logo

తాగునీటి గండం..విద్యార్థులకు శాపం

దేశ సరిహద్దులో భద్రత ఏర్పాట్లు చూసే సైనికులు... పశువైద్య విజ్ఞానాన్ని అవపోశన పడుతున్న విద్యార్థులను తాగునీటి సమస్య విపరీతంగా వేధిస్తోంది.

Published : 29 Mar 2024 05:06 IST

 నాగాయపల్లె లోని కుందూ వద్ద గొట్టపు బావిలో అడుగంటిన జలం

దేశ సరిహద్దులో భద్రత ఏర్పాట్లు చూసే సైనికులు... పశువైద్య విజ్ఞానాన్ని అవపోశన పడుతున్న విద్యార్థులను తాగునీటి సమస్య విపరీతంగా వేధిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ సాధించిన దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న ప్రొద్దుటూరు మండలం.. గోపవరంలోని ప్రభుత్వ పశువైద్య కళాశాలలో నెలకొంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా పోలీసు యంత్రాంగం పర్యవేక్షణలో వచ్చిన సాయుధ కేంద్ర బలగాలు ఈ కళాశాలకు సమీపంలో బస చేస్తున్నాయి. వీరికి ఇక్కడి సమీపంలోని కుందూ నది పరివాహనం నుంచే నీటి వనరులు చేరుతున్నాయి. గత కొంతకాలంగా అవసరం మేరకు నీరు విడుదల కాకపోవడంతో అగచాట్లకు గురవుతున్నారు. గతంలో అవసరానికి మించి అండుబాటులో ఉండే వనరులు నేడు అరకొరగా వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోవడమేనని అధికారులు సైతం ఒక నిర్ణయానికి వచ్చారు.

తీవ్రరూపం దాల్చుతున్న వేసవి

రోజువారీగా లక్ష లీటర్లు నీరు అవసరం ఉంది. కానీ.. కొన్ని రోజులుగా అంతంతమాత్రంగా సరఫరా జరుగుతోంది. ఇందుకు నాగాయపల్లెలోని కుందూ పరివాహకం పక్కన 28 అడుగుల లోతులో ఉన్న రెండు గొట్టపు బావుల్లో భూగర్భ జలాలు పూర్తిస్థాయిలో అడుగంటి పోవడమే కారణం. నది నుంచి 13 కి.మీ వరకు గొట్టపు మార్గాలు (పైప్‌లైన్‌) మీదుగా ప్రభుత్వ పశువైద్య కళాశాలకు నీటి సరఫరా కోసం వినియోగిస్తున్నారు. ఇక్కడ రెండు గొట్టపు బావుల నుంచి జలధార లేక నీటి ఎద్దడికి దారితీసింది. విద్యార్థుల వసతి గృహ సముదాయాలతో పాటు అధ్యాపకులు, సిబ్బందితో పాటు కళాశాల ప్రాంగణంలో సుమారు 200 పశుసంపదకు సంబంధించి మూగజీవాలకు అవసరమైన నీటి సరఫరా లేదు. ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం మే నెలకు ముందే వేసవి తీవ్రరూపం దాల్చుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల నేపథ్యంలో 200 మంది పారా మిలటరీ దళాలు ప్రభుత్వ పశువైద్య కళాశాల ఆవరణంలోని సముదాయాల్లో ఉంటున్నారు. దీంతో నీటి కొరత లేకుండా పరిష్కరించాలని గ్రామీణ నీటి పథకం ఇంజినీర్లను పోలీసు అధికారులు కోరారు. దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ నాగభరత్‌రెడ్డిని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా తమ దృష్టికి సమస్య రాగానే స్థానిక రాజీవ్‌నగర్‌లో రిజర్వ్‌గా ఉన్న రెండు గొట్టపు బావుల నీటిని పశువైద్య కళాశాలకు చెందిన గొట్టానికి అనుసంధానం చేశామన్నారు. తాత్కాలికంగా సమస్యకు పరిష్కార చర్యలు చేపట్టామన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని