Elon Musk: ఓపెన్‌ఏఐని క్లోజ్డ్‌ఏఐగా మారిస్తే దావా వెనక్కి తీసుకుంటా: మస్క్‌

Elon Musk: ఓపెన్‌ఏఐ పేరును క్లోజ్డ్‌ఏఐగా మార్చాలని బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ అన్నారు. దీంతో ఇరు పక్షాల మధ్య నెలకొన్న వివాదం మరింత ముదిరినట్లయింది.

Updated : 07 Mar 2024 11:58 IST

Elon Musk | ప్రముఖ కృత్రిమ మేధ అంకురసంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI), బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ మధ్య నెలకొన్న వివాదం క్రమంగా ముదురుతోంది. తాజాగా కంపెనీ పేరును క్లోజ్డ్‌ఏఐగా మార్చాలని మస్క్‌ (Elon Musk) హితవు పలకడం గమనార్హం. అలా చేస్తే సంస్థపై తాను వేసిన దావాను వెనక్కి తీసుకుంటానని తెలిపారు. ఇకనైనా ఓపెన్‌ఏఐ అబద్ధాల్లో జీవించడం ఆపేయాలని పేర్కొన్నారు. అలాగే ఆ కంపెనీ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ ‘క్లోజ్డ్‌ఏఐ’ ఐడీ కార్డును మెడలో ధరించినట్లుగా ఉన్న ఎడిట్‌ చేసిన ఫొటోను మస్క్ తన ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

ఓపెన్‌ఏఐని (OpenAI) ప్రజా సంక్షేమం కోసం లాభాలను ఆశించకూడదనే భావనతో ఏర్పాటు చేశామని మస్క్‌ (Elon Musk) ఇటీవల తెలిపారు. కానీ, ఆ కంపెనీ ఇప్పుడు.. మైక్రోసాఫ్ట్‌ కింద పూర్తిగా లాభాల కోసం పనిచేస్తోందని ఆరోపించారు. దీంతో తన లక్ష్యం విషయంలో రాజీ పడిందని, ఒప్పందాలను ఉల్లంఘించిందని పేర్కొంటూ శాన్‌ఫ్రాన్సిస్కో సుపీరియర్‌ కోర్టులో దావా వేశారు.

దీనిపై స్పందించిన ఓపెన్‌ఏఐ.. తమ కంపెనీని టెస్లాలో విలీనం చేయాలని మస్క్‌ (Elon Musk) ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపించింది. లేదంటే పూర్తి నియంత్రణను ఆయన చేతికి ఇవ్వమన్నారని పేర్కొంది. 2017లో లాభాపేక్ష సంస్థనే ఏర్పాటు చేయాలనుకున్నామని.. కానీ, బోర్డు నియంత్రణ, సీఈఓ పదవి తనకు కావాలని మస్క్‌ డిమాండ్‌ చేసినట్లు చెప్పింది. కానీ, తమ కంపెనీ వీటికి అంగీకరించలేదని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఆయన సంస్థ నుంచి వైదొలగారని చెప్పింది. వీటికి సంబంధించిన కొన్ని ఈమెయిళ్లను కంపెనీ బహిర్గతం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఎలాన్‌ మస్క్‌ కంపెనీ పేరును క్లోజ్డ్‌ఏఐగా మార్చాలని ఎద్దేవా చేస్తూ పోస్ట్‌ పెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని