Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 07 Mar 2024 12:58 IST

1. TS High court: ఎమ్మెల్సీల నియామకంలో ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

ఎమ్మెల్సీల నియామకాలపై తెలంగాణ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్‌ కోదండరాం, ఆమిర్‌ అలీఖాన్‌లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ను ఉన్నత న్యాయస్థానం తాజాగా కొట్టివేసింది. పూర్తి కథనం

2. Atchannaidu: చిలకలూరిపేట సభలో ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన: అచ్చెన్నాయుడు

తెదేపా-జనసేన అభ్యర్థుల్ని ప్రకటించాక వైకాపా వణికిపోయిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Atchannaidu) అన్నారు. రాష్ట్రాన్ని జగన్‌ దారుణమైన పరిస్థితులకు తీసుకెళ్లారని విమర్శించారు. అమరావతిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ (Nadendla Manohar)తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్తి కథనం

3. MLC Kavitha: దిల్లీ లిక్కర్‌ కేసులో నేను బాధితురాలినే: ఎమ్మెల్సీ కవిత

దిల్లీ లిక్కర్‌ కేసును టీవీ సీరియల్‌ మాదిరిగా సాగదీస్తున్నారని భారాస (BRS) ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. ఆ కేసులో తాను బాధితురాలినేనని చెప్పారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆమె మాట్లాడారు. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడితే ఎదుర్కొంటానన్నారు. రాజకీయాల్లో సిద్ధాంతాలకు చోటు లేకుండా పోయిందని.. ఆదర్శ్‌ స్కామ్‌లో ప్రమేయం ఉన్న అశోక్‌ చవాన్‌కు రాజ్యసభ సీటు ఇచ్చారని భాజపాను ఉద్దేశించి విమర్శించారు. పూర్తి కథనం

4. Nara lokesh: హిందూపురంలో నారా లోకేశ్‌ శంఖారావం సభ

వైకాపా పాలనలో రాష్ట్రంలో 300 మంది బీసీలను హత్య చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. హిందూపురంలో నిర్వహించిన ‘తెదేపా శంఖారావం’ సభలో ఆయన మాట్లాడారు. రెండు నెలలు ఓపిక పట్టాలని.. బీసీలపై నమోదు చేసిన దొంగ కేసులు ఎత్తివేస్తామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీ వర్గాలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామన్నారు. పూర్తి కథనం

5. Hyderabad: మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడికి చెందిన కళాశాల భవనాలు కూల్చివేత

మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కళాశాలకు చెందిన భవనాలను అధికారులు కూల్చివేశారు. హైదరాబాద్‌ శివారు దుండిగల్‌లోని చిన్న దామరచెరువు ఎఫ్‌టీఎల్‌ బఫర్‌ జోన్‌లో రాజశేఖర్‌రెడ్డికి చెందిన ఏరోనాటికల్‌, ఎంఎల్‌ఆర్‌ఐటీఎం కళాశాలలకు సంబంధించిన రెండు శాశ్వత భవనాలు, 6 తాత్కాలిక షెడ్ల కూల్చివేతలు ప్రారంభించారు. పూర్తి కథనం

6. Dinesh Karthik: దినేశ్‌ కార్తిక్‌ రిటైర్మెంట్‌..? ఐపీఎల్‌ సీజన్‌తో ముగింపు..!

టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దినేశ్ కార్తిక్‌ (Dinesh Karthik) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌కు అతడు వీడ్కోలు పలకనున్నట్లు సమాచారం. మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్‌ 17వ సీజనే అతడికి చివరి లీగ్‌ టోర్నీ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీని తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌పై కార్తిక్‌ నిర్ణయం తీసుకోనున్నట్లు బీసీసీఐ వర్గాలు పీటీఐకి వెల్లడించాయి. పూర్తి కథనం

7. Medigadda Barrage: మేడిగడ్డను పరిశీలించిన ఎన్‌డీఎస్‌ఏ బృందం

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మూడు బ్యారేజీలను పరిశీలించేందుకు వచ్చిన నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) నిపుణుల బృందం రంగంలోకి దిగింది. బుధవారం రాత్రి హనుమకొండలో బస చేసిన అధికారుల బృందం గురువారం ఉదయాన్నే మేడిగడ్డ బ్యారేజీ వద్దకు వెళ్లింది. చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం మొదటగా ఎల్‌ అండ్‌ టీ గెస్ట్‌హౌస్‌లో అధికారులతో భేటీ అయ్యారు. పూర్తి కథనం

8. Elon Musk: ఓపెన్‌ఏఐని క్లోజ్డ్‌ఏఐగా మారిస్తే దావా వెనక్కి తీసుకుంటా: మస్క్‌

ప్రముఖ కృత్రిమ మేధ అంకురసంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI), బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ మధ్య నెలకొన్న వివాదం క్రమంగా ముదురుతోంది. తాజాగా కంపెనీ పేరును క్లోజ్డ్‌ఏఐగా మార్చాలని మస్క్‌ (Elon Musk) హితవు పలకడం గమనార్హం. అలా చేస్తే సంస్థపై తాను వేసిన దావాను వెనక్కి తీసుకుంటానని తెలిపారు. ఇకనైనా ఓపెన్‌ఏఐ అబద్ధాల్లో జీవించడం ఆపేయాలని పేర్కొన్నారు. పూర్తి కథనం

9. Google: గూగుల్‌ ఏఐ సీక్రెట్లు దోచి చైనాలో స్టార్టప్‌.. మాజీ ఇంజినీర్‌ అరెస్ట్‌

చైనా (China)కు చెందిన ఓ ఉద్యోగి గూగుల్‌ (Google)లో ఉద్యోగం చేస్తూనే.. తన స్వదేశంలోని కంపెనీతో రహస్యంగా పనిచేశాడు. అంతేనా.. గూగుల్‌ కృత్రిమ మేధ (Artificial Intelligence) సాంకేతికతను దొంగలించి.. వాటి సాయంతో చైనాలో ఏకంగా కంపెనీనే ప్రారంభించాడు. చివరకు అతడి నిర్వాకం బయటపడి పోలీసులకు చిక్కాడు. పూర్తి కథనం

10. Delhi: ఇంటి పని చేయాలని భార్యను కోరడం క్రూరత్వం కాదు: దిల్లీ హైకోర్టు

భార్యను ఇంటి పనులు చేయమని భర్త కోరడం క్రూరత్వం కాదని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. బాధ్యతలను పంచుకోవడమే వైవాహిక బంధమని పేర్కొంది. తల్లిదండ్రులను విడిచి భార్యతో ఉండలేనని ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం ఆ దంపతులకు విడాకులు మంజూరు చేసింది. వివరాల్లోకి వెళ్లితే.. పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని