logo

శిఖం భూములపై ఉదాసీనత

గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలో చెరువులు, కుంటలు అన్యాక్రాంతమవుతున్నాయి. ప్రైవేటు వ్యక్తులు యథేచ్ఛగా ఆక్రమణలకు తెగబడుతున్నారు.

Updated : 29 May 2023 05:15 IST

చెరువులో మట్టిని నింపుతూ..

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలో చెరువులు, కుంటలు అన్యాక్రాంతమవుతున్నాయి. ప్రైవేటు వ్యక్తులు యథేచ్ఛగా ఆక్రమణలకు తెగబడుతున్నారు. వరంగల్‌- హనుమకొండ నగర నడిబొడ్డున భద్రకాళి చెరువును ఆక్రమిస్తుంటే రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. హనుమకొండ పద్మాక్షిగుట్ట రోడ్డులో వందల కొద్దీ టిప్పర్లతో మట్టిని తరలిస్తూ.. చెరువు నింపుతున్నారు. ఆరేడు నెలలుగా భద్రకాళి చెరువు శిఖం భూములు గుట్టు చప్పుడు కాకుండా రాత్రికి రాత్రి చదును చేస్తున్నారు. అడిగితే ప్రైవేటు పట్టా భూములని చెబుతున్నారు. పది రోజుల క్రితం భద్రకాళి చెరువు కట్టను తెంచేసి మురుగు మళ్లించారు. ఈనెల 23న ‘ఈనాడు’లో కథనం రావడంతో గురువారం గ్రేటర్‌ వరంగల్‌ అధికారులు కట్టను పూడ్చేశారు. ఫుల్‌ ట్యాంకు లెవల్‌(ఎఫ్‌టీఎల్‌) నిబంధనలు తుంగలో తొక్కుతున్నారని, ప్రైవేటు వ్యక్తులు చెరువులో మట్టి నింపుతున్నారని సామాజిక కార్యకర్తలు ఫిర్యాదు చేసినా.. అధికారులు కదలడం లేదనే విమర్శలున్నాయి.


స్పందించని అధికారులు

హనుమకొండ ప్రాంతంలో కాకతీయ సమాధుల స్థలాల అన్యాక్రాంతంపై సామాజిక కార్యకర్త రాజు ఫిర్యాదు చేశారు. హనుమకొండ మండలం సర్వేనంబరు 910లో 8.03 ఎకరాలు, సిద్దేశ్వర గుండం సర్వేనంబరు 911లో 1.30 ఎకరాలు ప్రభుత్వ భూములే అని అప్పటి హనుమకొండ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు, ఆర్డీవో వాసుచంద్ర 20-12-2021 నాడు రాత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ భూములేనని అధికారులు సమాధానం ఇచ్చి ఆక్రమణలపై చర్యలు తీసుకోవడం లేదని సామాజిక కార్యకర్తలు, స్థానికులంటున్నారు. లెప్రసీ కాలనీ నుంచి ప్రైవేటు నర్సింగ్‌ కళాశాల వరకు భద్రకాళి చెరువు శిఖం భూములు చేజారే పరిస్థితులు నెలకొన్నాయని చెబుతున్నారు.


పద్మాక్షిగుట్ట వైపు భద్రకాళి చెరువును చదును చేస్తూ..

హద్దులు తేల్చకపోవడంతో..

హనుమకొండ పద్మాక్షిగుట్ట, న్యూశాయంపేట రోడ్డు, భద్రకాళి ఫోర్‌ షోర్‌ బండ్‌ దిగువన ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు భూములకు హద్దులు లేవు. ఎవరిష్టం వారిదే అన్నట్లుగా ప్రైవేటు వ్యక్తులు హద్దులు ఖరారు చేసి, ప్లాట్లు చేసి అమ్ముతున్నారు. ఇప్పటికే భద్రకాళి చెరువు, పద్మాక్షమ్మ, సిద్దేశ్వరస్వామి, వీరపిచ్చమాంబ, హనుమకొండ గుట్ట స్థలాల అన్యాక్రాంతంపై లోకాయుక్త న్యాయస్థానం సీరియస్‌గా ఉంది. వచ్చే జూన్‌ నెలాఖరు నాటికి సమగ్ర సర్వే చేసి నివేదిక ఇవ్వాలని న్యాయమూర్తి జిల్లా దేవాదాయ శాఖాధికారులు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఇంతవరకు అడుగు పడటం లేదు. సర్వే చేస్తే వాస్తవాలు బయట పడే అవకాశాలున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు