logo

సంక్షోభం దిశగా సంక్షేమం!

విద్యా దీవెన, వసతి దీవెన అంటూ గొప్పలు చెబుతున్న సర్కారు మాటలు వసతి గృహాల తలరాతను మార్చలేకపోతున్నాయి.

Published : 02 Feb 2023 06:14 IST

విద్యార్థులకు తప్పని ఇబ్బందులు

* ఇక్కడ సుమారు వంద మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు. ఇరుకు గదులు, వెలుతురు లేకుండా ఉన్న గదుల్లో మగ్గిపోతున్నారు. ఇక్కడ మరుగుదొడ్లు సైతం అధ్వానంగా మారాయి. భవనానికి నెలకు రూ.49,500 వరకు అద్దె చెల్లిస్తున్నారు.


* తణుకు పట్టణం ఇరగవరం కాలనీలోని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వసతి గృహం ఇది. శ్లాబు పెచ్చులుపెచ్చులుగా ఊడి ఊచలు కనిపిస్తున్నాయి. కొద్దిపాటి వర్షానికే నీరు కారుతోంది. మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఇక్కడ పాఠశాల స్థాయి 28, కళాశాల స్థాయి విద్యార్థినులు 26 మంది ఉన్నారు.  


తణుకు, తాడేపల్లిగూడెం అర్బన్‌, న్యూస్‌టుడే: విద్యా దీవెన, వసతి దీవెన అంటూ గొప్పలు చెబుతున్న సర్కారు మాటలు వసతి గృహాల తలరాతను మార్చలేకపోతున్నాయి. పాఠశాల, కళాశాల సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల ఇబ్బందులను పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. అరకొర వసతులతో ఈసూరోమంటూ సంక్షోభం దిశగా ‘సంక్షేమం’ పయనిస్తోంది. ప్రభుత్వ భవనాల్లో ఉండాల్సిన హాస్టళ్లు పలు చోట్ల అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన దినసరి భోజన పట్టిక ప్రచారానికి మాత్రమే పరిమితమవుతోంది.  


కేవలం రూ.1400

వసతి గృహంలో ఉంటున్న ఒక్కో కళాశాల విద్యార్థికి  రూ.1400 మాత్రమే సర్కారు చెల్లిస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన మెనూ ఆధారంగా నాణ్యమైన ఆహారం అందించాలంటే  ప్రస్తుత రేట్లు ప్రకారం రూ.రెండు వేల నుంచి రూ.2500 వరకు ఖర్చు అవుతోంది. కరోనా తర్వాత నిత్యావసరాల ధరలు రెట్టింపు స్థాయిలో పెరిగాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం 2018 తర్వాత మెస్‌ ఛార్జీలను పెంచలేదు. దీనికితోడు నెలలు తరబడి బిల్లులను మంజూరు చేయకపోవడంతో నిర్వాహకులు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుత ధరలకు అనుగుణంగా మెస్‌ ఛార్జీలు పెంచాలని విద్యార్థి, ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నా ప్రభుత్వం ఇప్పటి వరకూ స్పందించలేదు.
* తాడేపల్లిగూడెం పట్టణంలో నాలుగు సాంఘిక సంక్షేమ, రెండు బీసీ వసతి గృహాలున్నాయి. వాటిల్లో సుమారు 295 విద్యార్థులు ఉంటున్నారు. వీటిలో రెండు మినహా మిగిలినవన్నీ అద్దె భవనాల్లో ఉన్నాయి. రూ.వేలల్లో అద్దెలు చెల్లిస్తున్నా.. వసతులు మాత్రం అధ్వానంగా ఉంటున్నాయి.
* తణుకు పట్టణంలో వెనుకబడిన తరగతులు, సాంఘిక సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. ఒక్కో గృహంలో 50  వంద మంది విద్యార్థులున్నారు. దశాబ్దాల కిందట నిర్మించిన భవనాలు నేడు శిథిల దిశకు చేరుకున్నాయి.  నీ పట్టణ శివారు ఇరగవరం కాలనీలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ బాలికలు, కళాశాల వసతి గృహాల్లో పరిస్థితి దారుణంగా ఉంది.   వర్షం కురిస్తే భవనాలు నీరు కారుతుండటంతో ఇబ్బందులు తప్పడం లేదు.


వేలల్లో అద్దెలు..

బీసీ సంక్షేమ వసతి గృహ భవనానికి (నెలకు) రూ. 32 వేలు, ఎస్సీ వసతి గృహానికి రూ. 49 వేల చొప్పున అద్దె చెల్లిస్తున్నారు. వీటిల్లో 50 నుంచి వంద మంది విద్యార్థులు చదువుతున్నారు. బీసీ వసతి గృహంలో తాగునీటిని ఫిల్టర్‌ చేసే యంత్రం మరమ్మతుకు గురైంది. దీంతో విద్యార్థులు ప్రైవేటు కేంద్రాల నుంచి నీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఎదురైంది.


మెరుగైన వసతుల కల్పనకు కృషి

జిల్లాలో వెనుకబడిన తరగతుల వసతి గృహాలు 29 ఉండగా వాటిలో 17 అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. వీటిలో 1298 మంది విద్యార్థులు ఉన్నారు. బీసీ వసతి గృహాలకు సంబంధించి డైట్‌ బిల్లులు, కాస్మోటిక్‌ బిల్లులు గడిచిన డిసెంబరు వరకు విడుదలయ్యాయి.

వసతి గృహాల్లో మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తాం అని వెనుకబడిన తరగతుల వసతి గృహాల జిల్లా అధికారి గణపతిరావు తెలిపారు.
* తణుకు పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహం దుస్థితి ఇది. ఇక్కడ 37 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు. ఇక్కడ తాగేందుకు సురక్షిత తాగునీరు కూడా కరవైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని