logo

ఆదేశాలకు పాతర.. ఇసుకాసురుల జాతర!

పర్యావరణ అనుమతుల్లేకుండా ఇసుక తవ్వకాలు జరపొద్దని హైకోర్టు స్పష్టం చేసినా అధికార పార్టీ నేతలు ఖాతరు చేయడం లేదు. నిబంధనలను అతిక్రమిస్తే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తీర్పు వెల్లడించినా పోలీసు అధికారులు సైతం వాటిని పట్టించుకోకుండా వైకాపా నేతలకు వత్తాసు పలుకుతున్నారు.

Updated : 29 Mar 2024 06:26 IST

అక్రమ తవ్వకాలు ఆపని వైకాపా నేతలు
గతంలో హైకోర్టు, ఎన్జీటీల అక్షింతలు
ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా ఇష్టారాజ్యం
ఈనాడు, కడప, న్యూస్‌టుడే, పెనగలూరు, రాజంపేట గ్రామీణ, చాపాడు

పర్యావరణ అనుమతుల్లేకుండా ఇసుక తవ్వకాలు జరపొద్దని హైకోర్టు స్పష్టం చేసినా అధికార పార్టీ నేతలు ఖాతరు చేయడం లేదు. నిబంధనలను అతిక్రమిస్తే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తీర్పు వెల్లడించినా పోలీసు అధికారులు సైతం వాటిని పట్టించుకోకుండా వైకాపా నేతలకు వత్తాసు పలుకుతున్నారు. మరోవైపు ఎన్జీటీ సైతం ఇసుక తవ్వకాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అంక్షింతలు వేసింది. వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లో ఇష్టారాజ్యంగా కొన్నిరేవుల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. అన్నీ తెలిసినా అధికార యంత్రాంగం కనీసం పట్టించుకోకపోవడం గమనార్హం. మరోవైపు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినా అధికార పార్టీకి అక్రమ సంపాదన మార్గమైన ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవడంలేదు. తవ్వకాలపై రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా ఉన్నతాధికారులను నివేదిక కోరినా ఏం సమాచారమిచ్చారో బయటకు రావడంలేదు. 

వైయస్‌ఆర్‌ జిల్లా వల్లూరు మండలం ఆదినిమ్మాయపల్లె సమీపంలో పెన్నా నది నుంచి గత కొన్ని నెలలుగా ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయి. అనధికారికంగా తవ్వకాలు జరిపే వ్యక్తి ఇద్దరు కీలక నేతలకు నెలకు రూ.20 లక్షల వంతున చెల్లిస్తుండగా, స్థానిక నేతకు రోజుకు ఐదు టిప్పర్ల ఇసుక ఇస్తున్నారు. మరో వ్యక్తికి ఒక టిప్పరు వంతున ఇచ్చి నిత్యం ఇసుక దందా సాగిస్తున్నారు. ఇటీవలే పరిసర గ్రామాల ప్రజలు యంత్రాలను, రవాణా టిప్పర్లను అడ్డుకోవడంతో దందాలు, వాటాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇంత దందా సాగిస్తున్న వ్యక్తులు హైకోర్టు ఆదేశాలున్నా, కోడ్‌ అమల్లోకి వచ్చినా ఆపకుండా దోచుకుంటున్నారు. ఇదే తరహాలో రెండు జిల్లాల్లోనూ వైకాపా నేతలు ఇసుక రూపంలో భారీ దోపిడీ కొనసాగిస్తున్నారు.


న్నమయ్య జిల్లా పెనగలూరు మండలం నారాయణనెల్లూరు గ్రామసమీపంలో చెయ్యేరు నదిలో వైకాపా నేతలు ఇసుక తవ్వకాలు కొనసాగిస్తున్నారు. నిత్యం వందలాది టిప్పర్లు, ట్రాక్టర్లతో ఇసుక తరలి పోతోంది. దందాను చూడటానికి సెబ్‌ అధికారులు గురువారం ఇసుక రేవులోకి వెళ్లారు. ట్రాక్టర్లకు అడ్డుగా తమ వాహనం పెట్టి నిలువరించే ప్రయత్నం చేశారు. కొంత సేపటికి వారిలో మార్పు వచ్చింది. తవ్వకాలు జరుపుతున్న వ్యక్తులకు అనుమతులున్నాయంటున్నారనే మాటతో దాటవేసే ప్రయత్నం చేశారు. రేవులో ఇసుక తవ్వకాలకు అనుమతులున్నాయా.. లేవా అనే విషయం తెలుసుకోకుండా రేవులోకి ఎందుకొచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎంతో హడావుడిగా వచ్చిన సెబ్‌ అధికారులకు ఎవరి దగ్గరనుంచో ఫోన్లు రావడంతో మెత్తబడిపోయారు.


రాజంపేట గ్రామీణ మండలం మందరం కొత్తపల్లి వద్ద భారీగా ఇసుక నిల్వలు చేశారు. సిద్ధవటం వద్ద బద్వేలు మార్గంలోనూ భారీ నిల్వలున్నాయి. మైదుకూరు-ప్రొద్దుటూరు మార్గంలో చాపాడు పెద్ద వంతెన కింద ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి.. వంతెనకు ప్రమాదం పొంచి ఉందన్న జ్ఞానం కూడా లేకుండా తవ్వకాలు జరుపుతూ తరలిస్తున్నారు. ఆ మార్గంలో ప్రయాణించే వారంతా నదిలో ఎందుకిలా చేస్తున్నారంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఎలాంటి అనుమతుల్లేకుండా జరుగుతున్న ఇసుక దందాపై అధికార యంత్రాంగం నిద్రపోతుందా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇసుక తవ్వకాల వెనుక పెద్ద శక్తులెవరు.. ఎవరెవరికి ఎంత వాటా అందుతున్నాయనే జోరుగా చర్చ సాగుతోంది. మైదుకూరు పోలీసు సబ్‌డివిజన్‌ పరిధిలో కొన్ని రేవుల్లో తవ్వకాలను పోలీసులు అడ్డు కున్నారు. మరికొన్ని చోట్ల దందాలో వాటాలు, వైకాపా నేతలతో అంటకాగడం.. చేతగానితనం కారణంగా ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను నియంత్రించలేకపోతుండడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని