Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 29 Sep 2022 17:07 IST

1. భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో హెచ్చరికలు

తెలంగాణలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నల్గొండ, సూర్యపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసింది. కొమురుం భీం-ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, వరంగల్‌, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, కామారెడ్డి, మహబూబ్ నగర్‌ తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. మోటార్లకు మీటర్లు బిగిస్తాం.. రాయితీ మొత్తం రైతు ఖాతాలో వేస్తాం: మంత్రి పెద్దిరెడ్డి

వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అందించటమే ప్రభుత్వ లక్ష్యమని విద్యుత్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. 2023 మార్చి నాటికి 100 శాతం వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇప్పటివరకు 41వేల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చామన్నారు. త్వరలోనే మరో 77వేల కనెక్షన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. విద్యుత్‌ రాయితీ మొత్తాన్ని నేరుగా రైతు ఖాతాకే ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. కృష్ణంరాజు స్మృతివనం ఏర్పాటుకు రెండెకరాల స్థలం: మంత్రి కారుమూరు

ప్రముఖ సినీనటుడు కృష్ణంరాజు మరణంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారని ఏపీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు అన్నారు. ఆయన పేరిట స్మృతివనం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రెండెకరాల స్థలాన్ని కేటాయిస్తుందని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులోని కృష్ణంరాజు స్వగృహంలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు మంత్రులు రోజా, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ప్రసాదరాజుతో కలిసి కారుమూరి హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. దిల్లీలో ప్రశంసలు.. గల్లీలో విమర్శలు: మంత్రి హరీశ్‌ ఎద్దేవా

తెలంగాణ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను దిల్లీలో ప్రశంసిస్తూ గల్లీలో విమర్శలు చేస్తున్న కేంద్రమంత్రులు.. దమ్ముంటే రాష్ట్రానికి నిధులిచ్చి వాటా గురించి మాట్లాడాలని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఓ వైపు అవార్డులు ఇస్తూనే మరోవైపు ప్రభుత్వ పనితీరు బాగోలేదంటూ రాజకీయ విమర్శలు చేస్తున్నారని భాజపా నేతలను ఉద్దేశించి మండిపడ్డారు. మరో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. డీమ్యాట్‌, క్రెడిట్‌కార్డు యూజర్లకు అలర్ట్‌.. 1 నుంచి కొత్త రూల్స్‌!

క్రెడిట్‌కార్డు, డెబిట్‌ కార్డు వాడకం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. స్టాక్‌ మార్కెట్‌పై కాస్త అవగాహన ఉన్నవాళ్లు డీమ్యాట్‌ ఖాతా తీసుకుంటున్నారు. అయితే, వీటిని వాడడం ఎంత ముఖ్యమో.. వాటిలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను తెలుసుకోవడమూ అంతే ముఖ్యం. వీటిలో సెప్టెంబర్‌ 30తో గడువు పూర్తయ్యేవి కొన్ని కాగా.. అక్టోబర్‌ 1 నుంచి వస్తున్న మార్పులు కొన్ని ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి


రివ్యూ: నేనే వస్తున్నా


6. రాజస్థాన్‌ ఎఫెక్ట్‌.. అధ్యక్ష రేసునుంచి వైదొలగిన గహ్లోత్‌

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ పోటీపై స్పష్టత వచ్చింది. తాను పోటీ నుంచి విరమించుకుంటున్నట్టు గురువారం ఆయనే స్వయంగా వెల్లడించారు. పార్టీ అధినేతగా ఎన్నికైనా, ఆయన ముఖ్యమంత్రి పదవిని వీడాలనుకోకపోవడంతో రాజస్థాన్‌లో రాజకీయంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అనంతరం.. ఆయన రేసు నుంచి బయటకు వచ్చారు.అలాగే ఎమ్మెల్యే తిరుగుబాటు నేపథ్యంలో సోనియాకు క్షమాపణలు తెలియజేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. భారత్‌ అభిమానులకు షాకింగ్‌ న్యూస్‌.. ప్రపంచకప్‌ నుంచి బుమ్రా ఔట్‌!

టీ20 ప్రపంచకప్‌ సమీస్తున్న వేళ.. టీమ్‌ఇండియాకు భారీ షాక్‌ తగిలేలా ఉంది. కీలక బౌలర్‌ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వెన్ను నొప్పి వస్తోందని దక్షిణాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్‌కు ముందు బుమ్రా చెప్పడంతో బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. అయితే ఈ సిరీస్‌లోని మిగతా మ్యాచ్‌లతోపాటు టీ20 ప్రపంచకప్‌నకూ అందుబాటులో ఉండకపోవచ్చని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. గీత దాటితే కఠిన శిక్షే.. ఆందోళనకారులకు అధ్యక్షుడి హెచ్చరిక

హిజాబ్‌కు వ్యతిరేకంగా మహిళలు చేస్తోన్న ఆందోళనలు, అల్లర్లతో ఇరాన్‌ (Iran Protests) అట్టుడుకుతోంది. భద్రతా దళాల చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ.. నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాల్సిందేనంటూ ఇరాన్‌ మహిళలు పిడికిలి బిగిస్తూ నిరసనలు మరింత ఉద్ధృతం చేస్తున్నారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని ప్రభుత్వం.. నిరసనకారులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. వాట్సాప్‌లో బగ్‌.. యాప్‌ను అప్‌డేట్ చేశారా?

ప్రపంచవ్యాప్తంగా మెసేజింగ్‌ కోసం ఎక్కువ మంది ఉపయోగించేది వాట్సాప్‌ యాప్‌. కేవలం మెసేజింగ్‌ మాత్రమే కాదు, వాయిస్‌/వీడియో కాలింగ్‌, ఫైల్‌ షేరింగ్‌, పేమెంట్ ఇలా ఎన్నో రకాల అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు ఈ యాప్‌లో ఉన్నాయి. తాజాగా వాట్సాప్‌ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన చేసింది. ఈ యాప్‌లో సెక్యూరిటీ లోపం ఉందని తెలిపింది. ఈ బగ్‌ కారణంగా సైబర్‌ నేరగాళ్లు సులువుగా వాట్సాప్‌ను హ్యాక్‌ చేసి యూజర్‌ డేటాను దొంగలించే అవకాశం ఉందని హెచ్చిరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. కాంబినేషన్‌ కుదిరింది.. పంత్‌కు అవకాశం కష్టమే!: భారత మాజీ సెలెక్టర్‌

రిషభ్ పంత్‌.. దినేశ్ కార్తిక్‌.. టీ20 ప్రపంచకప్‌లో స్థానం కోసం వీరిద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. అయితే ఫినిషర్‌గా అక్కరకొస్తాడన్న అంచనాతో గత కొన్ని మ్యాచుల నుంచి దినేశ్ కార్తిక్‌ను టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు పంపిస్తోంది. ఈ క్రమంలో రిషభ్‌ పంత్‌కు అవకాశం లభిస్తుందా...? లేదా..? అనే చర్చ కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts