Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 22 Jan 2023 17:10 IST

1. దేశంలోని బొగ్గుగని కార్మికులందర్నీ ఏకం చేయాలి: ఎమ్మెల్సీ కవిత

సింగరేణిలో డిపెండెంట్‌ ఉద్యోగాలు ఇస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటిస్తే కొందరు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కోల్‌ ఇండియా కంటే సింగరేణిలోనే వేతనాలు అధికమని వివరించారు. భూపాలపల్లిలో మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి ఎమ్మెల్సీ కవిత ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆచార్య జయశంకర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలో భారాస, జాగృతి కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మావి గొంతెమ్మ కోర్కెలు కాదు.. బకాయిలనే అడుగుతున్నాం: బొప్పరాజు వెంకటేశ్వర్లు

ఫిబ్రవరి 5 తర్వాత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. కర్నూలులో నిర్వహించనున్న ఏపీ జేఏసీ అమరావతి మూడో రాష్ట్ర మహా సభల సన్నాహక సమావేశంలో భాగంగా అనంతపురంలో నిర్వహించిన భేటీలో ఆయన పాల్గొన్నారు. తాము గొంతెమ్మ కోరికలు కోరడం లేదని..  తమకు రావాల్సిన బకాయిలనే గౌరవంగా అడుగుతున్నామని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఇప్పుడు మూడో ర్యాంక్‌.. చివరి వన్డేలోనూ గెలిస్తే.. టీమ్‌ఇండియానే నంబర్‌వన్‌..!

న్యూజిలాండ్‌ మీద వరుసగా రెండు వన్డేలు గెలిచిన టీమ్‌ఇండియా ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ దూసుకుపోతోంది. సిరీస్‌ను కోల్పోయిన కివీస్‌ వన్డేల్లో రెండో స్థానానికి పడిపోయింది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత్‌ మూడో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ (113) అగ్రస్థానంలో ఉంది. కివీస్‌, భారత్‌ కూడా 113 పాయింట్లతో సంయుక్తంగా ఉన్నప్పటికీ  కొద్దిపాటి తేడాతో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. 2028 వరకు కీలక వ్యాపారాల విభజన: అదానీ గ్రూప్‌

భారత కుబేరుడు గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్‌ నిర్వహణలో అనేక వ్యాపారాలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికీ కొన్ని ప్రధాన సంస్థ అయిన ‘అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌’ కిందే కొనసాగుతున్నాయి. వాటిలో హైడ్రోజన్‌, విమానాశ్రయాలు, డేటా సెంటర్ల వ్యాపారాలు ప్రధానమైనవి. వీటిని 2025- 2028 మధ్య ప్రత్యేక సంస్థలుగా ఏర్పాటు చేస్తామని ‘చీఫ్‌ ఫైనాన్షియల్‌ అధికారి’ జుగేషిందర్‌ సింగ్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. భాజపాకు ఓటమి తప్పదు: అఖిలేశ్‌ యాదవ్‌

వచ్చే ఏడాది (2024) జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై దృష్టిపెట్టిన రాజకీయ పార్టీలు ఇప్పటినుంచే తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా భాజపాను ఓడించేందుకు ప్రయత్నిస్తోన్న విపక్ష పార్టీలు.. ఆ పార్టీ పాలనపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో 80 పార్లమెంట్‌ స్థానాల్లో భాజపా ఓటమి చవిచూడవచ్చని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. షారుక్‌ రాత్రి 2గంటలకు ఫోన్‌ చేశారు: సీఎం హిమంత

బాలీవుడ్ నటుడు షారుక్‌ ఖాన్‌ రాత్రి 2గంటల సమయంలో తనకు ఫోన్‌ చేసినట్టు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు. పఠాన్‌ చిత్రానికి వ్యతిరేకంగా గువాహటిలో చెలరేగిన నిరసనలపై ఆయన ఆందోళన వ్యక్తంచేశారని వెల్లడించారు. షారుక్‌-దీపికా పదుకొణె నటిచిన ‘పఠాన్‌’ను ప్రదర్శించొద్దంటూ చేపడుతున్న నిరసనలపై దర్యాప్తు చేస్తామని.. అలాంటి హింసాత్మక ఘటనల్ని పునరావృతం కానివ్వబోమని తాను హామీ ఇచ్చినట్టు సీఎం ట్విటర్‌లో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. శ్రద్ధావాకర్‌ హత్య కేసులో 3,000 పేజీల ఛార్జిషీట్‌..!

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్‌ హత్యకేసులో విచారణ కొలిక్కి వస్తోంది. పోలీసులు ఇప్పటికే కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 3,000 పేజీల డ్రాఫ్ట్‌ ఛార్జిషీట్‌ను సిద్ధం చేశారు. ఫోరెన్సిక్‌, ఎలక్ట్రానిక్‌ ఆధారాలు, 100 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు. వీటి ఆధారంగా తుది ఛార్జిషీట్‌కు ఓ రూపు ఇవ్వనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అమెరికా మాంటేరీ పార్క్‌లో కాల్పులు.. 10 మంది మృతి!

అమెరికా(USA)లో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. లాస్‌ఏంజెల్స్‌(los angeles) సమీపంలోని మాంటేరీ పార్క్‌(Monterey Park)లో శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఓ వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. చైనీయుల లూనార్‌ న్యూఇయర్‌ ఫెస్టివల్‌ వేడుకలో ఈ ఘటన జరిగింది. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం 10 మందికిపైగా ఈ ఘటనలో మరణించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అతడు బ్యాటింగ్‌తోనూ వికెట్లు తీస్తాడు.. అందుకే ఆ షాట్‌ ఇష్టం లేదు: సచిన్‌

క్రికెట్‌ పుస్తకంలోని అన్ని రకాల షాట్లను అలవోకగా కొట్టిన క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌. ఎన్నో రికార్డులను సొంతం చేసుకొన్న క్రికెట్ దేవుడు. అయితే అతడికి కూడా ఓ షాట్‌ అంటే మాత్రం ఇష్టం లేదట. దానికి కారణం అలాంటి షాట్‌కు సచిన్‌ రనౌట్‌ కావడమే. అదేంటి మైదానం నలువైపులా కొట్టే సచిన్‌ను కూడా భయపెట్టేలా షాట్ ఆడిన ఆ బ్యాటర్‌ ఎవరో తెలుసుకోవాలనుందా? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. జో బైడెన్‌ మెడకు చుట్టుకొంటున్న రహస్యపత్రాల గొడవ..!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌(Joe Biden)కు ఓ ల్యాప్‌టాప్‌ పెను సమస్యగా మారింది. ఆయన కుమారుడు హంటర్‌ బైడెన్‌ వినియోగించిన ఈ ల్యాప్‌టాప్‌లో సమాచారం విశ్లేషించే కొద్దీ బిత్తరపోయే వాస్తవాలు వెలువడుతున్నాయి. తన వద్ద రహస్య పత్రాలు అత్యంత సురక్షితంగా ఓ సీల్డ్‌ డబ్బాలో ఉన్నాయని బైడెన్‌ ఇటీవల సెలవిచ్చారు. ఆయన ప్రకటన వెలువడిన దాదాపు వారంలోనే న్యూయార్క్‌ పోస్టు పత్రిక సంచలన కథనం వెలువరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని