Updated : 14 Aug 2022 17:12 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. వీడని ముసురు.. తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా చిరు జల్లులు పడుతుండటంతో వివిధ పనుల కోసం బయటకు వచ్చిన ప్రజలు తడిసి ముద్దవుతున్నారు. రానున్న మూడు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతోపాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్న తెలిపారు.

2. సమస్యలపై మునుగోడులో చర్చ జరగాలి.. వ్యక్తిగత దూషణలు వద్దు: రేవంత్‌

మునుగోడు ఉప ఎన్నికపై కాకుండా వ్యక్తిగత విమర్శలపై దృష్టి మళ్లుతుండడంతో ఆ నియోజక వర్గ ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, నిత్యావసర ధరల పెరుగుదల వల్ల పేదలపై పడుతున్న భారం మీద చర్చ జరగాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్ ధరలు పెంచి పేదలపై భారం మోపారని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.


Video: కోర్టు ఆవరణలోనే భార్య గొంతు కోసిన భర్త


3. విశాఖలో అగ్నివీరుల ఎంపిక ప్రారంభం.. తరలివచ్చిన అభ్యర్థులు

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అగ్నివీర్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ విశాఖలో ఆదివారం ఉదయం నుంచి మొదలైంది. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ ర్యాలీకి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇవాళ్టి నుంచి ఈనెల 31 వరకు ర్యాలీ కొనసాగనుంది. స్టేడియంలో 24 గంటల పాటు విద్యుత్‌, నీటి సరఫరా సదుపాయం కల్పించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. రన్నింగ్‌ ట్రాక్‌పై నీరు, బురద లేకుండా పటిష్ఠమైన ఏర్పాట్లు చేశారు.

4. ఏ చట్టం ప్రకారం మంత్రి కాల్పులు జరిపారు?: రఘునందన్‌

తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు డిమాండ్‌ చేశారు. ఏ చట్టం ప్రకారం మహబూబ్‌నగర్‌లో మంత్రి కాల్పులు జరిపారని నిలదీశారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రఘునందన్‌ మాట్లాడారు. పర్సనల్‌ సెక్యూరిటీ నుంచి తుపాకీ తీసి కాల్చడమేంటని రఘునందన్‌ ప్రశ్నించారు.

5. బుమ్రా అసాధారణ బౌలింగ్‌ యాక్షన్‌ వల్లే ఎక్కువగా గాయాలు

గాయం కారణంగా ఆసియా కప్‌నకు టీమ్‌ఇండియా కీలక బౌలర్‌ జస్ప్రీత్ బుమ్రా దూరమైన సంగతి తెలిసిందే. ఇటీవల విండీస్‌తో టీ20 సిరీస్‌కూ విశ్రాంతి తీసుకున్నాడు. ఇంకో రెండు నెలల్లో కీలకమైన పొట్టి ప్రపంచకప్‌ ఉంది. గాయం వల్ల మెగా టోర్నీకి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే అభిమానులు మాత్రం బుమ్రా  కోలుకుని జట్టులోకి రావాలని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు ఆకాశ్‌ చోప్రా మాత్రం బుమ్రా గాయపడటానికి తన బౌలింగ్‌ యాక్షనే కారణమని చెబుతున్నాడు.


Video: దేశ సరిహద్దులు దాటిన నెల్లూరు మలైకాజా ఖ్యాతి


6. దిగ్గజ ఇన్వెస్టర్‌.. ఝున్‌ఝున్‌వాలా చెప్పిన విజయసూత్రాలివే!

ప్రముఖ వ్యాపారవేత్త, స్టాక్‌మార్కెట్‌ దిగ్గజం రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ప్రారంభంలో రూ.5వేలతో వ్యాపారం మొదలుపెట్టిన ఆయన.. ప్రస్తుతం రూ.40వేల కోట్ల సంపదను సమకూర్చుకున్నారు. అందుకే స్టాక్‌ మార్కెట్లో మదుపుచేసే వారికి, కలల్ని నిజం చేసుకోవాలనుకునే వారికి ఆయన ఆదర్శంగా నిలిచారు.

7. ఆర్థిక సంక్షోభం అంచున బంగ్లాదేశ్‌..!

భారత్‌ చుట్టుపక్కల దేశాలు ఆర్థిక సంక్షోభం అంచులకు చేరుకొంటున్నాయి. ఇటీవల శ్రీలంక దివాలా తీయగా.. పాకిస్థాన్‌ దివాలా అంచుకు చేరింది. మరో పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌ కూడా అంతర్జాతీయ ద్రవ్యనిధి వద్దకు బెయిల్‌ఔట్‌ ప్యాకేజీ కోసం వెళ్లింది. రానున్న మూడేళ్లలో 4.5 బిలియన్ డాలర్లు ఇవ్వాలని కోరింది. మరోవైపు బంగ్లాదేశ్‌ పాలకులు మాత్రం ఆర్థికంగా దేశానికి ఎటువంటి ఇబ్బంది లేదని చెబుతున్నారు.

8. ఝున్‌ఝున్‌వాలాను నిలబెట్టిన స్టాక్స్‌ ఇవే..

భారత్‌లో స్టాక్‌ మార్కెట్‌లోకి ప్రవేశించాలనుకునే ప్రతి ఔత్సాహిక మదుపరి రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా (Rakesh Jhunjhunwala) గురించి తెలుసుకోకుండా ఉండరు. ఒకసారి తెలుసుకున్న తర్వాత ఆయనలా సంపాదించాలని కలలు కనకా మానరు. బహుశా.. ఈక్విటీల్లోకి ఎంటర్‌ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరూ.. ఆయన వ్యూహాలు, పెట్టుబడుల తీరుపై కంప్యూటర్లలో వెతక్కుండా ఉండరంటే అతిశయోక్తి కాదు.


Video: ఇటలీలో.. రికార్డు స్థాయిలో కరవు!


9. కోచ్‌కు కూడా విశ్రాంతి.. భారత్‌ రొటేషన్ సూపర్‌: పాక్‌ మాజీ కెప్టెన్‌

ఆటగాళ్లను వివిధ స్థానాల్లో ఆడిస్తూ టీమ్‌ఇండియా చేస్తున్న రొటేషన్‌ పద్ధతి చాలా బాగుందని పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ సల్మాన్‌ భట్‌ కొనియాడాడు. సీనియర్‌ ఆటగాళ్లకు విశ్రాంతినిస్తూ యువకులకు మరిన్ని అవకాశాలు కల్పించడం మంచి విషయమని పేర్కొన్నాడు. భారత క్రికెట్‌ జట్టు యాజమాన్యం చేపడుతున్న రొటేషన్‌ పాలసీ వల్ల రిజర్వ్‌ బెంచ్‌ బలోపేతమవుతుందని తెలిపాడు.

10. డియర్‌ మెగా ఫ్యాన్స్‌.. వైజయంతి మూవీస్‌ ట్వీట్‌

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) అభిమానుల్ని ఉద్దేశిస్తూ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ (Vyjayanthi Movies) ట్వీట్‌ చేసింది. నేటి టెక్నాలజీకి అనుగుణంగా ‘ఇంద్ర’ని (Indra) తీర్చిదిద్ది గ్రాండ్‌ లెవల్‌లో మళ్లీ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ‘‘డియర్‌ మెగా ఫ్యాన్స్‌.. ‘ఇంద్ర’ను 4కె వెర్షన్‌లో మీ ముందుకు తీసుకురానున్నాం. అయితే అది ఇప్పుడే కాదు. దానికి కాస్త సమయం పడుతుంది. ఆరోజు కోసం మీరే కాదు మేము కూడా ఎదురుచూస్తున్నాం’ అని పేర్కొంది.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని