Dinesh Karthik: దినేశ్‌ కార్తిక్‌ రిటైర్మెంట్‌..? ఐపీఎల్‌ సీజన్‌తో ముగింపు..!

Dinesh Karthik: టీమిండియా ఆటగాడు దినేశ్ కార్తిక్‌ ఐపీఎల్‌ కెరీర్‌ను ముగించనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌కు కూడా త్వరలోనే వీడ్కోలు పలకనున్నట్లు సమాచారం.

Updated : 07 Mar 2024 12:25 IST

ధర్మశాల: టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దినేశ్ కార్తిక్‌ (Dinesh Karthik) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌కు అతడు వీడ్కోలు పలకనున్నట్లు సమాచారం. మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్‌ 17వ సీజనే అతడికి చివరి లీగ్‌ టోర్నీ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీని తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌పై కార్తిక్‌ నిర్ణయం తీసుకోనున్నట్లు బీసీసీఐ వర్గాలు పీటీఐకి వెల్లడించాయి.

ఐపీఎల్‌లో అత్యంత అనుభవజ్ఞుడైన వికెట్‌ కీపర్‌ బ్యాటర్లలో డీకే ఒకడు. 2008 నాటి తొలి ఎడిషన్‌ నుంచి అన్ని సీజన్లలో ఆడాడు. ఈ లీగ్‌ టోర్నీలో ఇప్పటివరకు ఆరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2008లో నాటి దిల్లీ డేర్‌డెవిల్స్‌ (ఇప్పుడు దిల్లీ క్యాపిటల్స్‌)తో ఐపీఎల్‌ కెరీర్‌ ఆరంభించాడు. ఆ తర్వాత కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, ముంబయి ఇండియన్స్‌, గుజరాత్‌ లయన్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్లకు ఆడాడు. ప్రస్తుతం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 16 సీజన్లలో ఇప్పటి వరకు 242 మ్యాచ్‌లు ఆడిన కార్తిక్‌.. 4516 పరుగులు చేశాడు. ఇందులో 20 అర్ధశతకాలు ఉన్నాయి. కీపర్‌గా 141 క్యాచ్‌లు పట్టుకున్నాడు. 36 స్టంప్‌ ఔట్లు చేశాడు.

బిగ్‌బాస్‌ విన్నర్ చేతిలో సచిన్‌ ఔట్‌.. వీడియో వైరల్‌

2022లో జరిగిన టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో ఆడాడు. అయితే, అందులో పెద్దగా రాణించలేదు. ఆ తర్వాత నుంచి జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న డీకే.. అంతర్జాతీయ మ్యాచ్‌లకు వ్యాఖ్యాతగా మారాడు. 2004లో సుదీర్ఘ ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన అతడు.. 26 టెస్టులు ఆడాడు. 1025 పరుగులు చేసి.. 57 క్యాచ్‌లు, ఆరు స్టంపింగ్‌లు తన ఖాతాలో వేసుకున్నాడు. చివరిసారిగా 2018లో టెస్టు మ్యాచ్‌ ఆడాడు. వన్డేల్లో 94 మ్యాచ్‌లు ఆడిన డీకే.. 1752 పరుగులు సాధించాడు. కీపర్‌గా 64 క్యాచ్‌లు పట్టుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని