icon icon icon
icon icon icon

అంతా సౌమ్యులే.. అక్రమాలకు కారకులెవరో?

కాకినాడ నుంచి లోక్‌సభకు వైకాపా అభ్యర్థిగా పోటీచేస్తున్న చలమలశెట్టి సునీల్‌తో పాటు అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్థులంతా మంచివారు, సౌమ్యులని.. కొందరు తనకు స్నేహితులని జగన్‌ కొనియాడారు.

Updated : 20 Apr 2024 12:50 IST

అభ్యర్థులంతా మంచివారని జగన్‌ కితాబు
దళితుడిని చంపి డోర్‌ డెలివరీ చేసిన ఎమ్మెల్సీకి ఎన్నికల బాధ్యతలా!
ప్రకృతి వనరులను దోచేస్తున్నది ఎవరని ప్రశ్నిస్తున్న ప్రజలు

ఈనాడు, అమరావతి: కాకినాడ నుంచి లోక్‌సభకు వైకాపా అభ్యర్థిగా పోటీచేస్తున్న చలమలశెట్టి సునీల్‌తో పాటు అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్థులంతా మంచివారు, సౌమ్యులని.. కొందరు తనకు స్నేహితులని జగన్‌ కొనియాడారు. వారిని పేరుపేరునా మేమంతా సిద్ధం సభలో పరిచయం చేశారు. మరి ఈ అయిదేళ్లలో ఆ నియోజకవర్గాల్లో జరిగిన దాడులు, దౌర్జన్యాలు, దోపిడీలు, అక్రమాలు, అరాచకాలకు బాధ్యులెవరో కనుక్కోవాలని స్థానికులే అడుగుతున్నారు. చెప్పగలరా జగన్‌?


సౌమ్యుడు-1 ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి

‘కాకినాడ సిటీ నుంచి పోటీచేస్తున్న చంద్ర (ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి) మంచివాడు.. సౌమ్యుడు. పేదలకు మంచి చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారు’ అంటూ సీఎం జగన్‌ ఆకాశానికెత్తేశారు. మరి కాకినాడ సిటీలో అయిదేళ్లుగా అక్రమాలు, దౌర్జన్యాలకు అంతే లేదు. రేషన్‌ మాఫియాకు కాకినాడే కేంద్రస్థానంగా పేరుపడింది. ఆ మాఫియా నేత ఎవరో కాస్త అడిగి చెబుతారా? భూముల కబ్జాలకు అంతే లేదు. పెద్దాపురం, జగ్గంపేట, అనపర్తి ప్రాంతాల్లో మట్టిని మింగేసిన ఘనులూ ఉన్నారు. విశాఖ మన్యం నుంచి గంజాయి తెచ్చే ముఠాకు నాయకుడెవరో కూడా ఆరా తీస్తారా? గతంలో ప్రతిపక్షాలకు చెందిన అగ్రనేతలను మహిళా ప్రతినిధుల ఎదుటే అసభ్య పదజాలంతో దూషించారన్న సంగతైనా మీ అభ్యర్థికి తెలుసేమో అడిగారా? కాస్త కనుక్కుని ప్రజలకు వివరించి చెప్పొచ్చుగా?


సౌమ్యుడు-2: దాడిశెట్టి రాజా

‘తుని నుంచి పోటీచేస్తున్న రాజా మంచివాడు, నాకు స్నేహితుడు. సౌమ్యుడంటూ జగన్‌ ప్రశంసల్లో ముంచెత్తారు. మూడుముక్కలాటలు, గానాబజానాల్లో మునిగితేలే నేతలెవరో ఆయనకు బాగా తెలుసని నియోజకవర్గంలోని వారంతా అంటున్నారు. అయిదేళ్లుగా నియోజకవర్గంలో అరాచకాలకు అంతే లేదు. లాటరీ టికెట్లు, గుట్కా వ్యాపారం చేయిస్తూ రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. మట్టి, ఇసుకను కొల్లగొడుతున్నారు. వాళ్లంతా ఎవరో మీ స్నేహితుడికి తెలుసా? దళితుల సాగుభూముల్నీ వదలకుండా కబ్జా చేసిన ఘనులెవరోకూడా మీ స్నేహితుడ్ని అడిగి చెప్పండి.


సౌమ్యుడు-3: కురసాల కన్నబాబు

మంచి చేయడానికి నాలుగు అడుగులు ముందే ఉంటారంటూ... కాకినాడ రూరల్‌ నుంచి పోటీచేస్తున్న కన్నబాబును జగన్‌ వెనకేసుకొచ్చారు. ఆయన ఎంతో సౌమ్యుడని కొనియాడారు. అంతులేని అక్రమాలెన్నింటికో ఆయన ప్రాతినిధ్యం వహించే కాకినాడ గ్రామీణ నియోజకవర్గం కేంద్రమైంది. ఇంటిపట్టా ఇవ్వాలంటే రూ.60వేల నుంచి రూ.1.50లక్షలు కట్టాలని పేదలను వేధించారు. రియల్‌ఎస్టేట్‌ వెంచర్లు వేసుకోవాలన్నా.. కాంట్రాక్టు పనులు చేయాలన్నా రూ.లక్షల్లో వసూలుచేశారు. వివాదాస్పద భూములు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని బెదిరించి వాటిని కబ్జా చేశారు. సౌమ్యుడంటూ మీరు కితాబిచ్చిన కన్నబాబుకు ఇవన్నీ తెలుసో లేదో, ఎవరు చేశారో ఆయన్ని అడిగి చెబుతారా? భూ వివాదాల కారణంగా ఇటీవల ఒక వైద్యుడు ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఇన్ని దారుణాలు జరుగుతుంటే మంచి చేయడానికి నాలుగు అడుగులు ముందుండే కన్నబాబు చూస్తూ ఊరుకుంటున్నారా? ఎందుకో మరి?  


సౌమ్యుడు, మంచి స్నేహితుడు: చలమలశెట్టి సునీల్‌

‘కాకినాడ నుంచి లోక్‌సభకు పోటీచేస్తున్న సునీల్‌ మంచివాడు, సౌమ్యుడు, నాకు మంచి స్నేహితుడు’ అని జగన్‌ పరిచయం చేశారు. ఇద్దరి మధ్య అంత బంధానికి కారణాలేంటో కూడా కాస్త వివరంగా చెప్పి ఓట్లడిగితే.. ప్రజలంతా తెలుసుకునేవారు కదా? ఆయనకు చెందిన ఇంటిగ్రేటెడ్‌ విద్యుత్‌ ప్రాజెక్టుకు కర్నూలు జిల్లాలో 7,466 ఎకరాలను కేటాయించారు. ఎన్నికల కోడ్‌ వచ్చే కొద్దిరోజుల ముందు 1,985 ఎకరాలు గంపగుత్తగా అమ్మేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇవన్నీ మీ ప్రభుత్వంలోనే కదా? పరిచయం చేసేటప్పుడే ఇవన్నీ ప్రజలకు చెప్పాల్సింది.


మంచివాడు-2: వరుపుల సుబ్బారావు

‘ప్రత్తిపాడు నుంచి బరిలో ఉన్న సుబ్బారావు. పొట్టివాడైనా.. గట్టివాడు. మనసున్నవాడు’ అని సీఎం జగన్‌ ప్రశంసలు కురిపించారు. దళిత డ్రైవర్‌ను హత్యచేసి డోర్‌ డెలివరీ చేశారనే కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబు ఈయనకు బంధువేనట కదా? సుబ్బారావు గెలుపు బాధ్యతలు ఆయనకే అప్పగించారంటున్నారు.. నిజమేనా? ఆ సంగతులేంటో ఓటర్లకు వివరించి చెప్పి ఉండాల్సింది. అక్రమ మైనింగ్‌తో రూ.కోట్లు కొట్టేస్తున్నదెవరో ఈ మనసున్న మనిషికి తెలుసేమో ఆరా తీయండి.


మంచివాడు-1: దవులూరి దొరబాబు

‘పెద్దాపురం అసెంబ్లీ నుంచి పోటీలో ఉన్న దొరబాబు యువకుడు, ఉత్సాహవంతుడు. మంచి చేయడానికి అడుగులు వేగంగా ముందుకు వేస్తున్నారు’ అని జగన్‌ కితాబిచ్చారు. అధికారపార్టీ అండగా అరాచకాలు చేస్తున్న నాయకులెవరో.. ఈ ఉత్సాహవంతుడికి ఏమైనా తెలుసేమో అడిగారా? అక్కడ జరిగే సెటిల్‌మెంట్ల వెనక ఎవరున్నారో, రామేశ్వరం మెట్టలో 826 ఎకరాల్లో ఇష్టారీతిన మట్టి తవ్వకాలు చేసిందెవరో కనుక్కోండి జగన్‌! స్థానిక ఎమ్మెల్యేకు ఆహ్వానం లేకుండానే.. అధికారం చెలాయించే నాయకులూ ఈ నియోజకవర్గంలో ఉన్నారంట. వారెవరో కాస్త తెలుసుకుని ఓటర్లకు చెప్పండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img