logo

అవినీతికి ఉపాధి..!

ఉపాధి హామీ పథకంలో తవ్వినకొద్దీ అవినీతి బయటపడుతోంది. రెండేళ్లలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సామాజిక తనిఖీ (సోషల్‌ ఆడిట్‌) ద్వారా రూ.1.89 కోట్ల రికవరీలు రావడం గమనార్హం.

Published : 28 Nov 2022 06:20 IST

సామాజిక తనిఖీలతో వెలుగులోకి
తాడేపల్లిగూడెం, న్యూస్‌టుడే

పాధి హామీ పథకంలో తవ్వినకొద్దీ అవినీతి బయటపడుతోంది. రెండేళ్లలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సామాజిక తనిఖీ (సోషల్‌ ఆడిట్‌) ద్వారా రూ.1.89 కోట్ల రికవరీలు రావడం గమనార్హం. కొందరిపై రెవెన్యూ రికవరీ యాక్టు సైతం ప్రయోగించిన ఘటనలు ఉన్నాయి. మరికొందరిని ఉద్యోగాల నుంచి తొలగించారు. అయినా క్షేత్రస్థాయిలో అవినీతి జలగలు మట్టి పనుల్లో చేతివాటం చూపుతూనే ఉన్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.85.94 లక్షలు దుర్వినియోగం అయినట్లు గుర్తించారు. 2022-23లో ఇప్పటివరకు రూ.1.03 కోట్లకు లెక్కాపత్రాలు లేకుండాపోయాయి. సరైన చర్యలు లేకపోవడంతోనే అక్రమాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి.  

ప్రహసనంలా రికవరీ..

నిధుల దుర్వినియోగమైనట్లు తేల్చిన మండలాల్లో సాంకేతిక, క్షేత్రసహాయకులు, ఇంజినీరింగ్‌ కన్సల్టెన్సీల్లో కొందరు ఉద్యోగాలను వదిలేస్తుండటం గమనార్హం. వీరి నుంచి కూలీల సొమ్ము రికవరీ ప్రహసనంలా మారుతోంది. రెవెన్యూ రికవరీ యాక్టు ప్రయోగించి వసూలు చేయాల్సి వస్తోంది. గత రెండేళ్లలో ఇలా రూ.70 లక్షల వరకు వసూలు చేయడానికి నోటీసులు ఇచ్చారు. ఇప్పటి వరకు రూ.16 లక్షలు రికవరీ చేయగలిగారు.


ఈ విషయమై సంబంధిత అసిస్టెంట్‌ ప్రాజెక్టు డైరెక్టర్లు మాట్లాడుతూ.. సాంకేతిక లోపాలతోనే లెక్కల్లో పొరపాట్లు దొర్లాయన్నారు. వాటిని చెల్లించిన నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారమే వారిని విధుల్లోకి తీసుకున్నామని తెలిపారు.


తొలగించిన వారిని మళ్లీ విధుల్లోకి తీసుకుంటూ..

గతేడాది కాలంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అవినీతికి పాల్పడ్డారని 12 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. పెదవేగి, టి.నరసాపురం మండలాల్లో తిరిగి ఆడిట్‌ నిర్వహించారు. దీంతో రూ.లక్షల్లో రికవరీలు వచ్చాయి. ఏపీఓ, ఇంజినీరింగ్‌ కన్సల్టెన్సీ, సీవోలను ఇద్దరేసి చొప్పున ఆరుగురిని, సాంకేతిక, క్షేత్ర సహాయకులు ఆరుగురిని మొత్తం 12 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. మొత్తం 24 మందిపైనే సస్పెన్షన్‌కు గురయ్యారు. కొన్నాళ్ల తర్వాత అధికారులు వీరిని తిరిగి విధుల్లోకి తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని