logo

రామరాజ్యం.. జనుల భాగ్యం

యుగాలు గడిచినా సుస్థిర పాలనకు పెట్టింది పేరు శ్రీరామరాజ్యం. కరవు ఛాయలు లేకుండా అకాల మరణాలు రాకుండా జనులంతా సుఖసంతోషాలతో జీవించేలా శ్రీరాముని పాలన కొనసాగేది.

Published : 17 Apr 2024 06:06 IST

 సమర్థ పాలనకు ఓటే పరిష్కారం
నేడు శ్రీరామనవమి

యలమంచిలి, న్యూస్‌టుడే: యుగాలు గడిచినా సుస్థిర పాలనకు పెట్టింది పేరు శ్రీరామరాజ్యం. కరవు ఛాయలు లేకుండా అకాల మరణాలు రాకుండా జనులంతా సుఖసంతోషాలతో జీవించేలా శ్రీరాముని పాలన కొనసాగేది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న అరాచకాలు, అక్రమాలను తిప్పికొట్టాలంటే రాముడి లక్షణాలున్న ఉత్తమ నాయకులను రానున్న ఎన్నికల్లో ఓటర్లు ఎన్నుకోవాల్సి ఉంది. పీడిత పాలన నుంచి బయటపడి ప్రజారంజక పాలన తెచ్చుకునే సదావకాశం మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఓటరుకు వచ్చింది. ఓటును రామబాణంగా భావించి స్వార్థపరుల పాలనకు తెరదించడానికి నేటి శ్రీరామనవమి నుంచి సరిగ్గా 25 రోజుల సమయం ఉంది.

రాక్షస దోపిడీ..

రాక్షసుల నుంచి మునులను జనులను రాముడు రక్షించేవాడు.   అయిదేళ్లలో దోపిడీదారులే ప్రజల పాలిట రాక్షసులయ్యారు. ఉమ్మడి జిల్లాలో యథేచ్ఛగా ఇసుక, మట్టి, కంకరవంటి ప్రకృతి వనరులను కొల్లగొట్టి ఎక్కడికక్కడ జేబులు  నింపేసుకున్నారు. కాల్వగట్లు, నదీగర్భాలను సైతం వదలకుండా తూట్లు పొడిచారు. వనరులను కొల్లగొట్టడం కాకుండా వనరులను కాపాడటం సృష్టించడం శ్రీరామ ధర్మం. అటువంటి ధర్మాత్ములకు ఓటర్లంతా మద్దతివ్వాల్సి ఉంది.

మాటంటే ప్రాణం...

ఓట్లు కొల్లగొట్టేందుకు ఏవిబడితే అవి హామిలిచ్చి అవసరం తీరాక పట్టించుకోని కొందరు పాలకులను ఉమ్మడి జిల్లాలో చూశాం. ఉదాహరణకు భీమవరంలో వంతెనలు కట్టిస్తామని, నరసాపురం ప్రాంతానికి ఫిషింగ్‌ హార్బర్‌ తెస్తామని, దగ్గులూరులో వైద్య కళాశాల నిర్మిస్తామని నేతలు మాటిచ్చి నిలుపుకోలేకపోయారు. రామరాజ్యంలో మాటంటే ప్రాణంతో సమానం. మాట తప్పని నాయకులకు ఈసారి ఓట్లాభిషేకం చేయడం ఓటర్ల బాధ్యత.

ఆకాంక్షలకు అనుగుణంగా...

పాలన ప్రజారంజకంగా ఉండేలా రాముడి ప్రణాళిక ఉండేది. ఇటీవల కాలంలో ప్రతిపనికీ మామూళ్లు వసూళ్లు చేసే నేతలు ఉమ్మడి జిల్లాలో తారసపడ్డారు. స్వార్థం కోసం అధికారాన్ని వినియోగించేవారు అక్రమ కేసులు బనాయించేవారు అత్యధికంగా పరిపాలనకు వచ్చారు. వ్యక్తిగత ప్రణాళిక తప్ప ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకునేవారు కరవయ్యారు. స్వలాభం కోసం పదవులను అడ్డుపెట్టుకునేవారు కాకుండా ప్రజల బాగోగులే ఎజెండాగా ఉండే నాయకులకు నియోజకవర్గ పగ్గాలు అప్పగించేలా ఈసారి ఎన్నికల్లో ఏకపక్ష నిర్ణయం వెలువడాలి. ఉభయ జిల్లాల్లోని 14 నియోజకవర్గాల పేర్లు వేర్వేరైనా ప్రజాక్షేమం, సంక్షేమంలో అయోధ్యకు మారుపేరుగా నిలవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు