logo

Hyderabad News: జీవో 111 కథేంటి..?

జంట జలాశయాల పరిరక్షణకు గతంలో జారీ చేసిన జీవో 111 ఎత్తివేస్తామని మంగళవారం అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్‌ ప్రకటించడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు సానుకూలంగా,

Updated : 16 Mar 2022 05:19 IST

ప్రత్యేకంగా మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలని సూచిస్తున్న నిపుణులు

ఈనాడు, హైదరాబాద్‌

జంట జలాశయాల పరిరక్షణకు గతంలో జారీ చేసిన జీవో 111 ఎత్తివేస్తామని మంగళవారం అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్‌ ప్రకటించడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు సానుకూలంగా, మరికొందరు వ్యతిరేకంగా ఉండగా.. ఇంకొందరు మధ్యేమార్గాన్ని సూచిస్తున్నారు. జీవో 111 ఎత్తివేయదల్చుకుంటే... ఆ ప్రాంతం వరకు ప్రత్యేకమాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలంటున్నారు.

ఇది అసలు కథ: హైదరాబాద్‌ నగర శివారులోని గండిపేట, హిమాయత్‌సాగర్‌ జలాశయాల పరిరక్షణకు జీవో 111 అమల్లో ఉంది. పది కిలోమీటర్ల పరిధిలో కాలుష్యం కారక పరిశ్రమలు, భారీ హోటళ్లు, నివాస కాలనీలు, ఇతర కాలుష్య కారక నిర్మాణాలపై నిషేధం విధిస్తూ 1994లో తొలుత జీవో నం.192ను తీసుకొచ్చింది. దీనికి కొన్ని సవరణలు చేస్తూ 1996 మార్చి 8న అప్పటి ప్రభుత్వం జీవో 111ను తెచ్చింది.

* క్యాచ్‌మెంట్‌ పరిధిలో వేసే లేఅవుట్లలో 60శాతం ఓపెన్‌ స్థలాలు, రోడ్లకు వదలాలి.

* వినియోగించే భూమిలో 90శాతం కన్జర్వేషన్‌ కోసం కేటాయించాలి. ఇందుకుగాను హుడా బాధ్యత వహించాలి.

రసాయనాలు, క్రిమిసంహారకాల స్థాయిలు లెక్కించేందుకు ప్రత్యేక ఏజెన్సీతో పర్యవేక్షించాలి.

* జీ+2కి మించి నిర్మాణాలు చేసేందుకు వీల్లేదు.

ఉన్నత స్థాయి కమిటీ వేసినా..: ఒకప్పుడు జంట జలాశయాల నుంచి హైదరాబాద్‌కు తాగునీటి అవసరాలు తీరేవి. రానురానూ కృష్ణా, గోదావరి జలాలు అందుబాటులోకి రావడంతో జంట జలాశయాలపై ఆధారపడటం లేదని స్థానికులు చెబుతున్నారు. దీనివల్ల జీవో 111 ఎత్తివేయడం లేదా పరిధి కుదించాలని కొన్నేళ్లుగా డిమాండ్‌ చేస్తున్నారు. ఈ జీవోపై అధ్యయనం చేసేందుకు 2016లో తెలంగాణ ప్రభుత్వం హైపర్‌ కమిటీని నియమించింది. ఈ కమిటీ సమావేశం కాలేదని గుడ్‌ గవర్నెన్స్‌ సంస్థ ఛైర్మన్‌ పద్మనాభరావు చెబుతున్నారు. గ్రామాల పరిధిలోని పాలకవర్గాలు గతంలో పలుమార్లు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాయి. జీవో ఎత్తివేతకు వ్యతిరేకంగా పలువురు పర్యావరణవేత్తలు న్యాయస్థానాలను ఆశ్రయించారు. జీవోపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. గతేడాది సెప్టెంబరులో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. జలాశయాలను పరిరక్షిస్తూ పర్యావరణ పరిరక్షణకు ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలని సీఎం ఆదేశించారు. ఇదే సమయంలో గతంలో నియమించిన ఉన్నతస్థాయి కమిటీ నుంచి నివేదిక రాకపోవడంతో మరికొంత సమయం కావాలని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. ఈ నేపథ్యంలోనే జీవో 111పై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటన వెలువడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని