icon icon icon
icon icon icon

మాచర్ల మార్పు కోరుకుంటోంది!

ఒక చేత్తో ఇస్తున్నారు... మరో చేత్తో లాక్కుంటున్నారు. ఈ విషయం మొదట్లో అర్థం కాలేదు గానీ ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తోంది.

Updated : 22 Apr 2024 08:31 IST

అయిదేళ్లలో దాడులు.. దౌర్జన్యాలు.. హత్యలే
ఇప్పటికీ 50 పడకల సర్కారు ఆస్పత్రే దిక్కు
పల్నాడు ఎన్నికల యుద్ధం ఆసక్తికరం


ఒక చేత్తో ఇస్తున్నారు... మరో చేత్తో లాక్కుంటున్నారు. ఈ విషయం మొదట్లో అర్థం కాలేదు గానీ ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తోంది. కరెంట్‌ బిల్లులు, బస్సు ఛార్జీలు పెంచేశారు.

మాచర్లలోని ఓ కళాశాల స్వీపర్‌


పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నాలుగుసార్లు గెలిచారు. మార్పు ఉంటే మంచిదన్న టాక్‌ వినపడుతోంది. పరిశ్రమలు పెడితే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. అలాంటివి ఇక్కడ లేవు.

మాచర్లలో ముస్లిం వర్గానికి చెందిన ఓ దర్జీ


చిన్న చిన్నవాటికి పోలీసు కేసులు పెట్టించడం ఎక్కువైంది. అందుకే నేను వైౖకాపా అభిమానినైనా ఈసారి బ్రహ్మానందరెడ్డి విజయానికి పనిచేస్తున్నా.  

మాచర్ల మండలం సుబ్బారెడ్డిపాలేనికి చెందిన ఓ వ్యవసాయ కూలీ


ఈనాడు, అమరావతి: ‘ఒకప్పుడు ఎన్నికలొస్తే బాంబుదాడులు... హత్యలు జరిగేవని పెద్దవాళ్లు చెబుతుండేవారు. ఈసారి మళ్లీ అలాంటి పరిస్థితి రాబోతోందట.’ మాచర్లలో ఈసారి ఎవరిది గెలుపు అని అడిగినప్పుడు 30 ఏళ్ల యువకుడి సమాధానమిది. పల్నాడు జిల్లాలో చివరి నియోజకవర్గమైన మాచర్లలో ఈ అయిదేళ్లలో అభివృద్ధి మచ్చుకైనా కనిపించకపోగా... కక్షలు, కార్పణ్యాలను వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పెంచి పోషించారన్న అభిప్రాయం ప్రజల్లో వినిపిస్తోంది. వైకాపా ఇక్కడ హత్యా రాజకీయాలకు మళ్లీ తెరలేపిందన్న ప్రచారం సాగుతోంది. మాచర్ల ఎమ్మెల్యేగా పిన్నెల్లి నాలుగోసారి గెలవడం, వైకాపా అధికారంలోకి రావడం, తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా జూలకంటి బ్రహ్మానందరెడ్డి నియమితులు కావడంతో ఇక్కడ తమ ఆధిపత్యం కోసం వైకాపా నేతలు రాజకీయ కక్షల్ని ఎగదోశారు. మళ్లీ ఫ్యాక్షనిజం పడగ విప్పింది. మే 13న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా మరోసారి పిన్నెల్లి బరిలో నిలవగా.. తెదేపా నుంచి 15 సంవత్సరాల తర్వాత జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాత ప్రత్యర్థితో తలపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా రాజకీయ పరిస్థితులపై ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి మాచర్ల పట్టణంతోపాటు దుర్గి, వెల్దుర్తి, రెంటచింతల మండలాల్లో పర్యటించారు. ఎక్కువమంది నుంచి నాలుగుసార్లు గెలిచారు కదా... ఇక మార్పు ఉండాలనే మాటే వస్తోంది. 2002 నుంచి వైకాపా శ్రేణులు చేసిన దారుణాలను ఓటర్లు గుర్తు చేసుకుంటున్నారు. తెదేపా తమ్ముళ్లలో జోష్‌ కనిపిస్తోంది. ఈసారి పిన్నెల్లిని ఇంటికి పంపిస్తామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో స్వల్ప మెజారిటీతోనైనా తమ పార్టీ గెలుస్తుందని వైకాపా శ్రేణులు విశ్వాసంతో ఉన్నాయి.

హత్యలు రెండు.. అరాచకాలు కోకొల్లలు

గత అయిదేళ్లుగా వైకాపా నేతలు చేయని అరాచకాలు లేవు. బెదిరించి, నకిలీ పత్రాలు సృష్టించి వందల ఎకరాల ప్రైవేటు భూములను సొంతం చేసుకున్నారు. దీని వెనుక ఎమ్మెల్యే, ఆయన తమ్ముడి ప్రోద్బలం ఉందని తెదేపా ఆరోపిస్తోంది. ఇక మట్టి తరలింపు, మద్యం అమ్మకాల గురించి ఎంత చెప్పినా తక్కువే. తెదేపా నేతల్ని, కార్యకర్తలను వైకాపా వర్గాలు పట్టపగలు హత్యలు చేశాయి. 2022 జనవరిలో వెల్దుర్తి మండలం గుండ్లపాడులో తోట చంద్రయ్యను వైకాపా మండల నేత, ఆయన వర్గీయులు పట్టపగలు నడిరోడ్డుపై పీక కోసి చంపేశారు. ఆరు నెలలు తిరక్కుండానే ఆ ఏడాది జూన్‌లో దుర్గి మండలం జంగమేశ్వరపాడులో తెదేపా నాయకుడు జల్లయ్యను హత్య చేశారు. దీంతో వెల్దుర్తి మండలం గుండ్లపాడు, దుర్గి మండలం ఆత్మకూరు గ్రామాల్లో కుటుంబాలకు కుటుంబాలే భయంతో ఊళ్లు వదిలిపోయాయి. ‘తెదేపా కార్యకర్తలు, సానుభూతిపరుల ఇళ్లలో కొడవలి ఉన్నా మారణాయుధాలని పోలీసులతో అక్రమ కేసులు పెట్టించారు. ఎవరైనా నోరు ఎత్తితే గంజాయి దొరికిందని కేసు పెడతారో, తెల్లారేసరికి ఎవరి పొలం ప్రభుత్వ భూమిగా మారుతుందో అని భయం. ఇంత అరాచకం ఎక్కడైనా ఉందా?’ అని వెల్దుర్తి మండలానికి చెందిన నేత ఒకరు చెప్పారు.

