icon icon icon
icon icon icon

జగన్‌ గులకరాయి డ్రామానూ జనం ఛీ కొట్టారు

సానుభూతి ఓట్లతో గెలవాలని జగన్‌ చూస్తున్నారని.. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చెప్పడంలో ఆయనకు ఎవరూ సాటిలేరని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

Published : 22 Apr 2024 06:53 IST

రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం..
ప్రతి ఒక్కరూ సంకల్పంతో సాగండి
బీఫాం తీసుకున్న ప్రతి ఒక్కరూ గెలిచి సభలో అడుగుపెట్టాలి
తెదేపా అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థులతో చంద్రబాబు
ఈనాడు - అమరావతి

సానుభూతి ఓట్లతో గెలవాలని జగన్‌ చూస్తున్నారని.. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చెప్పడంలో ఆయనకు ఎవరూ సాటిలేరని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘రాష్ట్రానికి తానేం చేశారో చెప్పలేక డ్రామాలాడుతున్నారు. పింఛన్ల విషయంలో కుట్రలు చేశారు. ఆయన ఆడిన గులకరాయి డ్రామానూ ప్రజలు ఛీకొట్టారు. ప్రజాగళం యాత్రకు వస్తున్న స్పందనే జగన్‌ పతనాన్ని చాటిచెబుతోంది’ అని పేర్కొన్నారు. తెదేపా పోటీ చేస్తున్న అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థులకు ఉండవల్లిలోని నివాసంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు బీఫాంలు అందించారు. బీఫాం తీసుకున్న ప్రతి అభ్యర్థీ గెలిచి అసెంబ్లీ, లోక్‌సభల్లో అడుగుపెట్టాలని ఆయన ఆకాంక్షించారు.

‘ఎన్నికలకు 21 రోజులే ఉంది.. అందులో ఈ ఇరవై రోజుల ప్రచారమే కీలకం. నేను ఇప్పటికి 40కి పైగా ప్రజాగళం సభలు నిర్వహించాను. పవన్‌ కల్యాణ్‌తో కలిసి ప్రచారంలో పాల్గొన్నాను. మనం రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ సంకల్పంతో ముందుకు వెళ్లండి. క్యాడర్‌తో ప్రతి అభ్యర్థి మమేకమవ్వాలి. అన్ని వర్గాల్లో జగన్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. రాష్ట్రంలో మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయని ప్రజలకు తెలియజేయండి’ అని చంద్రబాబు సూచించారు.

వాళ్లే కరెంటు తీయించి... నేను రాయి వేయించానని దుష్ప్రచారం

‘తండ్రి అధికారంలో ఉన్నప్పుడు జగన్‌ రూ.43 వేల కోట్లు అక్రమంగా సంపాదించారని సీబీఐ నిర్ధారిస్తే.. అక్రమ కేసులు పెట్టారని ప్రచారం చేసుకున్నారు. బస్సు యాత్రలో వాళ్లే కరెంటు తీయించి.. నేను రాయి వేయించానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఘటన జరిగిన కొద్ది క్షణాలకే ప్లకార్డులు పట్టుకుని వచ్చి ధర్నాలు చేశారు. రాయి విసిరిన వ్యక్తితో.. బొండా ఉమామహేశ్వరరావు ప్రమేయం ఉందని చెప్పించేలా కుట్రలు చేస్తున్నారు. పింఛన్ల పంపిణీకి నిధుల్లేకుండా చేసి.. వాలంటీర్లతో పంపిణీ చేయొద్దని చెప్పడంతో ఆగిపోయాయని విష ప్రచారం చేశారు’ అని చంద్రబాబు దుయ్యబట్టారు. జగనే అందరినీ అంతం చేయడానికి ప్రయత్నిస్తూ.. తనను అంతం చేయడానికి వస్తున్నారని ఎదుటివారిపై బురద జల్లుతున్నారని విమర్శించారు. ‘ప్రజలు, కార్యకర్తల అభీష్టం మేరకే అభ్యర్థుల్ని ఏకకాలంలో ఎంపిక చేశాం. ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలవాలనేదే మన నినాదం. తెదేపా, జనసేన, బీజేపీ నేతల మధ్య సమన్వయం ఉండాలి. ఓటు బదిలీ జరగాలి. వైకాపాలో సీటిస్తామన్నా తీసుకోకుండా బయటకు వచ్చారు. మంచివాళ్లను మాత్రమే తీసుకుని టికెట్లు ఇచ్చా. కొత్తగా చేరినవారు.. పార్టీ సిద్ధాంతాల ప్రకారమే నడుచుకోవాలి’ అని చంద్రబాబు అభ్యర్థులకు నిర్దేశించారు.

రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములవుతామని ప్రతిజ్ఞ

‘తెలుగుదేశం పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటాను. పార్టీకి విధేయతతో ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తాను. నాకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన తెలుగుదేశం పార్టీ సాక్షిగా నీతి, నిజాయతీలతో నిరాడంబరంగా ప్రజాసేవకు అంకితమవుతాను. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. నైతిక విలువలతో, కుల, మత వర్ణాలకు అతీతంగా సర్వ వర్గ సంక్షేమానికి, ఆదర్శ సమాజ స్థాపనకు కృషి చేస్తాను. ప్రజాతీర్పు ద్వారా నాకు సంక్రమించే పదవిని బాధ్యతాయుతంగా స్వీకరించి దేశ, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు కృషి చేస్తాను. ఎన్టీఆర్‌ ఆశయ సాధనకు పాటుపడుతూ.. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని పరిరక్షిస్తాను. విధ్వంసానికి గురైన రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వామినవుతా.  ప్రభుత్వ ఆస్తులకు, ప్రజల ధన, ప్రాణాలకు రక్షణగా నిలుస్తా. ప్రజాసంక్షేమం, రాష్ట్ర శ్రేయస్సు కోసం అవిశ్రాంతంగా, త్రికరణ శుద్ధిగా కృషి చేస్తానని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అని అభ్యర్థులతో చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img