి. వీటి ద్వారా  బెండపూడి తరహాలో విదేశీయులతో మాట్లాడించాలి. జిల్లా విషయానికొస్తే ఎక్కడా ఇవి లేవు. గతంలో కంప్యూటర్‌ విద్యను తీసుకొచ్చినా ఉపాధ్యాయుల తొలగింపుతో మూలకు చేరింది. డిజిటల్‌ తరగతులు 471, స్మార్ట్‌ తరగతులు 32, వర్చువల్‌ తరగతులు 166 పాఠశాలల్లో ఉన్నప్పటికీ మూలకు చేరాయి.

సర్వేలో ఇలా..
 చదవడం, రాయడంపై జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్‌) గత నెలలో జిల్లాలో నాలుగుచోట్ల సర్వే నిర్వహించింది. బాగా చదవడం రాయడం వచ్చిన వారు,  కొంతవరకు చదవడం రాయగలిగినవారు, రెండూ రానివారు ఏ, బి, సి గ్రూపులుగా విభజించారు. సర్వేలో ఆయా పాఠశాలల్లో ఆంగ్లభాష ప్రగతి దారుణంగా ఉందని తేలింది. 

నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వాలి
ఉపాధ్యాయులకు ఆంగ్లంలో మాట్లాడే విధానంపై తగిన శిక్షణ ఇవ్వలేదు. భాషా నైపుణ్యాలపై ఏడాదికి కనీసం పదిరోజుల పాటు శిక్షణ ఇవ్వాలి. ల్యాబ్‌లు ఏర్పాటు చేసి, విద్యార్థులతో ప్రయోగాలు చేయించాలి. ప్రత్యేకంగా ఉపాధ్యాయులను కూడా నియమించాలి. - కుసుమన్న, ఆంగ్లం పాఠశాల సహాయకుడు 
 విద్యార్థుల్లో ఆసక్తి కలిగించాలి 
ఇంగ్లిషు నేర్చుకునేలా విద్యార్థుల్లో ఆసక్తి కలిగించాలి. కృత్యాలు అందించాలి. నిజ జీవితంలో పరిచయమున్న పదాలు, వాక్యాలు మొదటగా నేర్పుతూ భాషపై పట్టు సాధించేలా తరగతి గదిలో వాతావరణం కల్పించాలి. వనరులు, పుస్తకాలు, చిన్న వాక్యాలు గల కార్డులు, పదాలు అందుబాటులో ఉంచాలి. చదవడం, రాయడం, గుర్తుపట్టడం, మౌఖిక కృత్యాలు తరచుగా నేర్పించాలి. చిత్రాలు, సన్నివేశాలు, పదకేళి, ఆటలు, కృత్యాలు ద్వారా నేర్చుకునేలా చూడాలి.
- ఎ.ప్రవీణ్‌కుమార్, ఆంగ్లం ఉపాధ్యాయుడు  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని