icon icon icon
icon icon icon

అభ్యర్థుల ఆస్తులు.. అప్పులు.. కేసులు

లోక్‌సభ, శాసనసభ స్థానాలకు అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. శనివారం మూడో రోజు వివిధ పార్టీల నేతలు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు నామినేషన్‌ పత్రాలతో పాటు అఫిడవిట్లు సమర్పించారు.

Updated : 21 Apr 2024 14:30 IST

లోక్‌సభ, శాసనసభ స్థానాలకు అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. శనివారం మూడో రోజు వివిధ పార్టీల నేతలు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు నామినేషన్‌ పత్రాలతో పాటు అఫిడవిట్లు సమర్పించారు. తమతో పాటు కుటుంబ సభ్యుల ఆస్తులు, అప్పులు, ఆదాయ వనరులు, విద్యార్హతలు, పోలీసు కేసులకు సంబంధించిన వివరాలు అందజేశారు.


 చెవిరెడ్డిపై 11 క్రిమినల్‌ కేసులు

సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడు, వైకాపా ఒంగోలు లోక్‌సభ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సమర్పించిన అఫిడవిట్‌లో తనకు సొంత కారు లేదని పేర్కొన్నారు. తిరుపతి ఎస్వీయూలో ఎంఏ, న్యాయశాస్త్రాల్లో పట్టా పొందిన చెవిరెడ్డి.. ‘దివంగత సీఎం రాజశేఖరరెడ్డి పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాల’పై పరిశోధన చేసి, డాక్టరేట్‌ పొందారు. చెవిరెడ్డిపై 11 క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో మాజీ సీఎం చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డగించడం, శ్మశాన భూముల ఆక్రమణ, దాడులు, దౌర్జన్యాలు, అధికారుల విధులను అడ్డుకోవడం, ధర్నాలు, నిరసనలపై నమోదైన కేసులు ప్రధానమైనవి. తాజాగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనపై 2 కేసులు నమోదయ్యాయి. భాస్కర్‌రెడ్డి భార్య లక్ష్మీకాంతమ్మ పేరిట ఫార్చ్యునర్‌ (రూ.19 లక్షలు) కారు, 960 గ్రాముల బంగారం (రూ.58.50 లక్షలు) ఉన్నాయి. చెవిరెడ్డి పేరిట రూ.1.18 కోట్ల చరాస్తులు, రూ.2.20 కోట్ల స్థిరాస్తులు, రూ.66 లక్షల నగదు ఉన్నాయి. అప్పులు రూ.6.53 కోట్లు. భార్య లక్ష్మీకాంతమ్మ పేరిట స్థిరాస్తి రూ.6.57 కోట్లు. చరాస్తి రూ.6.60 కోట్లు. అప్పు రూ.6.53 కోట్లు. ఆమె చేతిలో రూ.13 లక్షల నగదు ఉంది.


వీరాంజనేయులు చరాస్తులు రూ.98 వేలట

శింగనమల వైకాపా అభ్యర్థి ఎం.వీరాంజనేయులు తన చరాస్తులు రూ.98 వేలుగా పేర్కొన్నారు. ఆయనపై ఎలాంటి కేసులూ లేవు.


రజిని కుటుంబ ఆస్తులు తరిగాయట!

రాష్ట్ర మంత్రి, గుంటూరు పశ్చిమ వైకాపా అభ్యర్థి విడదల రజిని కుటుంబ ఆస్తులు ఐదేళ్లలో తగ్గినట్లు చూపించారు. 2019లో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు సమర్పించిన అఫిడవిట్‌ ప్రకారం.. ఆమె ఆస్తులతో పాటు కుటుంబ సభ్యులవి కలిపి మొత్తం విలువ రూ.129.62 కోట్లు. ప్రస్తుత విలువ రూ.85.76 కోట్లు. ఐదేళ్లలో రూ.43.86 కోట్లు తగ్గాయి. అయితే మంత్రి రజిని వ్యక్తిగత ఆస్తులు బాగా పెరిగాయి. 2019లో రూ.3.70 కోట్లు కాగా, ప్రస్తుతం రూ.18.80 కోట్లు. ఐదేళ్లలో కొత్తగా సాగు భూములు, స్థలాలు సమకూరాయి. కొన్ని వారసత్వంగా రాగా, కొన్ని కొన్నారు. ఆమె భర్త కుమారస్వామి ఆస్తులు ఐదేళ్లలో తగ్గాయి. 2019లో రూ.124.20 కోట్లు అయితే, నేడు రూ.66.62 కోట్లు. ఆయనకు 2019లో రూ.120 కోట్ల విలువైన ఐటీ కంపెనీ ఉండగా, ప్రస్తుతం రూ.22 కోట్లు, రూ.5 కోట్ల విలువైన రెండు కంపెనీలున్నాయి.


వాసుపల్లి ఆస్తులు.. నాలుగింతలు

విశాఖ దక్షిణ వైకాపా అభ్యర్థి వాసుపల్లి గణేశ్‌కుమార్‌, ఆయన భార్య ఉషారాణి దంపతుల ఉమ్మడి ఆస్తులు ఐదేళ్లలో 4 రెట్లు పెరిగాయి. 2019లో స్థిరాస్తి రూ.7.72 కోట్లు కాగా, ఇప్పుడు రూ.37.9 కోట్లు. 2019లో చరాస్తులు రూ.1.35 కోట్లు కాగా, ప్రస్తుతం రూ.22.4 లక్షలు. ఇద్దరికీ రెండు ఫార్చ్యునర్లు సహా 6 కార్లు, రూ.23.45 కోట్ల అప్పులున్నాయి. వాసుపల్లిపై 4 కేసులున్నాయి. 2008లో ఆస్తి వివాదంలో ఒకరిపై దాడి చేయగా, గణేశ్‌పై కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో కోర్టు 6 నెలల జైలుశిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది.


కోలగట్ల దంపతులకు కార్లే లేవట!

విజయనగరం అసెంబ్లీ స్థానం వైకాపా అభ్యర్థి, శాసనసభ ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి కుటుంబ ఆస్తులు రూ.29.39 కోట్లు. వీరభద్రస్వామి పేరిట చరాస్తులు రూ.6.48 కోట్లు, స్థిరాస్తులు రూ.15.34 కోట్లు. అతని భార్య పేరిట చరాస్తులు రూ.2.97 కోట్లు, స్థిరాస్తులు రూ.4.60 కోట్లు. ఇద్దరికీ వాహనాలు లేవు. ఆయన వద్ద రూ.1.56 లక్షల నగదు, రూ.67 లక్షల విలువైన కిలో బంగారం, భార్య వద్ద రూ.1.11 లక్షల నగదు, రూ.1.13 కోట్ల విలువైన 2 కిలోల బంగారం, 4 కిలోల వెండి ఉన్నాయి. కోలగట్ల పేరిట రూ.3.30 కోట్ల డిపాజిట్లు, భార్య పేరిట రూ.3.70 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. కోలగట్ల దంపతులు వేర్వేరుగా ఇతరులకు రూ.4.05 కోట్ల అప్పులివ్వగా, ఆయనకు వ్యక్తిగతంగా రూ.7.49 కోట్ల అప్పు ఉంది. కోలగట్లపై 2 క్రిమినల్‌ కేసులున్నాయి.


వంశీ సంపద భారీగా పెరుగుదల

కృష్ణా జిల్లా గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ ఆస్తులు పదేళ్లలో భారీగా పెరిగాయి. 2014లో స్థిర, చరాస్తుల మొత్తం రూ.72.50 కోట్లు కాగా, 2019లో రూ.69.08 కోట్లు. ప్రస్తుతం రూ.172.36 కోట్లు. వంశీ భార్య పంకజశ్రీ ఆస్తులు 2014లో రూ.9.55 కోట్లు కాగా, 2019లో రూ.9.08 కోట్లు. ఇప్పుడు రూ.18.99 కోట్లు. తరచూ కార్లు మారుస్తూ, కాన్వాయ్‌తో తిరిగే వంశీ పేరిట రూ.74.69 లక్షల విలువైన ఆడి కారు, రూ.46.51 లక్షల విలువ చేసే బెంజ్‌ కారు ఉన్నాయి. వంశీ పేరిట 1.6 కిలోలు, భార్య పేరిట 1.3 కిలోల బంగారముంది. 2019 ఎన్నికల సందర్భంగా జరిగిన వివాదంలో వంశీపై 3 కేసులు నమోదయ్యాయి.


అన్న, వదిన దగ్గర షర్మిల అప్పులు

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పేరిట రూ.132 కోట్ల ఆస్తులున్నాయి. వీటిలో చరాస్తులు రూ.123.26 కోట్లు, స్థిరాస్తులు రూ.9.29 కోట్లు. భర్త బ్రదర్‌ అనిల్‌కుమార్‌ పేరిట చరాస్తులు రూ.45.19 కోట్లు. స్థిరాస్తులు రూ.4.05 కోట్లు. సోదరుడు సీఎం జగన్‌ దగ్గర రూ.82.58 కోట్లు, వదిన భారతి నుంచి రూ.19.56 లక్షల రుణం తీసుకున్నారు. అనిల్‌కుమార్‌.. రతన్‌ అనే వ్యక్తి నుంచి రూ.50 లక్షలు, వైఎస్‌ విజయమ్మ నుంచి రూ.40 లక్షలు, షర్మిల నుంచి రూ.29.99 కోట్ల అప్పు తీసుకున్నారు. షర్మిల పేరిట రూ.4.61 కోట్ల విలువైన బంగారం, 39.41 ఎకరాల భూమి ఉంది. కడప, తాడేపల్లి, బంజారాహిల్స్‌, గాంధీనగర్‌ ఠాణాల్లో మొత్తం 8 కేసులున్నాయి.


పురందేశ్వరి కుటుంబ ఆస్తులు రూ.61.46 కోట్లు

రాజమహేంద్రవరం లోక్‌సభ భాజపా అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వరరావు, కుటుంబ సభ్యుల స్థిర, చరాస్తుల మొత్తం విలువ రూ.61.46 కోట్లు. ఇందులో చరాస్తులు రూ.11.75 కోట్లు. స్థిరాస్తులు రూ.49.70 కోట్లు. అప్పులు రూ.6.73 కోట్లు. 1.6 కిలోల బంగారం, 74 క్యారెట్ల వజ్రాలు, 10 గ్రాముల ముత్యాలు ఉండగా, వీటి విలువ రూ.1.19 కోట్లు. పురందేశ్వరి పేరిట వ్యవసాయ భూమి, వాహనం లేవు. హైదరాబాద్‌ బంజారా హిల్స్‌లోని ఇంటి విలువ రూ.5.55 కోట్లు. ఆమెపై కేసులు లేవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img