logo

సీఎం ఇలాకా.... కుర్చీలు ఖాళీగా!

సీఎం జగన్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్సుయాత్ర... అందులోనూ ప్రారంభం అదిరేపోయేలా ఉండాలనుకున్న వైకాపా నేతలు... సీఎం ఇలాకాలోని ఐదు నియోజకవర్గాల మీదుగా సాగే యాత్రలో ప్రత్యేకించి ప్రొద్దుటూరులో కడప పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల నుంచి జనసమీకరణ...

Published : 28 Mar 2024 04:01 IST

అభాసుపాలైన అధికార వైకాపా నాయకులు
వచ్చిన కాస్త జనం వెంటనే తిరుగు ప్రయాణం
జగన్‌ ప్రసంగానికి ముందే బస్సులు తిరుగుటపా

సభలో జగన్‌ మాట్లాడుతుండగా జనం వెళ్లిపోవడంతో ఖాళీ కుర్చీలిలా..

సీఎం జగన్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్సుయాత్ర... అందులోనూ ప్రారంభం అదిరేపోయేలా ఉండాలనుకున్న వైకాపా నేతలు... సీఎం ఇలాకాలోని ఐదు నియోజకవర్గాల మీదుగా సాగే యాత్రలో ప్రత్యేకించి ప్రొద్దుటూరులో కడప పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల నుంచి జనసమీకరణ... ఇందుకోసం రాయలసీమలోని అన్ని డిపోల నుంచి వందలాది బస్సుల తరలింపు... నిధులు మంచినీళ్లుగా ఖర్చు చేసి చేపట్టిన భారీ ఏర్పాట్లు.... ఇంత చేసినా ప్రొద్దుటూరు పట్టణంలో బుధవారం నిర్వహించిన తొలి బహిరంగ సభ పేలవంగానే సాగింది.

ఈనాడు, కడప, వేంపల్లె,ప్రొద్దుటూరు బృందం, దువ్వూరు

ఆర్టీసీ బస్సు వెనుక వైపు మద్యం తాగుతూ...

జమ్మలమడుగు- ప్రొద్దుటూరు రహదారిని ఆక్రమించుకుని సభాప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. వేదిక ముందు భాగంలో ప్రత్యక్ష ప్రసారానికి అనువుగా ఎన్నో తెలివితేటలతో జనాన్ని ఓహో అనేలా చూపించే ఎత్తుగడలు. సభకు మధ్య భాగంలో సీఎం ర్యాంప్‌ వాక్‌కు అనువుగా ఏర్పాట్లు. అన్నీ బాగానే ఉన్నా వచ్చిన కాస్త జనం కూడా కొద్దిసేపటికే వెనుదిరిగారు. సాయంత్రం 6.25 గంటలకు సభా ప్రాంగణంలోకి జగన్‌ బస్సు చేరింది. బస్సు ముందు భాగంలో కూర్చున్న ఆయన చేతులూపుతూ ప్రజలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. కనీసం పక్కనున్న అద్దం కూడా దించకుండా.. బస్సు చుట్టూ భారీ భద్రత మధ్య సీఎం యాత్ర సాగింది. సీఎం వచ్చే సమయానికి సభా ప్రాంగణం సగం వరకు ఖాళీగా కనిపించింది. అప్పటికే వందలాది బస్సుల్లో దాదాపు సగం తిరుగు ప్రయాణమయ్యాయి. ఇలా వెళ్లే ప్రయత్నం చేసిన చెన్నూరు బస్సును కొందరు అడ్డుకోగా అందులోని కూలీలు వాగ్వాదానికి దిగారు. మమ్మల్ని సాయంత్రం ఐదింటి వరకు రూ.200 కూలీతో తీసుకొచ్చారు. రాత్రికి భోజనం ఎవరు పెడతారు.?అని గొడవకు దిగారు. బస్సులు కదలకపోయినా వాటిల్లో చాలామంది కూర్చున్నారు. ఇలా సభ ప్రారంభానికి ముందే బస్సులను తీసుకుని చాలా మంది వెళ్లిపోయారు. ఎమ్మెల్యే రాచమల్లు శిపప్రసాద్‌రెడ్డి పరిస్థితిని గమనించి పొడిపొడిగానే తన ప్రసంగాన్ని ముగించారు. ఆపై ఎంపీ అవినాష్‌రెడ్డి క్లుప్తంగానే మాట్లాడి సీఎం ప్రసంగం వెంటనే ప్రారంభించడానికి ప్రయత్నించారు. అప్పటికే సభ నుంచి జనం వెనక్కి తిరిగి వెళ్లడం కనిపించింది. సీఎం సైతం వేగంగా త్వరగా ప్రసంగాన్ని ముగించడానికి ప్రయత్నించారు. ప్రొద్దుటూరులో సభ నిర్వహించగా. నియోజకవర్గం నుంచి పెద్దగా జనం రాలేదు.  ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారే సభలో కనిపించారు. తిరుమల డిపో బస్సులను సైతం సభకు మళ్లించారు. వందలాది బస్సులను జనం కోసం కేటాయించగా, చాలావరకు సగం సీట్లు వరకే జనం ఉన్నారు. కడపలో చాలా బస్సులు జనం రాకపోవడంతో ప్రొద్దుటూరు రాకనే సాయంత్రం వరకు ఉండి తిరిగి వెళ్లిపోయాయి. సీఎం సొంత ఇలాకాలోనే పరిస్థితి ఇలా ఉందేమిటని వైకాపా నేతలు గుసగుసలాడుకోవడం వినిపించింది. డీఆర్‌డీఏ అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకుని జనాన్ని తరలించే ప్రయత్నం చేసినా మహిళలు అంతంత మాత్రంగానే సభకు వచ్చారు. వాలంటీర్లు శతవిధాలా ప్రయత్నించి జనసమీకరణ చేపట్టినా ఫలితం లేక పోయింది.జగన్‌ బస్సుకు విద్యుత్తు తీగలు తగులుతాయనే ముందు జాగ్రత్తల్లో భాగంగా దువ్వూరులో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి కరెంటు కోత పెట్టి జనాన్ని ఉక్కపోతకు గురిచేశారు. సభాస్థలిలో ఎక్కడ పడితే అక్కడ కొంతమంది మద్యం మత్తులో మునిగి పడిపోయారు. ఎమ్మెల్యే రాచమల్లు ప్రసంగంతో సభలోని జనాలు ఇంటిదారి పట్టారు. చాలా గ్యాలరీలు ఖాళీగానే దర్శనమిచ్చాయి. సభకు వచ్చిన వారికి రూ.200 నుంచి రూ.500 వరకు నగదు, పురుషులకు బిర్యానీ పొట్లాలు, మద్యం సీసాలు పంపిణీ చేశారు.

  సభాస్థలిలో మద్యం తాగి పడిపోయిన వ్యక్తి

జమ్మలమడుగులో జగన్‌ రోడ్‌ షో అనంతరం జనం పాట్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని