icon icon icon
icon icon icon

YS Sharmila: జగన్‌.. దేనికి సిద్ధం? మళ్లీ రూ.7లక్షల కోట్లు అప్పు చేయడానికా: షర్మిల

ఐదేళ్లలో ఒక్క జాబ్‌ క్యాలెండర్‌ కూడా ఇవ్వలేని జగన్‌.. మళ్లీ ప్రజల్ని మోసం చేయడానికి సిద్ధం అంటున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు.

Updated : 23 Apr 2024 19:53 IST

బాపట్ల: ఐదేళ్లలో ఒక్క జాబ్‌ క్యాలెండర్‌ కూడా ఇవ్వలేని జగన్‌.. మళ్లీ ప్రజల్ని మోసం చేయడానికి సిద్ధం అంటున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. ప్రజల అవసరాలు పట్టించుకోని వైకాపా ఎమ్మెల్యేలకు జనం ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. బాపట్ల జిల్లా కర్లపాలెంలో జరిగిన బహిరంగసభలో ఆమె ప్రసంగించారు. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ఇసుక మాఫియాగా మారారని,  ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. పేదల ఇళ్ల స్థలాలకు భూముల కొనుగోలు పేరిట భారీ దోపిడీ చేశారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే యువతకు ఉద్యోగాలు వచ్చేవని, హోదా పేరుతో జగన్‌ ఓట్లు వేయించుకున్నారే తప్ప దాని గురించి కేంద్రాన్ని ఒక్కసారి కూడా నిలదీయలేదని మండిపడ్డారు.

పులి పులి అని చెప్పుకొనే జగన్‌ .. పిల్లిలా మారి భాజపా కొంగు పట్టుకొని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. రైతుల సంక్షేమాన్ని ఏ మాత్రం పట్టించుకోని జగన్‌.. వైఎస్‌ వారసుడు ఎలా అవుతారని ప్రశ్నించారు. ఎన్నికల వేళ సిద్ధం అంటున్నారు దేనికి.. మళ్లీ రూ.7లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా? అని ప్రశ్నించారు. జగన్‌ స్వయంగా తయారు చేసిన మద్యం రాష్ట్రంలో అమ్ముతున్నారని, చిత్రవిచిత్రమైన పేర్లతో నాసిరకం మద్యాన్ని అమ్మి ప్రజల్ని చంపేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామన్న జగన్‌.. ఐదేళ్లలో ఒక్క జాబ్‌ క్యాలెండర్‌ కూడా ఎందుకు ఇవ్వలేకపోయారని నిలదీశారు. మెగా డీఎస్సీ నిర్వహిస్తామని, ఎన్నికలకు రెండు నెలల ముందు దగా  డీఎస్సీ వేశారని మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img