logo

కంటి వెలుగు నిర్వహణకు చర్యలు

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సలహాలు, సూచనలతో జిల్లాలో కంటి వెలుగు శిబిరం నిర్వహణకు చర్యలు చేపట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని జిల్లా కలెక్టర్‌ శివలింగయ్య తెలిపారు.

Published : 07 Dec 2022 05:25 IST

వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్‌ శివలింగయ్య,
అదనపు కలెక్టర్‌, ఇతర శాఖల అధికారులు

జనగామ అర్బన్‌, న్యూస్‌టుడే: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సలహాలు, సూచనలతో జిల్లాలో కంటి వెలుగు శిబిరం నిర్వహణకు చర్యలు చేపట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని జిల్లా కలెక్టర్‌ శివలింగయ్య తెలిపారు. కంటి వెలుగు రెండో విడత కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, అధికారులతో మంత్రి హరీశ్‌రావు మంగళవారం వీడియోకాన్ఫరెన్సులో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌, సంబంధిత శాఖల అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో కంటి పరీక్షలు నిర్వహించేందుకు 26 బృందాలను ఏర్పాటు చేస్తామని, జిల్లాలో ఇప్పటివరకు 26 మంది అర్హులైన అఫ్తామాలజీ అసిస్టెంట్లను నియమించినట్లు చెప్పారు. జిల్లాలో 11 పీహెచ్‌సీలు, 4 సీహెచ్‌సీలు, ఒకటి అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నాయని తెలిపారు. వార్డుల వారీగా జిల్లా పంచాయతీ అధికారి, మున్సిపల్‌ కమిషనర్లు, వైధ్యాధికారుల సమన్వయంతో షెడ్యూల్‌ తయారు చేస్తామని అన్నారు. డీఎంహెచ్‌వో మహేందర్‌, డీపీవో వసంత, పురపాలిక కమిషనర్‌ రజిత, తదితరులు పాల్గొన్నారు.

వందశాతం పూర్తి చేయాలి

జనగామ అర్బన్‌: విద్యుత్తు పొదుపు చర్యల్లో భాగంగా రెడ్కో సంస్థ గ్రామాల్లో ప్రారంభించిన ఎల్‌ఈడీ వీధిదీపాల బిగింపు పనులను అన్ని గ్రామాల్లో వందశాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌తో కలిసి ఎల్‌ఈడీ వీధిదీపాల బిగింపు పనులపై సంబంధింత శాఖల అధికారులతో సమీక్షించారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక నిధులు కేటాయిందన్నారు. అందులో భాగంగానే గ్రామాల్లో రాత్రివేళ వీధిదీపాలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజల దృష్ట్యా ఎల్‌ఈడీ వీధిదీపాలను బిగించాలని సూచించారు. ఎంపీడీవోలు స్థానిక సర్పంచులతో మాట్లాడి వీధిదీపాల బిగింపు జాప్యం లేకుండా చూడాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని