logo

ఎగసిపడ్డ మంటలు.. తీవ్రంగా గాయపడ్డ బాలుడు

ఆకివీడులో నెల రోజుల వ్యవధిలో జరిగిన రెండు సంఘటనలతో నివాసిత ప్రాంతాల పరిధిలో ఉండే చిన్న చెత్తకుప్పను తగులబెట్టాలన్నా స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Published : 28 Nov 2022 06:17 IST

చెత్తే కదా అని తగులబెడితే ముప్పు


మంటల్లో గాయపడ్డ మహేష్‌

ఆకివీడు, న్యూస్‌టుడే: ఆకివీడులో నెల రోజుల వ్యవధిలో జరిగిన రెండు సంఘటనలతో నివాసిత ప్రాంతాల పరిధిలో ఉండే చిన్న చెత్తకుప్పను తగులబెట్టాలన్నా స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చెత్తే కదా అని తగలబెడితే ప్రాణాల మీదకు వస్తున్న సంఘటనలు ఆకివీడులో చోటుచేసుకున్నాయి. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు ఆకివీడు రైల్వే స్టేషన్‌ ఎదురుగా ఉన్న రెడ్డి వీధిలో ఒక వ్యక్తి ఆ ప్రాంతంలో ఉన్న చెత్త కుప్పను ఆదివారం సాయంత్రం తగులబెట్టాడు. సమీపంలో ఇద్దరు బాలురు ఆడుకుంటున్నారు. చెత్త కుప్ప నుంచి ఒక్కసారిగా పేలుడు శబ్దం వచ్చి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ సంఘటనలో బొడ్డు మహేష్‌(11) శరీర భాగాలు కాలి తీవ్రంగా గాయపడ్డాడు. ఒక్కసారిగా జరిగిన ఈ హఠాత్‌ పరిణామానికి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. గాయపడ్డ బాలుడిని తొలుత ఆకివీడులోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి అనంతరం భీమవరం ఆసుపత్రికి తరలించారు. ఈ నెలలో ఇది రెండో సంఘటన. మొదటిది ఆకివీడులోని అయిభీమవరం రోడ్డు కూడలి సమీపంలో ఒక ఎరువులు దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్న రామబోయిన సుబ్రహ్మణ్యం (53) ఈ నెల 8వ తేదీన ఉదయం సుమారు 11 గంటల సమయంలో దుకాణం సమీపంలో పాత కాగితాలు, చెత్తను తగులబెట్టగా ఒక్కసారిగా భారీస్థాయిలో మంటలు ఎగసిపడ్డాయి. ఈ సంఘటనలో సుబ్రహ్మణ్యం ముఖం, చేతులు కాలి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ సుబ్రహ్మణ్యాన్ని స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్నారు. ఇప్పటికీ ఆయనకు పూర్తిస్థాయిలో గాయాలు మానలేదు. కాగితాలు తగులబెట్టిన ప్రాంతంలో నాటు తుపాకీకి వినియోగించే చిన్న ఇనుప గుళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ సంఘటన మరిచి పోకుండానే ఆదివారం ఈ ఘటన జరగడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని