icon icon icon
icon icon icon

Chandrababu: అధికారంలోకి రాగానే చెత్తపన్ను రద్దు చేస్తాం: చంద్రబాబు

ఉత్తరాంధ్రకు జగన్‌ ఏం చేశాడో చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

Published : 23 Apr 2024 20:24 IST

ఆమదాలవలస: ఉత్తరాంధ్రకు జగన్‌ ఏం చేశాడో చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. ‘‘స్థానిక ఎమ్మెల్యే అవినీతిపరుడు.. ఆమదాలవలసను పూర్తిగా ఊడ్చేశాడు. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా ఆ ఇంట్లో వారికి కానుకలు సమర్పించాలి. నాగావళి, వంశధార ఇసుక విశాఖపట్నం వెళ్తోంది. ఇలాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు. నా దృష్టిలో పడ్డవారిని నేనంత ఈజీగా వదిలిపెట్టను. రూ.10 ఇచ్చి వందరూపాయలు దోచుకునే వ్యక్తి జగన్‌. 

గుంటూరుకు చెందిన లక్ష్మి అనే మహిళ వైకాపా అరాచకాలను దేశం దృష్టికి తీసుకురావాలని దిల్లీ వెళ్లి బొటనవేలు కట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. జగన్‌ లాంటి వ్యక్తి సీఎంగా ఉంటే మహిళలకు రక్షణ ఉంటుందా?చిరంజీవి, రాజమౌళి లాంటి వారిని కూడా జగన్‌ అవమానించారు. జగన్‌ ఒక విధ్వంసకారి. రూ.13లక్షల కోట్లు అప్పు చేశారు. దేశంలో ఎక్కువ అప్పులు ఉండే రాష్ట్రం ఏపీనే. అప్పులు ఎక్కువ ఉన్న రైతులు కూడా మన రాష్ట్రంలోనే ఉన్నారు. మేం అధికారంలోకి రాగానే పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాం, పంటల బీమా అమలు చేస్తాం. ప్రతి ఎకరాకు నీరిస్తాం. వ్యవసాయ రంగంలో సాంకేతికతను తీసుకువస్తాం. అధికారంలోకి వచ్చిన వెంటనే చెత్తపన్ను రద్దు చేస్తాం’’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img