icon icon icon
icon icon icon

సంక్షిప్తవార్తలు(20)

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన మంత్రివర్గ సహచరులు దేశ వనరులను వినియోగించుకుని విస్తృతంగా ప్రచారం చేయడానికే కేంద్ర ఎన్నికల సంఘం ఏడు దశల్లో ఎన్నికల షెడ్యూల్‌ను రూపొందించిందని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు.

Updated : 21 Apr 2024 06:47 IST

భాజపా ప్రచారం కోసమే 7 దశల్లో ఎన్నికలు: మమత

మాల్దా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన మంత్రివర్గ సహచరులు దేశ వనరులను వినియోగించుకుని విస్తృతంగా ప్రచారం చేయడానికే కేంద్ర ఎన్నికల సంఘం ఏడు దశల్లో ఎన్నికల షెడ్యూల్‌ను రూపొందించిందని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. శనివారం మాల్దా జిల్లాలోని గాజోల్‌లో మాజీ ఐపీఎస్‌ అధికారి, టీఎంసీ అభ్యర్థి ప్రసూన్‌ బెనర్జీకి మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించినప్పటి నుంచి తాత్కాలిక పాలనా యంత్రాంగంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం భాజపా కనుసన్నల్లో పనిచేస్తోందని ఆరోపించారు. ఒకప్పుడు ఎన్నికలు మే లోనే ముగిసేవని, ఇప్పుడు జూన్‌ వరకు వచ్చాయన్నారు.


దోపిడీ ప్రభుత్వం వద్దు : ఖర్గే

దిల్లీ: ‘దోపిడీ ప్రభుత్వాన్ని (భాజపా సర్కారు) ఎన్నుకోవద్దు. మార్పును కోరుకోండి. కాంగ్రెస్‌కు ఓటెయ్యండి’ అని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఓ వీడియోను ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. మరోపక్క కరవు కోరల్లో చిక్కుకున్న కర్ణాటక రాష్ట్రానికి రూ.18 వేల కోట్ల సహాయాన్ని ఎందుకు విడుదల చేయడంలేదంటూ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ చిక్కబళ్లాపుర్‌ ఎన్నికల ర్యాలీలో ప్రశ్నించారు.


మొరాదాబాద్‌ భాజపా అభ్యర్థి మృతి

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌ నియోజకవర్గ భాజపా లోక్‌సభ అభ్యర్థి సర్వేశ్‌ కుమార్‌ శనివారం మృతి చెందారు. ఆయన దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 72 ఏళ్ల సర్వేశ్‌ కుమార్‌ గత కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్నారు. తొలి దశ ఎన్నికల్లో భాగంగా మొరాదాబాద్‌లో శుక్రవారమే పోలింగ్‌ జరిగింది. ఐదు సార్లు భాజపా ఎమ్మెల్యేగా నెగ్గిన సర్వేశ్‌ కుమార్‌ 2014 నుంచి 2019 వరకు మొరాదాబాద్‌ లోక్‌సభ ఎంపీగా ఉన్నారు.


గురుకులాలపై కాంగ్రెస్‌ నిర్లక్ష్యం: హరీశ్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గురుకులాల పట్ల కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఇటీవల వరుసగా జరుగుతున్న విషాద సంఘటనలే ఇందుకు నిదర్శనం అని  భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు ‘ఎక్స్‌’ వేదికగా శనివారం విమర్శించారు. మొన్న భువనగిరి గురుకుల హాస్టల్‌లో కలుషిత ఆహారం తిని చనిపోయిన ప్రశాంత్‌ ఉదంతాన్ని మరవక ముందే.. తాజాగా నిర్మల్‌ జిల్లా నర్సాపూర్‌ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో శుక్రవారం 11 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రభుత్వం బాధిత విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గురుకులాల్లో పనిచేస్తున్న ఐసీటీ కంప్యూటర్‌ టీచర్లకు మూణ్నెళ్లుగా వేతనాలు ఇవ్వడం లేదని వెంటనే జీతాలు చెల్లించాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.


‘ఇండియా’ కూటమికి సానుకూల పవనాలు
కాంగ్రెస్‌ సేవాదళ్‌ తెలంగాణ ఇన్‌ఛార్జి సంగ్రామ్‌ త్రావ్డే

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: దేశ వ్యాప్తంగా ‘ఇండియా’ కూటమికి సానుకూల పవనాలు వీస్తున్నాయని, రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని సేవాదళ్‌ జాతీయ కార్యదర్శి, సేవాదళ్‌ తెలంగాణ ఇన్‌ఛార్జి సంగ్రామ్‌ త్రావ్డే ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ సేవాదళ్‌ సర్వసభ్య సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్‌ అధ్యక్షతన శనివారం గాంధీభవన్‌లోని ఇందిరాభవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా సంగ్రామ్‌ త్రావ్డే మాట్లాడుతూ..మోదీ పాలనలో ద్రవ్యోల్బణం పెరిగిందని, ఇంధనం, నిత్యావసర వస్తువుల ధరలూ పెరుగుతున్నాయని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో సేవాదళ్‌ శ్రేణులు కష్టపడి పనిచేసి తెలంగాణలోని 17 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలన్నారు.


దేశ ప్రధానిలా కాకుండా భాజపా పీఎంలా మోదీ

ప్రధానిగా యావద్దేశానికి నాయకత్వం వహించి ముందుకు నడపాల్సిన మోదీ కేవలం భాజపా ప్రధానిలా మాట్లాడుతున్నారు. ఆయన ప్రసంగాలు దానిని తేటతెల్లం చేస్తున్నాయి. విపక్షంపై విరుచుకుపడే బదులు దేశానికి ఏం చేయబోయేదీ మోదీ, భాజపా చెప్పాలి. ఎంతసేపూ నెహ్రూ, రాహుల్‌గాంధీ, లేదా కొన్నిసార్లు నన్ను విమర్శించడంతోనే వారికి సరిపోతోంది.

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్‌పవార్‌


ఇది మోదీ-రాహుల్‌ మధ్య పోరు

లోక్‌సభ ఎన్నికలు కుటుంబ సంబంధాలకు సంబంధించినవి కావు. ఇవి ప్రధాని మోదీ- కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మధ్య పోరు. బారామతిలో అన్ని సంస్థల్నీ శరద్‌పవార్‌ తెచ్చారని చెప్పేందుకు ఓ సభలో వక్తలు ప్రయత్నించారు. అలాగైతే గత 30 ఏళ్లలో ఈ నియోజకవర్గానికి నేను ఏం చేసినట్లు?

పుణెలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌


440  వోల్టుల షాక్‌ ఇవ్వాలి

ఈసారి ఎన్నికల్లో 400 పైబడిన స్థానాలు పొందాలని లక్ష్యంగా పెట్టుకున్న భాజపాకి ప్రజలంతా 440 వోల్టుల షాక్‌ ఇవ్వాలి. ఆ షాక్‌ దిల్లీ వరకు తగలాలి. ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలి.

బెంగాల్‌లోని రాయ్‌గంజ్‌ సభలో తృణమూల్‌ యువ నేత అభిషేక్‌ బెనర్జీ


తొలి దశలోనే భాజపా ఫ్లాప్‌

భాజపాకి ఓటు వేయాలని ఎవరూ అనుకోవడం లేదు. మొదటి దశ ఎన్నికలు యూపీలో వాతావరణాన్ని మార్చేశాయి. భాజపా సినిమా ఫ్లాప్‌ అని ఈ దశలోనే తేలిపోయింది. వారు పదేపదే చెప్పే కథను ఎవరూ వినాలనుకోవడం లేదు. పోరాటాల గడ్డ అయిన మేరఠ్‌ ప్రజలు మన దేశానికి భాజపా నుంచి విముక్తి కల్పించాలి.

మేరఠ్‌ (యూపీ)లో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌


కాపుల్ని అణచివేయడమే లక్ష్యంగా కుట్ర

తెదేపా నేతలు చినరాజప్ప, గంటా, నిమ్మల ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: కాపుల్ని అణచివేయడమే లక్ష్యంగా సీఎం జగన్‌ అడుగడుగునా కుట్రలకు తెరలేపుతున్నారని తెదేపా నేతలు చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. జగన్‌పై రాయి దాడి కేసులో తెదేపా అభ్యర్థి, కాపు నాయకుడు బోండా ఉమామహేశ్వరరావును ఇరికించాలని చూడటాన్ని శనివారం ఉమ్మడి ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. వైకాపాకు ఊడిగం చేసే కొంతమంది అధికారుల్ని అడ్డంపెట్టుకుని తప్పడు నివేదికలు తయారు చేయిస్తున్నారని మండిపడ్డారు. ‘‘జగన్‌ గులకరాయి డ్రామాను చూసి ప్రజలంతా అసహ్యించుకుంటున్నారు. నిజంగా జగన్‌కు గులకరాయి తగిలితే అదెందుకు దొరకలేదు? ఘటనతో ఎలాంటి సంబంధం లేని బీసీ బిడ్డని అరెస్టు చేసి, ఆ కేసులో కాపుల్ని కూడా ఇరికించే కుట్ర చేయడం దుర్మార్గం. ఇలాంటి ప్రయత్నాల్ని కాపు జాతి సహించబోదని గుర్తుంచుకోవాలి’’ అని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.


వివేకా హత్య కేసులో నిందితుడు దేవిరెడ్డి నామినేషన్‌

ఈనాడు, కడప: వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కడప లోక్‌సభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా శనివారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన తరఫున ప్రతిపాదకులు రిటర్నింగ్‌ అధికారి వద్ద నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. గతంలోనూ ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. పోలింగ్‌ రోజున బూత్‌లలో వైకాపా అభ్యర్థి అవినాష్‌రెడ్డికి ప్రయోజనం చేకూర్చడానికే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనపై పలు కేసులు నమోదైనప్పటికీ, వివేకా హత్య కేసును మాత్రమే అఫిడవిట్లో ప్రస్తావించారు. ఇతర కేసులు కొట్టివేయించుకున్న కారణంగా పేర్కొనలేదని సమాచారం.


మూడో రోజు 264 నామినేషన్లు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో శనివారం శాసనసభ  స్థానాలకు 227, లోక్‌సభ స్థానాలకు 37 కలిపి మొత్తంగా 264 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌  మీనా ఓ ప్రకటనలో తెలిపారు.


ఉగ్రవాదులకు బిర్యానీ ఇచ్చిన కాంగ్రెస్‌

కాంగ్రెస్‌ పార్టీ కులతత్వ, మతతత్వ ఆలోచనలతో దేశమెంతో ఇబ్బంది పడింది. దేశ భద్రతతో, ప్రజల విశ్వాసాలతో ఆ పార్టీ ఆడుకునేది. ఉగ్రవాదులకు బిర్యానీ తినిపించేది. ఈరోజు మన దేశంలో ఏ చిన్న పేలుడు ఘటన జరిగినా పాకిస్థాన్‌ వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోందంటే దానికి కారణం మోదీ సర్కారు చేపట్టిన చర్యలే. శ్రీరాముడు లేడని చెప్పిన కాంగ్రెస్‌కు అధికారంలో ఉండే అర్హత లేదు.

రాజస్థాన్‌లోని చిత్తోడ్‌గఢ్‌, జోధ్‌పుర్‌లలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌


విపక్ష కూటమిలో విభేదాలున్నాయి

కీలకాంశాల్లో విపక్ష కూటమిలో ఐక్యత లేదు. విభేదాలతో అది సతమతమవుతోంది. సీపీఐ అగ్రనేత డి.రాజా సతీమణి అన్నీరాజా పోటీచేస్తున్న వయనాడ్‌ నుంచి రాహుల్‌గాంధీ బరిలో ఉండడాన్ని ఆ కూటమి పక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. కేరళ, వయనాడ్‌ల గురించి ఐదేళ్లలో ఆయన ఎన్నడూ పార్లమెంటులో మాట్లాడలేదు. ఇప్పుడాయన తమ పార్టీ జెండానూ వయనాడ్‌లో చేతపట్టడం లేదు. పార్టీ పతాకాన్నే కాపాడుకోలేని వ్యక్తి దేశాన్ని రక్షించగలరా?

అహ్మదాబాద్‌లో విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌


కుటుంబ సభ్యుల అందలానికే లాలు ప్రాధాన్యం

ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్‌ తన కుటుంబ సభ్యులకే ప్రాధాన్యమిస్తారు. కుమారులు, కుమార్తెలను అందలమెక్కించేందుకు ఆరాటపడతారు. మొదట కుమారుల వంతు, ఇప్పుడు కుమార్తెల వంతు. అసలు ఎవరైనా అంతమంది పిల్లల్ని కంటారా? ఆర్జేడీ పాలనలో బిహార్‌ ఎలా ఉండేదో అందరికీ తెలుసు.

బిహార్‌లోని కటిహార్‌లో సీఎం నీతీశ్‌కుమార్‌


మే నెల నుంచైనా ఇంటింటికీ పింఛన్లు అందజేయాలి
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు ఇతర వర్గాలకు మే ఒకటో తేదీ నుంచైనా ఇళ్ల వద్దే సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేయాలని తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. ఈ దశగా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ జవహర్‌రెడ్డిని డిమాండ్‌ చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి తగిన సిబ్బంది ఉన్నా.. కావాలనే శవ రాజకీయాలు చేసి, 60 మంది పింఛనుదారుల మృతికి సీఎం జగన్‌తో పాటు సెర్ప్‌ సీఈవో మురళీధర్‌రెడ్డి కారణమయ్యారు. వచ్చే నెల నుంచైనా ఈ తరహా రాజకీయాలు మానుకోవాలి’ అని పేర్కొన్నారు.


జగన్‌ నాటకాల రాయుడు: లోకేశ్‌  

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఓ కులాన్ని కించపరుస్తూ వైకాపా నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ శనివారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా తీవ్రంగా ఖండించారు. ‘బయటకు నటిస్తూ.. లోపల జగన్‌రెడ్డి, ఆ పార్టీ నేతలు ఇలా అహంకార ధోరణితో వ్యవహరిస్తున్నారు. జగన్‌ ఓ అపరిచితుడు, నాటకాల రాయుడని ప్రజలు ఇందుకే అంటారు’ అని పేర్కొన్నారు. ‘ఈటీవీ’లో ప్రసారమైన రాజమోహన్‌రెడ్డి వ్యాఖ్యల వీడియోనూ లోకేశ్‌ పోస్టు చేశారు.


వేధింపులు ఆపకపోతే భారీ మూల్యం తప్పదు
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో తెదేపా అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావును ఇరికించాలని చూస్తూ...వేధిస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేధింపులు ఆపకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించక తప్పదని పోలీసు అధికారుల్ని హెచ్చరించారు. జగన్‌ చెప్పినట్టల్లా ఆడి మీ జీవితాల్ని నాశనం చేసుకోవద్దని వారికి హితవుపలికారు. ఈ కేసులో విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ప్రకటనపై ఈసీ విచారణకు ఆదేశించాలని శనివారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ‘‘ఈ కేసుపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తాం. రాబోయేది ఎన్డీయే ప్రభుత్వమే. అప్పుడు ఈ గులకరాయి గూడుపుఠాణీ వెనకున్న వారందరినీ శిక్షిస్తాం’’ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.


మద్యాన్ని ఏరులై పారిస్తున్న వైకాపా
సీపీఐ నేత రామకృష్ణ ధ్వజం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో అధికార వైకాపా మద్యాన్ని ఏరులై పారిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. ‘‘2019 ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే మద్యాన్ని సంపూర్ణంగా నిషేధిస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. కానీ.. అధికారం చేపట్టినప్పటి నుంచి నాసిరకం మద్యం అమ్మకాలు సాగిస్తూ కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించారు. మద్యాన్ని నిషేధించిన తర్వాతే 2024 ఎన్నికల్లో ఓట్లు అడుగుతానన్నా జగన్‌ ఆ మాట తప్పారు. చివరికి వాటి అమ్మకాలను తాకట్టుపెట్టి రూ.కోట్లు అప్పులు తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. డబ్బు పంపిణీ ద్వారా ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టి లబ్ధిపొందేందుకు వైకాపా ప్రయత్నిస్తోంది’’ అని రామకృష్ణ శనివారం ఓ ప్రకటనలో ఆరోపించారు.


రెండు బటన్‌లు నొక్కి జగన్‌ను ఇంటికి పంపడానికి ప్రజలు ‘సిద్ధం’
జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వ్యక్తిగత జీవితంపై సీఎం జగన్‌ చేసిన వాఖ్యలు హేయమైనవని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్‌ మండిపడ్డారు. ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినప్పటికీ.. జగన్‌ తీరులో మార్పులేదని శనివారం అసహనం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనైనా పోటీచేసే సత్తా పవన్‌కు ఉంది. 130సార్లు బటన్‌ నొక్కి నిధులు విడుదల చేశానని చెప్పిన జగన్‌ను.. రెండు బటన్‌లు నొక్కి ఆయనను ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వైకాపా తెచ్చిన సున్నా వడ్డీ పథకం వల్ల పేదలకు మిగిల్చింది గుండు సున్నానే. ఈ పథకం ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూరలేదు. రూ.లక్ష రుణం ఇచ్చామంటున్న ప్రభుత్వం.. ఎంతమందికి లబ్ధి చేకూరిందో చెప్పాలి?’ అని ఆయన నిలదీశారు.


మోదీకి మంత్రి అవినీతి కనిపించదా? : కాంగ్రెస్‌

దిల్లీ: ఈడీ దాడులతో విపక్షాలను బెదిరించే ప్రధాని మోదీ అవినీతి ఆరోపణల కింద విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తిని కేబినెట్‌లోకి ఎలా తీసుకున్నారని కాంగ్రెస్‌ పార్టీ ప్రశ్నించింది. కేంద్ర మంత్రిగా ఉన్న ఉత్తర బెంగళూరు లోక్‌సభ అభ్యర్థిపై రూ.105 కోట్ల హవాలా కేసులో ఈడీ విచారణ గత పదేళ్లుగా కొనసాగుతూనే ఉందని, ఎలాంటి పురోగతి లేదని పేర్కొంది. భాజపా వాషింగ్‌మెషిన్‌ పనితీరు మందగించిందా లేదా స్వపక్షంలోని నేతలకు మినహాయింపు ఏమైనా ఉందా అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ శనివారం ‘ఎక్స్‌’ ద్వారా ప్రశ్నించారు. భాజపా వాషింగ్‌మెషిన్‌ మంత్రి శోభా కరాంద్లజే విషయంలో వేగంగా పనిచేయడం లేదేమని అడిగారు. కర్ణాటకలో బయటపడిన రూ.2,500 కోట్ల శ్రీ గురు రాఘవేంద్ర సహకార బ్యాంకు కుంభకోణంలో డిపాజిటర్లకు భాజపా నేతలు ఇచ్చిన హామీలను మళ్లీ పట్టించుకోలేదని, ఈ విషయంలో మోదీ జోక్యం చేసుకొని బాధితులకు ఎందుకు న్యాయం చేయడం లేదో చెప్పాలని జైరాం రమేశ్‌ డిమాండ్‌ చేశారు.


ఈడీ, సీబీఐ మీ హయాంలోనివే!
కాంగ్రెస్‌ విమర్శలకు కేంద్ర మంత్రి మేఘ్‌వాల్‌ కౌంటర్‌

దిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలను మోదీ సర్కారు తమపై ప్రయోగిస్తోందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ తిప్పికొట్టారు. వీటిని కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభించారని గుర్తు చేస్తూ ఆ పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు. భారతీయ న్యాయసంహిత చట్టాలపై నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న మేఘ్‌వాల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కేంద్ర దర్యాప్తు సంస్థలను తమపైకి ఉసిగొల్పుతుందంటూ భాజపాపై ప్రతిపక్షాలు ఆరోపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నిజానికి మీరు (కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ) అధికారంలో ఉన్నప్పుడే వీటి ఆవిర్భావం జరిగింది కదా. అప్పటి నుంచే అవి పనిచేస్తున్నాయి. మీరు ఎందుకు ఆందోళన చెందుతున్నారు. చట్ట నిబంధనల ప్రకారమే చర్యలుంటాయి. ప్రతిపక్షాల అసత్య ప్రచారాలు ఎన్నికల వేళ చర్చనీయాంశంగా మారుతున్నాయి’ అని మేఘ్‌వాల్‌ పేర్కొన్నారు. కొత్త నేర న్యాయ చట్టాలపై ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, పలువురు న్యాయమూర్తులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఈడీ చీఫ్‌ రాహుల్‌ నవీన్‌, సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్‌ సూద్‌ పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img