నాలుగు సార్లు గెలిచారుగా

పిన్నెల్లి ఇప్పటివరకు నాలుగుసార్లు మాచర్ల ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో కాంగ్రెస్‌ నుంచి, 2012 ఉప ఎన్నికలు, 2014, 2019లో వైకాపా నుంచి గెలిచారు. 20 ఏళ్లుగా ఇక్కడ పసుపుజెండా ఎగరలేదు. 2004, 2009లో ఇక్కడ గెలిచిన జూలకంటి బ్రహ్మానందరెడ్డిని తెదేపా మళ్లీ బరిలోకి దించింది. ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తూ తెదేపా కార్యకర్తలకు అండగా ఉంటున్నారు. మళ్లీ పిన్నెల్లి గెలిస్తే నియోజకవర్గం ప్రశాంతంగా ఉండదని, తెల్లారితే ఎవరి హత్యవార్త వినాల్సి వస్తుందోనన్న భయం సామాన్య ప్రజానీకాన్ని వెంటాడుతోంది. అందుకే ఈసారి మార్పు రావాలన్న అభిప్రాయం మాచర్ల పట్టణంలో ఎక్కువగా వినిపిస్తోంది. ‘దౌర్జన్యాలు మరీ విచ్చలవిడి అయ్యాయి. అందుకే మార్పు కోరుకుంటున్నారు’ అని విశ్రాంత ఉద్యోగి చెప్పారు. ఈసారి గెలిచి మంత్రినవుతానని ఎమ్మెల్యే ప్రచారం చేస్తున్నారు కదా అని ప్రశ్నిస్తే, ‘ఎమ్మెల్యేగా ఉంటేనే ఆగడాలు భరించలేకపోతున్నాం. ఇక మంత్రి అయితే ఏమైనా ఉందా?’ అని ఆయన ఎదురు ప్రశ్నించారు. ‘పిన్నెల్లి అభివృద్ధి చేసింది ఏమీ లేదు. కాకపోతే జగన్‌ను చూసి ఓట్లు వేయాల్సిందే. పోయినసారి 22వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈసారి 100 ఓట్లతోనైనా గెలుస్తారని నమ్మకంతో ఉన్నాం’ అని వెల్దుర్తి మండలం ఉప్పలపాడుకు చెందిన ఓ రైతు ఒకరు వ్యాఖ్యానించారు. ఆయన వైకాపా కార్యకర్త. జూలకంటిపై ప్రజల్లో కొంత సానుభూతి వ్యక్తమవుతోంది.


తాగునీటికీ నరకమే!

2009 నుంచి పిన్నెల్లి వరుసగా గెలుస్తున్నా అభివృద్ధి మచ్చుకైనా లేదు. రోగమొచ్చినా.. పిల్లల ఉన్నత చదువులకైనా నరసరావుపేట లేదా గుంటూరు వెళ్లాలి. వెల్దుర్తి, దుర్గి మండలాలకు సాగునీరే కాదు.. తాగునీటికీ నరకమే. ఎన్నికలొస్తున్నాయని, గత నవంబరులోనే సీఎం జగన్‌ హడావుడిగా వరికపూడిసెల ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. లక్ష జనాభా ఉన్న మాచర్లలో 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రే ఉంది. దాన్ని 100 పడకల స్థాయికి పెంచుతామని ఎన్నికల ముందు వైకాపా హామీ ఇచ్చింది. ఎమ్మెల్యే ఈ అయిదేళ్లు పట్టించుకోకుండా నవంబరులో సీఎం జగన్‌ వచ్చినప్పుడు చెప్పగా, ఆయన ఓ హామీ ఇచ్చేశారు. ప్రస్తుతం అక్కడ కనీస సౌకర్యాలు లేకపోవడంతో నియోజకవర్గ ప్రజలు 90 కిలోమీటర్ల దూరంలోని నరసరావుపేటకు లేదా 130 కిలోమీటర్ల దూరమున్న గుంటూరుకు వెళ్లాల్సిందే. దుర్గి మండలంలోని బుగ్గవాగు నుంచి పైపులైన్‌ ద్వారా మాచర్లకు రూ.81.37 కోట్ల అంచనాతో తాగునీటిని అందిస్తామని 2023 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసినా పనులు నత్తనడకన సాగుతున్నాయి. నియోజకవర్గం ఏర్పడిన 1955 నుంచి ఏ ఒక్కరూ రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందలేదు. ఆ అరుదైన అవకాశం పిన్నెల్లికి వచ్చినా ప్రయోజనం లేదని పట్టణవాసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మాచర్ల నుంచి నాగార్జునసాగర్‌ రోడ్డు, గుంటూరు జిల్లా నడికుడి నుంచి మాచర్ల మీదుగా యర్రగొండపాలెం, దోర్నాల, శ్రీశైలం వరకు జాతీయ రహదారులను కేంద్రప్రభుత్వం నిర్మించింది. అవితప్ప గత 20 ఏళ్లుగా మాచర్లలో ఇదీ మార్పు అని చెప్పలేని దుస్థితి ఉందని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img