logo

గురువులే ప్రత్యక్ష దేవతలు

ప్రతి వ్యక్తీ ఉన్నత స్థాయికి చేరుకోవటంలో వారి కన్నవారితోపాటు ప్రత్యక్ష దేవతలైన గురువులే కారణమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు అన్నారు. తాను చదువుకున్న ఏన్కూరులోని

Published : 13 Feb 2022 02:58 IST

వైద్య, ఆరోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు

ఏన్కూరులోని గురుకులంలో పర్యటిస్తున్న వైద్య, ఆరోగ్య సంచాలకులు

శ్రీనివాసరావు, ఐఆర్‌ఎస్‌ అధికారి లావుడ్యా జీవన్‌లాల్‌ తదితరులు

ఏన్కూరు, న్యూస్‌టుడే: ప్రతి వ్యక్తీ ఉన్నత స్థాయికి చేరుకోవటంలో వారి కన్నవారితోపాటు ప్రత్యక్ష దేవతలైన గురువులే కారణమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు అన్నారు. తాను చదువుకున్న ఏన్కూరులోని తెలంగాణ గురుకులాన్ని ఐఆర్‌ఎస్‌ అధికారి జీవన్‌లాల్‌తో కలిసి శనివారం సందర్శించారు. మూడు గంటలపాటు పూర్వ విద్యార్థులతో కలిసి తిరుగుతూ 39 ఏళ్ల క్రితం జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. అనంతరం సమావేశంలో మాట్లాడారు. తాను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే గురుకులంలో విద్యాభ్యాసమే పునాది అని గుర్తుచేశారు. అడవిలా ఉండే గురుకులంలో పురుగుల అన్నం తిని, విష పురుగులతో సహవాసం చేస్తూ కష్టపడి పదో తరగతి పూర్తి చేశామన్నారు. ప్రతి విద్యార్థి జీవితంలో స్థిరపడాలనే సంకల్పంతో ఉండాలని, ఆటపాటలతో విద్యను కొనసాగించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరాలన్నారు. పాఠశాలలో తాను చేసిన చిలిపి చేష్టలు, టూరింగ్‌ టాకీస్‌ కబుర్లు చెబుతూ రెండు గంటలు అందరినీ నవ్వించారు. పాఠశాల అభివృద్ధికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఐఆర్‌ఎస్‌ అధికారి, పూర్వ విద్యార్థి లావుడ్యా జీవన్‌లాల్‌ మాట్లాడుతూ గురుకులం తనకు దేవాలయం అని ఇక్కడ నేర్చుకున్న విద్య, క్రమశిక్షణ ఇప్పటివరకు తనను ముందుకు సాగేలా చేస్తుందన్నారు. ఇద్దరు అధికారులు పిల్లలతో ముఖాముఖి సంభాషణ చేశారు. పలు విభాగాల్లో రాణించిన విద్యార్థులకు బహుమతులందించారు. సరస్వతి విగ్రహం వద్ద పూజలు చేశారు. పూర్వ విద్యార్థులు సాఫ్ట్‌వేర్‌ సంస్థ సీఈవో వడ్డే నరసింహారావు, గిరిబాబు, కృష్ణయ్య, నాగయ్య, ప్రధానాచార్యులు టి.శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

* ఏళ్ల తర్వాత చదువులమ్మ ఒడికి వచ్చిన ఆనందంతో తోటి స్నేహితులు, విద్యార్థులతో కలిసి గడల శ్రీనివాసరావు డీజే పాటలకు నృత్యం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని