logo

కోడేరు ఇసుక రీచ్‌పై దాడులు

అక్రమాలకు అడ్డాగా మారిన ఆచంట మండలం కోడేరు ఇసుక రీచ్‌పై గురువారం రాత్రి అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు.

Published : 03 Feb 2023 02:41 IST

మూడు పొక్లెయిన్లు, నాలుగు వాహనాల స్వాధీనం
పరారైన జేపీ సిబ్బంది, అధికార పార్టీ నాయకులు

స్వాధీనం చేసుకున్న వాహనాలు

ఆచంట, న్యూస్‌టుడే: అక్రమాలకు అడ్డాగా మారిన ఆచంట మండలం కోడేరు ఇసుక రీచ్‌పై గురువారం రాత్రి అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. నరసాపురం సబ్‌కలెక్టరు సూర్యతేజ ఆదేశాలతో ఇన్‌ఛార్జి తహశీల్దారు ఆర్‌.రాజ్యలక్ష్మి, ఎంపీడీవో జగన్నాథరావు, పెనుగొండ ఎస్సై సురేంద్రకుమార్‌ ఆధ్వర్యంలో సుమారు 30 మంది సిబ్బంది ఏకకాలంలో ఈ దాడుల్లో పాల్గొన్నారు. మూడు పొక్లెయిన్లు, నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జేపీ సిబ్బందితో పాటు రీచ్‌ నిర్వహణ చూస్తున్న అధికార పార్టీకి చెందిన ముగ్గురు నాయకులు అక్కడి నుంచి జారుకున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి, బిల్లులు సైతం లేకుండా అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న వైనంపై ‘గోదారి గర్భంలో తోడేస్తున్నారు’ శీర్షికతో జనవరి 31న ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి అధికార యంత్రాంగం స్పందించింది. బుధవారం ఇన్‌ఛార్జి తహశీల్దారు ఆర్‌.రాజ్యలక్ష్మి తన సిబ్బందితో వెళ్లి రీచ్‌లో తవ్వకాలను పరిశీలించారు. రాత్రి సమయంలో తవ్వకాలకు సంబంధించిన అనుమతి పత్రాలు, పర్యావరణ అనుమతులు చూపించాలని కోరడంతో రీచ్‌ నిర్వాహకులు ఒకరోజు సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నదిలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న తవ్వకాలు, రాత్రి సమయంలో రవాణా తదితర అంశాలను ఇన్‌ఛార్జి తహశీల్దారు సబ్‌కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ఆదేశాలతో దాడులు చేసి రీచ్‌ను సీజ్‌ చేశారు.

కౌంటర్‌ వదిలి పరారైన జేపీ సిబ్బంది

అనుమతులు లేకుండానే...

పర్యావరణ అనుమతులతో పాటు తవ్వకాలకు సంబంధించిన అనుమతులు గత ఏడాది జూన్‌ నెలతోనే ముగిసినట్లు తెలుస్తోంది. కానీ వరదల అనంతరం నవంబరులో బాటలు ఏర్పాటు చేసి తవ్వకాలు చేపట్టేశారు. ఈ వ్యవహారం మైనింగ్‌ శాఖకు తెలిసినా అధికార పార్టీ నేతల సిఫార్సులతో పట్టించుకోలేదు. మరోపక్క రాత్రి సమయంలో తవ్వకాలకు సంబంధించి ఈ రీచ్‌కు ఎటువంటి అనుమతులు లేవు. అయినా అన్ని అనుమతులు ఉన్నట్లు దర్జాగా తవ్వకాలు కొనసాగిస్తున్నారు. సమీప అపరకర్మల భవనాన్ని సైతం స్వాధీనం చేసుకుని కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

నిర్వాహకులను అరెస్టు చేయాలి

ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా తవ్వకాలు జరుపుతున్న అధికార పార్టీకి చెందిన నిర్వాహకులపై కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని కోడేరు గ్రామానికి చెందిన పలువురు అధికారులను కోరారు. నేతల ఒత్తిడికి గురై చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అక్రమ తవ్వకాలకు పాల్పడిన జేపీ సిబ్బందితోపాటు నిర్వాహకులపైనా కేసులు నమోదు చేస్తామని ఇన్‌ఛార్జి తహశీల్దారు ఆర్‌.రాజ్యలక్ష్మి ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని