logo

దిగుబడిపై అన్నదాతల దిగులు

జిల్లాలో యాసంగి సాగు రైతులకు చేదు అనుభవాన్ని మిగులుస్తోంది. సాధారణంగా వానాకాలంలో దిగుబడి తక్కువ రావడం, కోత సమయంలో అధిక వర్షాలతో నాణ్యత దెబ్బతినడం, పంట నీటి పాలు కావడం తదితర ఇబ్బందులుండేవి.

Published : 23 May 2022 04:08 IST


వెంకిర్యాలలో పచ్చదనంతో కనిపిస్తున్న పొలం

జనగామ రూరల్‌, న్యూస్‌టుడే: జిల్లాలో యాసంగి సాగు రైతులకు చేదు అనుభవాన్ని మిగులుస్తోంది. సాధారణంగా వానాకాలంలో దిగుబడి తక్కువ రావడం, కోత సమయంలో అధిక వర్షాలతో నాణ్యత దెబ్బతినడం, పంట నీటి పాలు కావడం తదితర ఇబ్బందులుండేవి. యాసంగి సీజన్‌లో వరి సాగుకు అనుకూలమైన వాతావరణం తోడు కావడంతో పంట దిగుబడిపై రైతులకు ధీమా ఉండేది. ఈసారి ధాన్యం కొనుగోలుపై సందిగ్ధతతో రైతులు ఆలస్యంగా సాగు చేశారు. మరో వైపు ప్రకృతి సహకరించకపోవడంతో దిగుబడి తగ్గడానికి కారణమవుతోంది. ఏటా వానాకాలం కంటే యాసంగి సీజన్‌లో అధిక దిగుబడులు వచ్చేవి. ఈ యేడు మాత్రం రైతులకు నిరాశనే మిగులుస్తున్న వైనంపై ‘న్యూస్‌టుడే’ కథనం.

కొనుగోలుపై సందిగ్ధం..

రాష్ట్ర వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భేదాభిప్రాయాలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేది లేదని, ప్రత్యామ్నాయ, ఇతర పంటలను సాగు చేసుకోవాలని ప్రకటించింది. ప్రభుత్వ సూచన మేరకు ప్రత్యామ్నాయ పంటలకు ఈ ప్రాంత భూములు పెద్ద మొత్తంలో అనుకూలంగా లేకపోవడం, కోతుల బెడద వంటి కారణాలతో రైతులకు ఏ పంట వేసుకోవాలో తెలియని ఆందోళనకర పరిస్థితి. చివరికి చేసేది లేక రైతులు వరి సాగుపై మొగ్గు చూపారు.

సహకరించని వాతావరణం..

సాధారణంగా డిసెంబరు నుంచి జనవరి 15లోగా వరి నాట్లు వేసుకోవాలి. కానీ రైతులు జనవరి నుంచి ఫిబ్రవరి చివరి దాకా వరి నాట్లు కొనసాగాయి. నిర్ణీత సమయంలో నాట్లు పూర్తైతే ఏప్రిల్‌ 15 నాటికి కోతలు పూర్తయ్యేవి. ఇంకా క్షేత్ర స్థాయిలో సుమారు 30 శాతం పొలాలు పచ్చదనంతోనే కనిపిస్తున్నాయి. జూన్‌ మొదటి వారం వరకు వరి కోతలు జరిగే అవకాశమేర్పడింది. నాట్లు పూర్తయ్యాక ఫిబ్రవరి మొదటి, రెండు వారాల్లో మంచు కురియడం ఆగిపోయేది. కానీ ఈ యేడు మాత్రం మార్చిలోనూ మంచు కురియడంతో పంటలు తెగుళ్ల బారిన పడ్డాయి. పంట సాగు ఆలస్యం కావడం.. తెగుళ్ల నుంచి కోలుకునేందుకు సమయం, ఏప్రిల్‌లో ఎండల తీవ్రతకు పంట పుష్పించే(ఈనె) దశకు చేరడంతో ఆ పుష్పాలు ఎండ తీవ్రతతో దెబ్బతిన్నాయి. దీంతో దిగుబడిపై పెద్దగా ప్రభావం చూపింది.

జిల్లాలో వరి సాగు పరిస్థితి..

జిల్లాలో ఐదేళ్ల కిందట 1.50 లక్షల ఎకరాల వరకు పత్తి పంట సాగయ్యేది. ఆ తర్వాత అధిక వర్షాలతో పత్తి దెబ్బతినడంతో రైతులు నష్టాలు చవి చూశారు. అధిక వర్షాలు, గోదావరి జలాలు జిల్లాకు చేరడంతో జలాశయాలు కళకళలాడుతున్నాయి. క్రమేనా భూగర్భ జలాలు సమృద్ధిగా పెరగడంతో రైతులు వరి సాగుపై మొగ్గు చూపుతున్నారు. 70 వేల ఎకరాల సాగు విస్తీర్ణం నుంచి 1.80 లక్షల ఎకరాలకు పెరిగింది.

అంచనా కంటే తగ్గింది. : - వినోద్‌కుమార్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, జనగామ

జిల్లా వ్యాప్తంగా యాసంగిలో 1.70 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. వాతావరణ పరిస్థితులు, ఆలస్యంగా నాట్లు వేయడంతో దిగుబడిపై ప్రభావం చూపింది. ప్రాథమిక అంచనా మేరకు 2.75 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశాం. కానీ ప్రస్తుత దిగుబడిని పరిశీలిస్తే 2 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని భావిస్తున్నాం.

ప్రస్తుత అంచనా: 2 లక్షల మె.ట.

దిగుబడిపై ప్రాథమిక అంచనా: 2.75 లక్షల మెట్రిక్‌ టన్నులు

సాగైన వరి పంట: 1.70 లక్షల ఎకరాలు


మూడు ఎకరాలకు 35 క్వింటాళ్లే..

ఈ చిత్రంలో వరి ధాన్యం కుప్ప పక్కన కనిపిస్తున్న యువ రైతు పేరు పొలాల రాజు. జనగామ మండలం గానుగుపహాడ్‌ గ్రామం. యాసంగిలో వరి సాగుకు చేసి, పెట్టుబడులకు రూ.60 వేల వరకు ఖర్చు చేశారు. ఏటా 70 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేది. ప్రస్తుతం ఆలస్యంగా సాగు చేయడం, వాతావరణం సహకరించకపోవడంతో 35 క్వింటాళ్లకు మించి దిగుబడి వచ్చే పరిస్థితి లేదని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని