Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు...

Updated : 18 Nov 2022 21:01 IST

1. ఈ రాత్రికి ఇక్కడే ఉంటా.. మీ సంగతి చూస్తా: చంద్రబాబు

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా కర్నూలులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 3 రాజధానులు కావాలని డిమాండ్‌ చేస్తూ వైకాపా కార్యకర్తలు తెలుగుదేశం కార్యాలయం వద్దకు చేరుకుని నినాదాలు చేయడంతో ఘర్షణ జరిగింది. చంద్రబాబు గో బ్యాక్‌ అంటూ వైకాపా శ్రేణులు నినాదాలు చేస్తే.. సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ తెలుగుదేశం కార్యకర్తలు పోటీగా నినాదాలు చేశారు. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. సర్వేలు చేసి.. ఓటమి భయంతోనే దాడులకు పాల్పడుతున్నారు: కిషన్‌రెడ్డి

నిజామాబాద్‌ భాజపా ఎంపీ అర్వింద్‌ నివాసంపై జరిగిన దాడిని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఖండించారు. హైదరాబాద్‌లోని ఎంపీ నివాసానికి వెళ్లిన మంత్రి.. దాడి జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘అర్వింద్‌ నివాసంపై అధికార పార్టీ గూండాలు దాడి చేయడం హేయమైన చర్య. ఎంపీ ఇంటిపై దాడి జరుగుతుంటే అక్కడే ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారు?’’ అని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ప్రభుత్వ విభాగాల్లో 30లక్షల పోస్టులు ఖాళీ : ఖర్గే

దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని.. అయినప్పటికీ ఖాళీగా ఉన్న పోస్టులను మోదీ ప్రభుత్వం భర్తీ చేయడం లేదని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విరుచుకుపడ్డారు. ప్రభుత్వ విభాగాల్లో 30లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. కానీ, ప్రధాని మాత్రం 75వేల మందికే నియామక పత్రాలను అందజేశారన్నారు. సెంట్రల్‌ సెక్రటేరియట్‌ సర్వీస్‌ విభాగాల్లోనే 1600లకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ వచ్చిన వార్తలపై ఖర్గే స్పందిస్తూ.. మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. జంప్‌ జిలానీలపై థరూర్‌ ట్వీట్‌.. డిక్షనరీ తిరగేయాల్సిందే!

కాంగ్రెస్‌ ఎంపీ థరూర్‌ ట్వీట్ చేస్తే అందులోని పదాలకు అర్థాలు తెలుసుకునేందుకు డిక్షనరీ తిరగేయాల్సిందే. అవును మరి.. ఆయన ఉపయోగించే ఆంగ్ల పదాలు సాధారణ వాడుకలో ఉండవు. వాటికి అర్థం తెలుసుకోవాలంటే డిక్షనరీలో వెతకాల్సిందే. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీలు మారుతున్న నాయకులను ఉద్దేశించి శుక్రవారం ఆయన ట్వీట్ చేసిన వీడియో  వైరల్‌గా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వామ్మో.. ఇదేం తిండి.. అవేం ధరలు.. తినేందుకేనా..?

ఖతార్‌ వేదికగా నవంబర్ 20 నుంచి ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌ 2022 ప్రారంభం కానుంది. దాదాపు 28 రోజలుపాటు జరిగే మెగా టోర్నీ కోసం ఇప్పటికే జట్లన్నీ తీవ్రంగా సాధన చేస్తూ ఉన్నాయి. ఎనిమిది వేదికల్లో 32 జట్లు టైటిల్‌ కోసం పోరాడతాయి. అభిమానులు కూడా భారీగానే చేరుకొన్నారు. తమ అభిమాన జట్టు మ్యాచ్‌ను వీక్షించాలనే ఆశతో వచ్చిన వారికి ఆహార ధరలను చూసి దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. 10 నుంచి విశాఖ- బెంగళూరు రూట్‌లో ఆకాశ ఎయిర్‌ సేవలు

దేశీయ విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌ (Akasa Air) త్వరలో విశాఖ నుంచి తన విమాన సర్వీసులు ప్రారంభించబోతోంది. విశాఖ-బెంగళూరు మధ్య సర్వీసులు నడపనుంది. డిసెంబర్‌ 10 నుంచి ఈ సేవలు ప్రారంభమవుతాయని ఆ విమానయాన సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది ఆగస్టులో కార్యకలాపాలు ప్రారంభించిన ఆకాశ ఎయిర్‌.. తన పదో గమ్యస్థానంగా విశాఖ నుంచి ఈ సేవలు ప్రారంభించబోతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. జెట్‌ ఎయిర్‌వేస్‌ కఠిన నిర్ణయం.. 60 శాతం ఉద్యోగులు సెలవుల్లోకి!

కమర్షియల్‌ విమాన కార్యకలాపాలను త్వరలోనే తిరిగి ప్రారంభిస్తుందనుకున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ ఉద్యోగులపై బాంబు పేల్చింది. సీనియర్‌ మేనేజర్లు సహా కంపెనీలో పనిచేస్తున్న 60 శాతం ఉద్యోగులను సెలవులపై ఇంటికి పంపించాలని నిర్ణయించింది. సెలవుల్లో ఎలాంటి వేతనమూ ఆ కంపెనీ చెల్లించబోదు. మిగిలిన ఉద్యోగులకూ 50 శాతం వరకు వేతనంలో కోత విధించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర: ఆ స్టేడియానికి వస్తే.. బాంబు పేలుస్తాం..!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో జరుగుతోన్న భారత్‌ జోడో యాత్రకు బాంబు బెదిరింపు వచ్చింది. రెండు రోజుల్లో ఆ పాదయాత్ర మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించనుండగా అక్కడ బెదిరింపు లేఖ దొరకడం కలకలం రేపుతోంది. ఇండోర్‌లోని స్థానిక స్టేడియంలో జోడో యాత్రికులు బస చేస్తే.. నగరంలో బాంబు పేలుళ్లు చేపడతామని గుర్తు తెలియని వ్యక్తులు ఆ లేఖలో హెచ్చరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఉగ్రవాదం ఒక్కటే కాదు.. అది అంతకుమించి ప్రమాదకరం: అమిత్‌ షా

ఉగ్ర కార్యకలాపాల్ని ప్రోత్సహించేందుకు ఆర్థిక సాయం చేయడం ఉగ్రవాదం కన్నా ప్రమాదమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit shah) అన్నారు. దీనిద్వారా ఏర్పడే ముప్పు ఏ మతం/జాతి/వర్గంతోనో ముడిపడి ఉండకూడదన్నారు. ఉగ్రవాదులు ప్రపంచంలో హింసను వ్యాప్తి చేసేందుకు, యువతను తమవైపు ఆకర్షితుల్ని చేసేందుకు, ఆర్థిక వనరుల బలోపేతం కోసం నిరంతరం కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ‘చేతిలో దస్త్రాలు లేని లాయర్‌.. బ్యాట్‌ లేని సచిన్‌ తెందూల్కరే’.. న్యాయవాదికి సుప్రీం కోర్టు చురక!

కోర్టులో వాదనలకు హాజరయ్యే సమయంలో న్యాయవాదులకు తన కేసుతో పాటు ఆయా చట్టపర అంశాలకు సంబంధించిన దస్త్రాలను వెంట పెట్టుకోవడం ముఖ్యం. అయితే, కేసు ఫైల్‌ లేకుండానే వాదనలకు హాజరైన ఓ లాయర్‌ను భారత సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) శుక్రవారం తప్పుబట్టింది. కేసు ఫైల్‌ లేని లాయర్.. బ్యాట్ లేని సచిన్ తెందూల్కర్ లాంటివాడేనని చురకంటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని