Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు...

Updated : 06 Feb 2023 17:08 IST

1. రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ

ఏపీ రాజధాని అమరావతిపై దాఖలైన పిటిషన్ల విచారణ అంశం సుప్రీంకోర్టులో ప్రస్తావనకు వచ్చింది. పిటిషన్లను త్వరితగతిన విచారించాలని జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌, జస్టిస్‌ నాగరత్న ధర్మాసనం వద్ద రాష్ట్ర ప్రభుత్వ తరఫున సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి ప్రస్తావించారు. దీనిపై అమరావతి ప్రాంత రైతులు, ఇతర ప్రతివాదుల తరఫు న్యాయవాదులు స్పందిస్తూ ఈ కేసులో తమకు న్యాయస్థానం ఇచ్చిన నోటీసులు జనవరి 27న అందాయని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. తెలంగాణ బడ్జెట్‌లో శాఖల వారీ కేటాయింపులు.. ముఖ్యాంశాలివీ..

ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందుతోందని ఆర్థికమంత్రి హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. శాసనసభలో రాష్ట్ర బడ్జెట్‌ (Telangana Budget)ను మంత్రి ప్రవేశపెట్టారు. రూ.2,90,396కోట్లతో పద్దును సభ ముందుకు తీసుకొచ్చారు. రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు, మూలధన వ్యయం రూ.37,525 కోట్లుగా పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. బోర్డర్‌ - గావస్కర్‌ ట్రోఫీ.. గెలిచేది ఆ జట్టే: మహేల జయవర్దనే

భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభంకానున్న బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో ఏ జట్టు విజయం సాధిస్తుందనే దానిపై శ్రీలంక మాజీ బ్యాటర్‌ మహేల జయవర్దనే తన అంచనాను వెల్లడించాడు. రెండు పటిష్టమైన జట్లే అని పేర్కొంటూ సిరీస్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. భలే మంచి చౌక బేరమూ: రికార్డు స్థాయిలో దేశంలోకి రష్యా క్రూడాయిల్‌!

రష్యా (Russia) నుంచి మన దేశానికి క్రూడాయిల్‌ దిగుమతులు (Imports) అంతకంతకూ పెరుగుతున్నాయి. తక్కువ ధరకే లభిస్తుండడంతో భారత్‌ భారీ స్థాయిలో ముడి చమురును (Crude Oil) కొనుగోలు చేస్తోంది. కొన్ని నెలలుగా ఈ పరిస్థితి కొనసాగుతుండగా.. జనవరి నెలలో ఎప్పుడూ లేని స్థాయికి చేరింది. ఒకప్పుడు ఒక శాతం కూడా లేని దిగుమతులు ఇప్పుడు ఏకంగా 28 శాతానికి చేరినట్లు ఎనర్జీ కార్గో ట్రాకకర్‌ వొర్టెక్సా వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పీసీలకు తగ్గిన గిరాకీ.. డెల్‌లో 6600 ఉద్యోగాల కోత

కరోనా సంక్షోభ సమయంలో ఉద్యోగులంతా ‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’ చేశారు. అలాగే విద్యార్థులు ఇంట్లో ఉండే ఆన్‌లైన్‌లో పాఠాలు విన్నారు. దీంతో పర్సనల్‌ కంప్యూటర్ల (PC)కు గిరాకీ భారీగా పెరిగింది. అందుకు అనుగుణంగానే పీసీ తయారీ కంపెనీలు ఉత్పత్తిని పెంచాయి. భారీ ఎత్తున ఉద్యోగులను నియమించుకున్నాయి. కానీ, కరోనా సంక్షోభం ముగియడంతో పరిస్థితులు పూర్తిగా తలకిందులయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. సానియా మీర్జా నాకు స్ఫూర్తి.. ఆనంద్‌ మహీంద్రా మోటివేషనల్ పోస్ట్‌

సామాజిక మాధ్యమాల్లో ఎంతో చురుగ్గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra).. వారాన్ని ఉత్సాహంగా మొదలుపెట్టేందుకు ప్రతి సోమవారం స్ఫూర్తిదాయక సందేశాలను పంచుకుంటారు. ఈ రోజు కూడా ఆయన ఓ మండే మోటివేషన్‌ (Monday motivation) షేర్‌ చేశారు. మరి ఈరోజు ఆయన ప్రేరణ పొందింది ఎవరి నుంచో తెలుసా? మన టెన్నిస్ స్టార్‌ సానియా మీర్జా (Sania Mirza) నుంచే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘అదానీ’ అంశంపై చర్చకు పట్టు‌.. వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా

హిండెన్‌బర్గ్‌ సంస్థ నివేదిక, అదానీ (Adani Group) కంపెనీల షేర్ల భారీ పతనం అంశాలపై చర్చ జరపాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టడంతో వరుసగా మూడో రోజు పార్లమెంట్‌ (Parliament) స్తంభించింది. ప్రతిపక్షాల ఆందోళనలతో ఎలాంటి చర్చ జరగకుండానే మరో రోజుకు వాయిదా పడింది. సోమవారం ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కాగానే ఈ అంశాలపై చర్చించాలంటూ ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నిరుద్యోగ సమస్యకు కారణమదే.. ఉద్యోగాల కోసం వెంపర్లాడొద్దు: మోహన్‌ భాగవత్‌

దేశంలో నిరుద్యోగ సమస్యపై రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని రకాల వృత్తులను గౌరవించలేకపోవడమే నిరుద్యోగానికి కారణమని చెప్పారు. అన్ని రకాల వృత్తులను, పనులను గౌరవించాలన్నారు. ఉద్యోగాల కోసం వెంపర్లాడొద్దని యువతకు సూచించారు. ఆదివారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. తుర్కియే, సిరియాలో భూకంప విలయం.. 1600 దాటిన మృతులు

ప్రకృతి ప్రకోపానికి తుర్కియే, సిరియా దేశాలు అల్లకల్లోలమయ్యాయి. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో సోమవారం తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం పెను విలయం సృష్టించింది. భూకంప తీవ్రతకు వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. అనేక నగరాలు మరుభూమిని తలపిస్తున్నాయి. భూకంప ధాటికి ఇప్పటివరకు రెండు దేశాల్లో 1600 మందికి పైగా దుర్మరణం చెందగా.. వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. కేవీల్లో ఉద్యోగాలకు పరీక్ష రేపట్నుంచే.. అడ్మిట్‌ కార్డులు పొందండిలా..

దేశంలోని కేంద్రీయ విద్యాలయాల్లో(Kendriya Vidyalaya) భారీగా టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌  నిర్వహించే పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తంగా 13,404 పోస్టులకు భర్తీకి దశల వారీగా మార్చి 6వరకు పరీక్షలు జరగనుండగా.. ఈ నెల 7న అసిస్టెంట్‌ కమిషనర్‌, 8న ప్రిన్సిపల్‌, 9న వైస్‌ ప్రిన్సిపల్‌ & పీఆర్‌టీ (మ్యూజిక్‌) పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని