logo

కానరాని పల్లె వెలుగులు

గుడివాడ, కైకలూరు, ముదినేపల్లిలోని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో అనేకమంది విద్యార్థులు చదువుతున్నారు.

Published : 23 Jan 2023 05:37 IST

కలిదిండి, ముదినేపల్లి, కైకలూరు, న్యూస్‌టుడే: గుడివాడ, కైకలూరు, ముదినేపల్లిలోని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో అనేకమంది విద్యార్థులు చదువుతున్నారు. వారంతా ఆటోలు, ప్రైవేటు వాహనాలపైనే నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. రాత్రి 7 గంటలు దాటితే ఆటోలు అందుబాటులో లేక కళాశాలల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇతర డిపోల బస్సులు ఆపకపోవటంతో ఇటీవల విశ్వనాద్రిపాలెం వద్ద విద్యార్థులు ఆందోళన నిర్వహించారు.

బస్సుల కోసం ‘శివారు’ ప్రజల ఎదురుచూపులు

* కలిదిండి మండలంలో పెదలంక నుంచి కైకలూరు మీదుగా ఏలూరు వెళ్లే బస్సు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో భీమవరం నుంచి కొండంగి మీదుగా పెదలంకకు ఒక బస్సు, గుడివాడ నుంచి మూలలంక మీదుగా పెదలంక వరకు మరొకటి తిప్పేవారు. రహదారులు అధ్వానంగా ఉండటËంతో భీమవరం నుంచి పెదలంకకు వెళ్లే సర్వీసును నిలిపివేశారు. కోరుకొల్లు నుంచి కైకలూరుకు బస్సు సర్వీసును నడపాలని చాలాకాలంగా కోరుతున్నప్పటికీ నెరవేరలేదు.  

జిల్లా కేంద్రానికి బస్సు సదుపాయం ఉండాలి..

జిల్లాల పునర్విభజన తరవాత ఏలూరు వెళ్లాల్సిన అవసరం పెరిగింది. పెదలంక నుంచి నేరుగా ఏలూరు వెళ్లాలంటే ఆటోలో  కలిదిండి వెళ్లి.. అక్కడ నుంచి మరో ఆటోలో కైకలూరు వెళ్లాల్సిన పరిస్థితి. బస్సులు ఏర్పాటు చేస్తే 10 గ్రామాల ప్రజలకు మేలు జరుగుతుంది.

దుగ్గిరాల పరమేశ్వరరావు, పెదలంక, కలిదిండి మండలం

* కైకలూరు నియోజకవర్గంలో ప్రజలు ఆర్టీసీ బస్సు సదుపాయం లేక అవస్థలు పడుతున్నారు. గతంలో కృష్ణాజిల్లాలో ఉన్నప్పుడు కైకలూరు, కలిదిండి, ముదినేపల్లి, మండవల్లి మండలాల్లోని శివారు ప్రాంతాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. రహదారులు ధ్వంసం కావడంతో అక్కడక్కడా తిరిగే ఒకటీ, రెండు బస్సులను కూడా నిలిపివేశారు. ఏలూరు జిల్లాలో విలీనమయ్యాక ఈ సమస్య మరింత జటిలంగా మారింది. ముదినేపల్లి, మండవల్లి, కలిదిండి, కైకలూరు మండలాల నుంచి నేరుగా ఏలూరు వెళ్లడానికి బస్సులు లేవు. శివారు గ్రామాల నుంచి మండల కేంద్రానికి, అక్కడి నుంచి కైకలూరు వెళ్లేందుకు ఆటోలను ఆశ్రయించాల్సిన పరిస్థితి.

* పెదలంక నుంచి కలిదిండి, కైకలూరు మీదుగా, ముదినేపల్లి నుంచి కోరుకొల్లు, కైకలూరు మీదుగా ఏలూరుకు రోజువారీ సర్వీసులతో పాటు ద్వారకాతిరుమలకు ప్రతి శనివారం బస్సు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపింపామని స్థానిక ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు తెలిపారు.

* ఇటీవల ముదినేపల్లిలో బస్సు ఖాళీ లేదని బొమ్మినంపాడు గ్రామానికి చెందిన విద్యార్థులను కిందకి దించేశారు. ఆ గ్రామానికి ఆర్డినరీ సర్వీసు లేకపోవడంతో ఇంటికి వెళ్లడానికి నానా అవస్థలు పడ్డారు

* ముదినేపల్లి మండలం కొరగుంటపాలెం గ్రామానికి చెందిన మౌనిక ముదినేపల్లిలోని ఓ కళాశాలలో ఎంబీఏ చదువుతున్నారు. 5 గంటలకు తరగతులు ముగిశాక గ్రామానికి వెళ్లే బస్సులు ఉండటం లేదు. బంటుమిల్లి వెళ్లే బస్సు ఎక్కి సింగరాయపాలెం వద్ద దిగి, అక్కడి నుంచి ఆటోలో స్వగ్రామానికి వెళ్లాల్సి వస్తోంది. ఇంటికి వెళ్లేసరికి ఒక్కోసారి రాత్రి 8 గంటలు అవుతుందని ఆమె వాపోయారు. కళాశాల వదిలే సమయానికి పల్లె వెలుగు బస్సు అందుబాటులో ఉంటే విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు.

ఇదీ పరిస్థితి

* ముదినేపల్లి మండలంలో చిగురుకోట, కాకరవాడ, చినకామనపూడి, పెదకామనపూడి, వాడవల్లి తదితర గ్రామాలకు బస్సు సర్వీసులు లేవు. కైకలూరు నుంచి గుడివాడకు రాత్రి ఏడు గంటలు దాటిన తర్వాత బస్సు ఉండకపోవడంతో అవస్థలు పడుతున్నారు. సాయంత్రం 6 గంటలు దాటితే సింగరాయపాలెం నుంచి కోరుకొల్లు వెళ్లేందుకు ఆర్టీసీ ప్యాసింజర్‌ సర్వీసు లేకపోవటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

* కైకలూరు మండలంలో రామవరం నుంచి కైకలూరుకు గతంలో ఉన్న సర్వీసును రద్దు చేయడంతో గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు. కైకలూరు నుంచి ఆలపాడు మీదుగా పందిరిపల్లెగూడెం వెళ్లే మార్గంలో బస్సు ఏర్పాటు చేయాలని లంకగ్రామాల ప్రజలు కోరుతున్నా ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు పడలేదు.

Read latest West godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు