logo

మహిళలకు తోడూనీడ.. సఖి

బాధిత బాలికలకు, మహిళలకు ఆశ్రయం కల్పిస్తూ అండగా ఉంటుంది ఈ సంస్థ.

Updated : 10 May 2024 05:54 IST

మహబూబాబాద్‌లో అవగాహన కల్పిస్తున్న సఖి బృందం సభ్యురాలు

మహబూబాబాద్‌, నెహ్రూసెంటర్‌, న్యూస్‌టుడే: బాధిత బాలికలకు, మహిళలకు ఆశ్రయం కల్పిస్తూ అండగా ఉంటుంది ఈ సంస్థ. వివిధ రకాల వేధింపులు, గృహహింసకు గురవుతున్న వనితలకు తోడుగా నిలిచి వారిలో భయాన్ని పోగొడుతూ భరోసానిస్తున్న సఖి కేంద్రం మహిళా శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షణలో కొనసాగుతోంది. 2019లో షేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సంస్థ మూడున్నరేళ్లుగా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ సేవలందిస్తోంది.

ఆపదలో ఉన్నవారు ఫోన్‌ కాల్‌ చేస్తే సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్లి వారికి రక్షణ కల్పిస్తారు. ఇందుకోసం సఖి కేంద్రంలో అడ్మిన్‌, లీగల్‌ అడ్వయిజర్‌, ఇద్దరు కౌన్సెలర్లు,  ఏఎన్‌ఎంలు ఇద్దరు, మరో ఏడుగురు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని నర్సంపేట రోడ్‌లో ప్రభుత్వం ఈ కేంద్రానికి సొంత భవనం నిర్మాణం చేసింది.

హెల్ప్‌లైన్‌ ద్వారా..

  • జిల్లాలో 181 హెల్ప్‌లైన్‌ ద్వారా 862 ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. వీటిలో 222 కేసులను తీసుకున్నారు. వంద మంది బాధితులను కాపాడారు.
  • కేంద్రానికి 1255 బాధితుల్లో 650 మందికి ఆశ్రయం కల్పించారు.  
  • 240 మందికి వైద్య సేవలను అందించారు. 
  • స్వధార్‌, ఆశ్రయ, ఇతర గృహాలకు 30 మంది బాధితులను పంపించారు.
  • బాధితులైన 34 మందికి రూ. 8.87 లక్షలు పరిహారంగా ఇప్పించారు. ఇందులో యాసిడ్‌ బాధితురాలికి రూ. లక్ష ఆర్థిక సాయం అందజేశారు.  
  • 248 కేసులకు సంబంధించి పోలీసుల సహాయం తీసుకున్నారు.
  • సఖి బృందం సభ్యులు వివిధ ప్రాంతాల్లో 974 అవగాహన కార్యక్రమాలను నిర్వహించగా వీటిలో 73,872 మంది పాల్గొన్నారు. లీగల్‌ కౌన్సెలింగ్‌, సైకో సోషల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

పలు కేసుల్లో బాధితులకు అండగా

  • జిల్లాలోని ఓ గ్రామంలో భార్యపై యాసిడ్‌ పోసి చంపేశాడు. తర్వాత అతను ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వారి పిల్లలు అమ్మమ్మ-తాతయ్య దగ్గర ఉంటున్నారు. తమ కూతురికి అన్యాయం జరిగిందని మహిళా, శిశు సంక్షేమ శాఖాధికారులను సంప్రదించగా బాధితురాలి పిల్లలకు అమ్మమ్మ పేరిట బ్యాంక్‌లో జాయింట్‌ ఎకౌంట్‌ తీసి రూ.75,000 రెండు విడతలుగా అందించారు.
  • భర్తతో గొడవ పడిన ఓ మహిళా తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్మ చేసుకోవడానికి వచ్చిందని డోర్నకల్‌ రైల్వే పోలీసులు సఖి కేంద్రానికి ఫోన్‌ చేసి చెప్పారు. వెంటనే సిబ్బంది వారిని కేంద్రానికి తీసుకువచ్చి ఆశ్రయం కల్పించారు. అనంతరం పిల్లల జీవితాలను మెరుగుపరిచి వారిని ఉన్నత స్థితికి తీసుకురావాలని కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఆ మహిళా ఆత్మహత్యాయత్నాన్ని విరమించుకొని ధైర్యంగా పిల్లలతో కలిసి జీవనం గడుపుతున్నారు.
  • ప్రేమ వివాహం చేసుకున్న భర్త మద్యానికి బానిసై పని లేకుండా తిరుగుతున్నాడు. జన్మించిన పాపను కూడా పట్టించుకోక పోవడంతో తొర్రూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారిని పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. నేడు ఆ దంపతులు అన్యోన్యంగా ఉంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని