logo

సరిహద్దులపై నిఘా నేత్రం

దండకారణ్యం సరిహద్దు గ్రామాలపై పోలీసులు డేగకన్ను వేశారు. మావోయిస్టు పార్టీ పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో నిఘాను తీవ్రం చేశారు.

Updated : 03 Dec 2022 04:55 IST

అంకన్నగూడెం వద్ద వాహన తనిఖీలు చేస్తున్న సీఆర్పీఎఫ్‌ జవాన్లు, పోలీసులు

వెంకటాపురం, న్యూస్‌టుడే: దండకారణ్యం సరిహద్దు గ్రామాలపై పోలీసులు డేగకన్ను వేశారు. మావోయిస్టు పార్టీ పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో నిఘాను తీవ్రం చేశారు. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతమైన వెంకటాపురం పోలీస్‌ సర్కిల్‌ పరిధిలో శుక్రవారం ఎస్సైలు జి.తిరుపతి, ఆర్‌.అశోక్‌ ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. అటవీ గ్రామాలైన ముత్తారం, కొత్తగుంపు గిరిజన పల్లెల్లో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. అనుమానితులు ఎవరైనా వస్తే తక్షణమే సమాచారం ఇచ్చేలా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. వెంకటాపురం-భద్రాచలం ప్రధాన మార్గంలోని అంకన్నగూడెం వద్ద సీఆర్పీఎఫ్‌ జవాన్లు, ప్రత్యేక పోలీసు బలగాలు గస్తీ తిరిగాయి. ఇరు మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్న ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలను నిషితంగా శోధించారు. కొత్త వ్యక్తుల చిరునామా సేకరించారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా భద్రాచలం-వెంకటాపురం మార్గంలో సాయంత్రం 5 గంటల నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులను నిలిపివేశారు. వారోత్సవాలు ముగిసే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని, ప్రయాణికులు గమనించాలని ఎస్సై జి.తిరుపతి కోరారు. మరోవైపు అభయారణ్యంలో మావోయిస్టులు సంచరించే అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టే పనిలో ప్రత్యేక బలగాలు నిమగ్నమయ్యాయి.

వాజేడు: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో శుక్రవారం పేరూరు పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. జిల్లాలోని పలువురు వ్యక్తులను హెచ్చరిస్తూ మావోయిస్టుల పేరిట గురువారం విడుదలైన లేఖ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అప్రమత్తమైన పోలీసులు లొటపిటగండి, బీరమయ్య గుడి సమీపంలో ఎస్సై హరీశ్‌ ఆధ్వర్యంలో సీఆర్పీఎఫ్‌ జవాన్లు తనిఖీలను చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు