logo

ముహూర్తాలతో సమరానికి సై

జిల్లాలో రాజకీయం వేడెక్కనుంది. గురువారం నుంచి నామపత్రాల అంకం మొదలు కానుండటంతో పూర్తిస్థాయి ఎన్నికల సందడి మొదలవనుంది.

Published : 18 Apr 2024 05:04 IST

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే:  జిల్లాలో రాజకీయం వేడెక్కనుంది. గురువారం నుంచి నామపత్రాల అంకం మొదలు కానుండటంతో పూర్తిస్థాయి ఎన్నికల సందడి మొదలవనుంది. నియమావళి అమలులోకి వచ్చి చాలా రోజులైనా ఎన్నికలకు ఎక్కువ సమయం ఉండటంతో ఇప్పటి వరకు జిల్లాలో పూర్తిస్థాయిలో హడావుడి కనిపించలేదు. నామినేషన్ల ప్రక్రియ ఆరంభంతో నాయకులు, కార్యకర్తల్లో జోష్‌ వచ్చింది. ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థుల ఎంపికలో స్పష్టత రావడంతో నామపత్రాల దాఖలు కోసం కసరత్తు చేసుకుంటున్నారు. గురువారం నుంచి వారం రోజుల పాటు నామినేషన్లు వేసేందుకు ముహూర్తాలు చూసుకుంటున్నారు. 19న ఏకాదశి కావడంతో ఎక్కువ మంది అదే రోజు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి జనాల్ని తరలించేందుకు ద్వితీయశ్రేణి నాయకులు కసరత్తు చేస్తున్నారు.

జన సమీకరణలు.. జన బలం చూపించే పనిలో నాయకులు నిమగ్నమయ్యారు. కొన్నిచోట్ల ఇప్పటికే అభ్యర్థులు ఇంటింటి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఎన్నికల ఖర్చులపై ఎన్నికల సంఘం నిఘా ఉంది. నామినేషన్‌ ప్రక్రియ నుంచి వారి ఖాతాలో ఖర్చులు నమోదు చేస్తారు. సభ, సమావేశాలకు, ప్రచార కార్యక్రమాలు, జెండాలు, బ్యానర్లు, పోస్టర్లు, వినియోగిస్తున్న వాహనాలు, ఏజెంట్లకు పెట్టే భోజనాల ఖర్చులు సైతం అభ్యర్థి ఖాతాలోకి చేరతాయి. ఖర్చును లెక్క చేయకుండా మతలబులకు అలవాటుపడిన అధికార వైకాపా జనసమీకరణకు నానా తంటాలు పడుతోంది. మేమంతా సిద్ధం సభలక  జనాన్ని రప్పించేందుకు రూ.500, బిర్యానీ, మద్యం పంపిణీ చేసింది. ప్రస్తుతం ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కడంతో మద్యం నిల్వలను పంపిణీ చేసి ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆ పార్టీ సిద్ధమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని