icon icon icon
icon icon icon

దళితులంటే జగన్‌కు చులకన

సీఎం జగన్‌కు దళితులంటే చులకన అని.. అందుకే సొంత పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలం, ఎంపీ వరప్రసాద్‌రావులను సైతం చిన్నచూపు చూశారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

Published : 21 Apr 2024 05:19 IST

వైకాపాలో దళిత నేతలపైనా పెత్తందారీతనమే
ఎమ్మెల్యే ఆదిమూలం, ఎంపీ వరప్రసాద్‌లపై పెద్దిరెడ్డి పెత్తనం
అందుకే వాళ్లిద్దరూ జగన్‌రెడ్డికి ఎదురెళ్లారు
రాష్ట్రంలో క్లాస్‌ వార్‌ కాదు.. క్యాష్‌ వార్‌ నడుస్తోంది
పొదలకూరు, సత్యవేడు సభల్లో చంద్రబాబు ధ్వజం

ఈనాడు- నెల్లూరు, ఈనాడు డిజిటల్‌-తిరుపతి, న్యూస్‌టుడే- సత్యవేడు: సీఎం జగన్‌కు దళితులంటే చులకన అని.. అందుకే సొంత పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలం, ఎంపీ వరప్రసాద్‌రావులను సైతం చిన్నచూపు చూశారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వైకాపాలోని దళిత ప్రజాప్రతినిధులపైనా పెత్తందారీతనమే రాజ్యమేలిందని మండిపడ్డారు. జగన్‌ అయిదేళ్ల పాలనలో దళితులపై ఆరు వేల కేసులు నమోదయ్యాయి.. 180 మంది చనిపోయారని గుర్తుచేశారు. ఈ ముఖ్యమంత్రి.. దళితుణ్ని చంపి డోర్‌ డెలివరీ చేసే వ్యక్తిని పక్కన పెట్టుకుని తిరుగుతున్నారని, శిరోముండనం కేసులో నేరస్థుడైన వ్యక్తికి ఎమ్మెల్యే టికెటిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుంగనూరులో ఉండే పెద్దారెడ్డికి సత్యవేడులో ఏం పని అంటూ ప్రశ్నిస్తూ ఆదిమూలం.. జగన్‌రెడ్డికే ఎదురెళ్లారన్నారు. ఎంపీ వరప్రసాదరావును విద్యావంతుడని కూడా  చూడకుండా ఇబ్బందులు పెట్టారన్నారు. పుంగనూరు పెద్దతలకాయ పెద్దిరెడ్డి సత్యవేడులో పెత్తనం చేస్తూ ఇక్కడి ఇసుక, గ్రావెల్‌ అక్రమంగా దోచుకున్నారని గుర్తుచేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు, తిరుపతి జిల్లా సత్యవేడుల్లో శనివారం నిర్వహించిన ప్రజాగళం సభల్లో చంద్రబాబు వైకాపా ప్రభుత్వం, జగన్‌ దోపిడీ, దౌర్జన్యాలపై ధ్వజమెత్తారు. జగన్‌ దుర్మార్గాలను ఎదిరించిన ఆదిమూలం, వరప్రసాదరావులను, సర్వేపల్లిలో తెదేపా అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

దళితుల జీవితాల్లో వెలుగులు నింపా

‘నా పాలనలో ఉపప్రణాళిక, విదేశీవిద్య అమలు చేసి దళితుల జీవితాల్లో వెలుగులు నింపా. నేడు విదేశీవిద్య పథకం పేరు మార్చి, అర్హులకు లబ్ధి చేకూరకుండా చేశారు. బ్యాక్‌లాగ్‌ పోస్టులు, అంబేడ్కర్‌ స్టడీ సెంటర్లు నామరూపాల్లేకుండా చేశారు’ అని ప్రస్తావించారు. ‘రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు ఎన్టీఆర్‌ నాంది పలికితే.. నేను దానికి అభివృద్ధిని జోడించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాను. పింఛను, రూ.2కే కిలో బియ్యం తెచ్చింది ఎన్టీఆర్‌. రూ.200 నుంచి పది రెట్లు పింఛను పెంచింది నేను. అలాంటి మాతో మీకు పోటీయా? సంక్షేమానికి మీరెంత ఖర్చు పెట్టారు జగన్‌రెడ్డీ?’ అని నిలదీశారు. తెదేపా హయాంలో పేదలకు పండగ కానుకలు ఇచ్చాం. అయిదేళ్లుగా వస్తున్నాయా అని ప్రశ్నించారు. ‘సన్నబియ్యం పేరుతో జగన్‌రెడ్డి ప్రజలను మోసం చేశారు. నాసిరకం మద్యంతో మహిళల పుస్తెలు తెంచారు. ఇసుకను కొల్లగొట్టారు. ఒకప్పుడు రూ.వెయ్యికి దొరికే ట్రాక్టర్‌ ఇసుక ప్రస్తుతం రూ.5 వేలు.. మిగిలిన రూ.4 వేలు జగన్‌రెడ్డి జేబులోకి వెళుతున్నాయి.రాష్ట్రంలో జరుగుతోంది క్లాస్‌వార్‌ కాదు.. క్యాష్‌ వార్‌’ అని ధ్వజమెత్తారు. ‘కూటమి ప్రభుత్వం రాగానే రూ.1.50 పైసలకే యూనిట్‌ విద్యుత్తు సరఫరా చేసి, ఆక్వా రంగానికి పూర్వ వైభవం తీసుకొస్తాం. మొదటి సంతకం డీఎస్సీపైనే పెడతాం. జాబ్‌ క్యాలెండర్‌ తీసుకొస్తాం. అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తాం. రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తాం’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రజలు మీకిచ్చిన ఒక్క ఛాన్స్‌ అయిపోయింది, ఇక మీ ఆటలు సాగవని జగన్‌ను ఉద్దేశించి అన్నారు. గత అయిదేళ్లలో ప్రజల సంపద తగ్గి జగన్‌ ఆస్తులు, భారతి సిమెంట్‌, సాక్షి పత్రికల ఆదాయాలు మాత్రమే పెరిగాయని విమర్శించారు.

ఈసారి జగన్‌ చెవిలో పూలు పెడదాం

‘గొడ్డలి, కోడికత్తి, గులకరాయి అంటూ జగన్‌రెడ్డి డ్రామాలు ఆడుతున్నారు. ఆయన్ను చంపేందుకు గులకరాయి వేసి నేను హత్యాయత్నం చేయించానట! ఎన్నికలు రాగానే ప్రజల చెవుల్లో పూలు పెడదామనుకుంటున్నార[ు. ఈసారి అందరం కలసి జగన్‌రెడ్డి చెవిలో పూలు పెడదాం. కృష్ణపట్నం పోర్టు కింద భూములు కోల్పోయినవారికి రూ.15 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయిస్తే.. ఈ ప్రభుత్వం నిలిపివేసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ సమస్యను పరిష్కరిస్తాం. నెల్లూరు జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం’ అని హామీ ఇచ్చారు. ‘జగన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, సజ్జలరెడ్డిలకు నెల్లూరులో కాకాణి తోడయ్యారు. ఉదయగిరి నారాయణ అనే దళితుణ్ని చంపేస్తే చర్యల్లేవు. ఇళ్ల పట్టాలకు 3 వేల ఎకరాలు కొని 6 వేల ఎకరాలుగా చూపించి డబ్బు కొట్టేశారు. కరోనాలో పెద్ద ప్యాలెస్‌ కట్టారు. వైకాపా అక్రమాలపై పోరాడితే సోమిరెడ్డిపై 22 కేసులు పెట్టారు.  వైకాపా అధికారంలోకి వచ్చాక దుర్మార్గుడైన జగన్‌మోహన్‌రెడ్డి నాపైనా 22 కేసులు పెట్టించారు. భవిష్యత్తులో నేనేంటో చూపిస్తా. చక్రవడ్డీతో తీర్చేస్తా’ అని చంద్రబాబు హెచ్చరించారు.

చంద్రబాబును కలిసిన మంతెన రామరాజు

గూడూరు పట్టణం, న్యూస్‌టుడే: ఎన్నికల ప్రచారంలో భాగంగా గూడూరు వచ్చిన చంద్రబాబును ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు శనివారం కలిశారు. ఉండిలో కూటమి తరఫున తెదేపా అభ్యర్థిగా రామరాజును ప్రకటించారు. అయితే ఇక్కడ అభ్యర్థిని మారుస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో రామరాజు గూడూరుకు వచ్చి చంద్రబాబును కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img