Russia Oil: భలే మంచి చౌక బేరమూ: రికార్డు స్థాయిలో దేశంలోకి రష్యా క్రూడాయిల్‌!

Russina Oil Imports to India: రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు రికార్డు స్థాయికి చేరాయి. జనవరి నెలలో మన దేశ దిగుమతుల్లో ఆ దేశం వాటా 28 శాతానికి చేరింది.

Published : 06 Feb 2023 15:35 IST

బెంగళూరు: రష్యా (Russia) నుంచి మన దేశానికి క్రూడాయిల్‌ దిగుమతులు (Imports) అంతకంతకూ పెరుగుతున్నాయి. తక్కువ ధరకే లభిస్తుండడంతో భారత్‌ భారీ స్థాయిలో ముడి చమురును (Crude Oil) కొనుగోలు చేస్తోంది. కొన్ని నెలలుగా ఈ పరిస్థితి కొనసాగుతుండగా.. జనవరి నెలలో ఎప్పుడూ లేని స్థాయికి చేరింది. ఒకప్పుడు ఒక శాతం కూడా లేని దిగుమతులు ఇప్పుడు ఏకంగా 28 శాతానికి చేరినట్లు ఎనర్జీ కార్గో ట్రాకకర్‌ వొర్టెక్సా వెల్లడించింది.

ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు ముందు రష్యా నుంచి మన క్రూడాయిల్ దిగుమతులు కేవలం 0.2 శాతం మాత్రమే. ఉక్రెయిన్‌పై దాడి తర్వాత పశ్చిమ దేశాలు ఆ దేశంపై ఆంక్షలు విధించాయి. దీంతో ఆదాయం కోసం ముడి చమురును డిస్కౌంట్‌ ధరకే ఆ దేశం అందిస్తోంది. దీంతో చైనా, భారత్‌ ఆ దేశం నుంచి తక్కువ ధరకే క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే జనవరిలో రష్యా ముడి చమురు వాటా 28 శాతానికి చేరింది. డిసెంబర్‌లో ఈ వాటా 26 శాతంగా ఉంది. రష్యా తర్వాత ఇరాక్‌ (20 శాతం), సౌదీ అరేబియా (17 శాతం), అమెరికా (9 శాతం), యూఏఈ (8 శాతం) అత్యధికంగా మన దేశానికి క్రూడాయిల్‌ను ఎగుమతి చేస్తున్నాయి.

దేశీయ అవసరాలు తీర్చుకోవడానికి ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ముడి చమురును దిగుమతి చేసుకోవడానికి భారత్‌ సిద్ధంగా ఉందని ఇండియా ఎనర్జీ వీక్‌ (IEW) కార్యక్రమానికి హాజరైన అధికారులు తెలిపారు. ఇరాన్‌, వెనుజువెలా మినహాస్తే రష్యా ఆయిల్‌ను దిగుమతి చేసుకునే విషయంలో భారత్‌పై ఎలాంటి ఆంక్షలూ లేవని పేర్కొన్నారు. మరోవైపు రష్యా ఆయిల్‌పై బ్యారెల్‌కు 60 డాలర్ల పరిమితిని జీ7 దేశాలు విధించగా.. భారత్‌ అంతకంటే తక్కువకే కొనుగోలు చేస్తోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. రష్యా ఆయిల్‌ను చైనా, భారత్‌ ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని