logo

కొనుగోడు..!

‘యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు పోసి నెల రోజులవుతున్నా తూకాలు చేయమంటే బస్తాలు లేవంటున్నారు.. తూకం వేసి ఇరవై రోజులు గడిచినా బస్తాలను మిల్లులకు తరలించేందుకు లారీలు రావడం లేదంటున్నారు.

Published : 31 May 2023 05:03 IST

కాంటాలు ఆలస్యం.. కానరాని లారీలు
సమస్యలు విన్నవించిన అన్నదాతలు
రైతులతో మాట్లాడుతున్న పౌరసరఫరాశాఖ అధికారి నర్సింగరావు
ఈనాడు వీడియో కాల్‌
ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌

‘యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు పోసి నెల రోజులవుతున్నా తూకాలు చేయమంటే బస్తాలు లేవంటున్నారు.. తూకం వేసి ఇరవై రోజులు గడిచినా బస్తాలను మిల్లులకు తరలించేందుకు లారీలు రావడం లేదంటున్నారు. రవాణా ఛార్జీలు భరించి అద్దె వాహనాల్లో బస్తాలను మిల్లులకు తరలిస్తే నిర్వాహకులు కిరాయి ఇవ్వడం లేదు. నెల గడిచినా ధాన్యం విక్రయించిన సొమ్ము ఖాతాలో జమ కావడం లేదు. మిల్లుల వద్ద దిగుమతి జాప్యం అవుతుండడంతో వెయిటింగ్‌ ఛార్జీల భారంతో అవస్థలు పడుతున్నాం. అకాల వర్షంతో ధాన్యం తడిసిపోయింది’ అని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కర్షకుల ఇబ్బందులు, సమస్యలపై మంగళవారం ‘ఈనాడు’ ఆధ్వర్యంలో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి (డీఎస్‌వో) నర్సింగరావుతో నిర్వహించిన వీడియో కాల్‌ఇన్‌కు జిల్లాలోని వివిధ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల నుంచి రైతులు ఫోన్‌ చేసి తమ కష్టాలు విన్నవించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని రైతులకు ఆయన భరోసా ఇచ్చారు.

అయోధ్యలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో 210 బస్తాల ధాన్యం విక్రయించాను. నెలరోజులు గడిచినా మిల్లులకు తరలించడం లేదు. ఇప్పుడు అకాల వర్షంతో ధాన్యం తడిసింది. మిల్లర్లు వద్దంటే మా పరిస్థితి ఏంటి?

కె.శంకర్‌, అయోధ్య

డీఎస్‌వో: హైదరాబాద్‌ నుంచి 60 లారీలను రప్పిస్తున్నాం. లారీల ద్వారా వరంగల్‌, కరీంనగర్‌ మిల్లులకు ధాన్యం బస్తాలను పంపిస్తున్నాం. జిల్లాలోని మిల్లులకు చాలా వరకు ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకొని పంపించాలని చెబుతున్నాం. మీరు కూడా ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకోండి కిరాయి డబ్బులు వస్తాయి. వర్షానికి బస్తాలు తడిస్తే వెంటనే ఆరబెట్టి కొత్త బస్తాల్లోకి మార్చండి.

130 బస్తాల ధాన్యాన్ని తూకం వేసి 18 రోజులవుతుంది. లారీలు రావడం లేదు. నాతోపాటు కేంద్రాల్లో తూకం వేసిన 13 వేల బస్తాలు నిల్వ ఉన్నాయి. మిల్లులకు తరలించే దాకా మాదే బాధ్యత అనడంతో ఇతర పనులు చేసుకోకుండా ఇబ్బందులు పడతున్నాం. లారీలు వెంటనే పంపించాలి.

రాగి సుధాకర్‌, గున్నేపల్లి

వరంగల్‌, కరీంనగర్‌ మిల్లులకు లారీల్లో ధాన్యం బస్తాలను పంపిస్తున్నాం. దీంతో ఆలస్యం అవుతుంది. జిల్లాలోని మిల్లులకు తరలించడానికి ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకోవాలి. ట్రక్‌ షీట్లు ఇస్తే అద్దె డబ్బులు చెల్లిస్తాం.

ఆలేరులోని కొనుగోలు కేంద్రంలో 233 బస్తాల ధాన్యాన్ని నెల రోజుల కిందట విక్రయించాను. 48 గంటల్లోనే బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమవుతాయని చెప్పారు. ఇంకా రాలేదు.

గోవిందు సుధాకర్‌, ఆలేరు, నెల్లికుదురు

డబ్బులు చెల్లింపులో కొంత ఆలస్యమవుతోంది. అవసరమైన నిధులు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. రాగానే ఖాతాల్లో జమ చేస్తాం.

ఎనిమిది ఎకరాలను కౌలు తీసుకొని వరి వేస్తే 300 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. నెల రోజుల కిందట దంతాలపలి పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లా. గన్నీ సంచులు లేకపోవడంతో తూకం వేయడం లేదంటున్నారు. వర్షం పడుతుండడంతో ఇబ్బంది పడుతున్నాం. త్వరగా తూకాలు వేయించి మిల్లులకు తరలించాలి.

గులోతు రమేశ్‌,  తూర్పుతండా, దంతాలపల్లి

గన్నీ సంచులు పంపిస్తాం. నిర్వాహకులతో మాట్లాడి ధాన్యాన్ని త్వరగా కాంటాలు వేయించి లారీల్లో మిల్లులకు తరలించేలా చర్యలు చేపడుతాం. వాహనాలు రాకుంటే మీరే ట్రాక్టర్లకు అద్దె చెల్లించి దగ్గర్లోని మిల్లుకు తీసుకెళ్లండి. ట్రక్‌షీట్‌ ఆధారంగా కిరాయి డబ్బులు చెల్లిస్తాం.

శనిగపురంలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి ఈనెల 2న 23 బస్తాల ధాన్యాన్ని తీసుకొచ్చాను. కాంటా వేసినా మిల్లులకు తరలించకపోవడంతో అకాల వర్షంతో తడిసింది. న్యాయం చేయాలి.

బానోతు వీరన్న, చిన్న రామోజీతండా

వర్షానికి బస్తాలు తడిస్తే వాటిని ఆరబెట్టి కొత్త బస్తాలో నింపాలి. ట్రాక్టర్లు ద్వారా దగ్గర్లోని మిల్లుకు తరలించండి.


మరికొంత మంది  రైతుల వేదన ఇది

* నర్సింహులపేటకు చెందిన రైతు భూక్య నాను ఐకేపీ కొనుగోలు కేంద్రంలో 50 క్వింటాళ్ల ధాన్యాన్ని పోశారు. నెల రోజులు కావొస్తున్నా కాంటాలు చేయడం లేదని విన్నవించారు.
* ఇనుగుర్తి మండలం చిన్నముప్పారం గ్రామానికి చెందిన రైతు సునీల్‌ కాంటాలు వేసిన బస్తాలు మిల్లులకు తరలడం లేదు. కేంద్రం నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. ట్రాక్టర్ల ద్వారా పంపించాలని చెబుతున్నారు. గత ఏడాది అద్దె డబ్బులు ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు.
* మరిపెడ మండలం బీచ్‌రాజుపల్లికి చెందిన జరుపులు బుజ్జి నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి వేయగా 100 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో పోసి నెలన్నర గడిచినా తూకం వేయడం లేదు. వర్షానికి ధాన్యం తడిసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
* దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల గ్రామానికి చెందిన వల్లపు మల్లేష్‌కు చెందిన 292 బస్తాల ధాన్యం కాంటాలు వేసి వారం రోజులవుతోంది. మిల్లుకు తరలడం లేదు. ఇదే గ్రామానికి చెందిన రైతు సోమయ్యకు నెల రోజుల కిందట 200 బస్తాల ధాన్యాన్ని పోయగా ఇంకా తూకం వేయలేదు. బస్తాలు కేసముద్రం మిల్లుకు వెళ్లి తెచ్చుకోవాలని నిర్వాహకులు చెబుతున్నట్లు అధికారి దృష్టికి తీసుకొచ్చారు.
* మరిపెడ మండలం ఎడ్జర్లకు చెందిన రైతు కృష్ణ ఇటీవల 82 బస్తాల ధాన్యాన్ని విక్రయిస్తే మిల్లుర్లు రూ.3 వేలు కోత పెట్టారని విన్నవించుకున్నారు. డోర్నకల్‌ మండలం చాపలతండాకు చెందిన రైతు శంకర్‌ 214 బస్తాలను ఈ నెల 5న తూకాలు చేయించారు నేటికీ డబ్బులు రాలేదన్నారు. ఇదే మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన రైతు నాగేశ్వర్‌రావు ట్రాక్టర్ల ద్వారా బస్తాలను మిల్లుకు తీసుకెళ్తే వారం రోజుల నుంచి దిగుమతి చేసుకోవడం లేదు. అదనపు ఛార్జీలతో అవస్థలు పడుతున్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని