logo

జల దిగ్బంధంలో ౩౦ ఊళ్లు

గోదారమ్మ విలీన మండలాల ప్రజలతో దోబూచులాడుతోంది. వరద తగ్గినట్టే తగ్గి మళ్లీ రోజుల వ్యవధిలోనే పెరుగుతుండటంతో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని వేలాది మంది కంటి మీద కునుకు లేకుండా కాలం వెళ్లదీస్తున్నారు. గత నెల 10న ప్రారంభమైన

Updated : 17 Aug 2022 06:53 IST

 తగ్గినట్టే తగ్గి పెరుగుతున్న వరద

కంటి మీద కునుకు లేని జనం

తిరుమలాపురం గ్రామాన్ని ఆనుకొని ప్రవహిస్తున్న వరద

వేలేరుపాడు, న్యూస్‌టుడే: గోదారమ్మ విలీన మండలాల ప్రజలతో దోబూచులాడుతోంది. వరద తగ్గినట్టే తగ్గి మళ్లీ రోజుల వ్యవధిలోనే పెరుగుతుండటంతో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని వేలాది మంది కంటి మీద కునుకు లేకుండా కాలం వెళ్లదీస్తున్నారు. గత నెల 10న ప్రారంభమైన వరద ఉద్ధృతి 15 రోజుల పాటు ఉగ్రరూపం దాల్చి రెండు మండలాల్లోని వందలాది ఇళ్లను ముంచెత్తడంతో ప్రజలు చెట్టుకొకరు పుట్టకొకరయ్యారు.  మళ్లీ ఈ నెల 9 నుంచి వరద క్రమేపీ పెరుగుతూ భద్రాచలం వద్ద 52 అడుగులకు చేరుకుని ఆదివారం సాయంత్రానికి 46 అడుగులకు తగ్గింది. పంట పొలాలతో పాటు గ్రామాలకు వెళ్లే రహదారులు వరద నుంచి బయటపడి రాకపోకలు పునరుద్ధరణ అవుతాయనుకుంటుండగా.. సోమవారం సాయంత్రం నుంచి ముచ్చటగా మూడోసారి క్రమేపీ పెరుగుతూ మంగళవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు.

నిలిచిన రాకపోకలు
వరద పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టకపోవడంతో వారం రోజులుగా మండలంలోని 30 గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. భద్రాచలం వద్ద వరద 35 అడుగులకు చేరుకోగానే మండలంలోని యడవల్లి- బోళ్లపల్లి గ్రామాల మధ్యలోని ఎద్దువాగు వంతెన నీట మునిగి అవతలున్న కొయిదా, కట్కూరు పంచాయతీల పరిధిలోని 17 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. వరద క్రమేపీ పెరగడంతో ఈ నెల 11 నుంచి మండల కేంద్రానికి ఆనుకొని ఉన్న మరో 13 గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులపైకి నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా గ్రామాల ప్రజలు అటు విద్యుత్తు సౌకర్యం లేక.. ఇటు తినేందుకు సరైన తిండి లేక అవస్థలు పడుతున్నారు.  
వరుసగా వస్తున్న వరదలతో ఇళ్లను ఖాళీ చేసి చెల్లాచెదురైన ముంపు బాధితుల గోడును పట్టించుకునే వారే కరవయ్యారు. గుట్టపై తలదాచుకున్న రుద్రంకోటలోని రెండు వందల కుటుంబాలకు అధికారులు తాగునీరు, పాలు, కొవ్వొత్తులు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. చిగురుమామిడి, తూర్పుమెట్ట, తాట్కూరుగొమ్ము, నార్లవరం, తిరుమలాపురం, వేలేరుపాడు సంతబజారులోని వేలాది కుటుంబాల బాగోగులను తెలుసుకునే యత్నం కూడా చేయడం లేదు.

నీటిమట్టం 33.65 మీటర్లు
పోలవరం, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద మంగళవారం సాయంత్రానికి 33.65 మీటర్లకు నీటిమట్టం పెరిగింది. 48 గేట్ల నుంచి దిగువకు 10.70 లక్షల క్యూసెక్కుల వరద దిగువకు వెళ్తోంది. మూడు రోజులుగా నెమ్మదిగా తగ్గుతున్న వరద తిరిగి సోమవారం రాత్రి నుంచి పెరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని