Amit shah: ఉగ్రవాదం ఒక్కటే కాదు.. అది అంతకుమించి ప్రమాదకరం: అమిత్‌ షా

ఉగ్రవాదులు ప్రపంచంలో హింసను వ్యాప్తి చేసేందుకు, యువతను తమవైపు ఆకర్షితుల్ని చేసేందుకు, ఆర్థిక వనరుల బలోపేతం కోసం నిరంతరం కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. 

Published : 18 Nov 2022 18:11 IST

దిల్లీ: ఉగ్ర కార్యకలాపాల్ని ప్రోత్సహించేందుకు ఆర్థిక సాయం చేయడం ఉగ్రవాదం కన్నా ప్రమాదమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit shah) అన్నారు. దీనిద్వారా ఏర్పడే ముప్పు ఏ మతం/జాతి/వర్గంతోనో ముడిపడి ఉండకూడదన్నారు. ఉగ్రవాదులు ప్రపంచంలో హింసను వ్యాప్తి చేసేందుకు, యువతను తమవైపు ఆకర్షితుల్ని చేసేందుకు, ఆర్థిక వనరుల బలోపేతం కోసం నిరంతరం కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారని చెప్పారు. ఉగ్రవాదులకు నిధుల్ని నియంత్రించే అంశంపై శుక్రవారం దిల్లీలో ‘నో మనీ ఫర్‌ టెర్రర్‌’ పేరిట నిర్వహించిన మూడో అంతర్జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఉగ్రవాదులు తమ సమాచారం గానీ, ఉగ్రకార్యకలాపాలకు సంబంధించిన సమాచారం గానీ బయటకు రాకుండా డార్క్‌నెట్‌ను ఉపయోగిస్తున్నారన్నారు. ఉగ్రవాదం ప్రపంచ శాంతికి, భద్రతకు తీవ్రమైన ముప్పుగా ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. కానీ, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం ఉగ్రవాదం కన్నా ప్రమాదకరమని తాను విశ్వసిస్తానన్నారు. ఎందుకంటే ఉగ్రవాదుల కార్యక్రమాలు, పద్ధతుల్ని వ్యాప్తి చేయడంలో ఆ నిధులే అత్యంత కీలకమని వివరించారు.

ఉగ్రవాదానికి నిధులు ఇచ్చి ప్రోత్సహించడం వల్ల ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలే బలహీనపడుతున్నాయని అమిత్‌ షా అన్నారు. ఈ రక్కసిని సమర్థంగా ఎదుర్కొనేందుకు దేశ భద్రతా నిర్మాణాన్ని, చట్టపరమైన, ఆర్థికపరమైన వ్యవస్థల్ని బలోపేతం చేయడంలో గణనీయమైన పురోగతి సాధించామన్నారు.ఈ సందర్భంగా పాకిస్థాన్‌ సహా ఉగ్రమూకలకు స్వర్గధామాలుగా నిలుస్తున్న పలు దేశాల తీరునూ అమిత్‌ షా తీవ్రంగా ఎండగట్టారు. ఉగ్రవాదంపై పోరాడాలనే తమ సంకల్పాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తున్న దేశాలూ కొన్ని ఉన్నాయంటూ పరోక్షంగా మండిపడ్డారు. కొన్ని దేశాలు ఉగ్రవాదులను రక్షించడం, ఆశ్రయం కల్పిస్తుండటం చూస్తున్నామని.. ఉగ్రవాదిని రక్షించడమంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంతో సమానమన్నారు. ఉగ్రవాదుల లక్ష్యాలు, కుట్రలను సమర్థంగా అడ్డుకొనేందుకు ప్రపంచ దేశాలన్నీ సమష్టి బాధ్యతతో కృషిచేయాల్సిన అవసరాన్ని అమిత్ షా నొక్కి చెప్పారు.

ఉగ్రవాదులకు స్వర్గధామాలైన ప్రాంతాలను, వారి వనరులను ఎప్పడూ విస్మరించరాదని.. అలాంటి వారిని ప్రోత్సహించే శక్తుల కుట్రలను బట్టబయలు చేయాలన్నారు. నో మనీ ఫర్‌ టెర్రర్‌ లక్ష్యాలను సాధించేందుకు ప్రపంచ దేశాలు ఉగ్రవాదులకు నిధులు ఏ రూపంలో వస్తున్నాయో తెలుసుకొని.. ఆ మార్గాలను సమష్టిగా విచ్ఛిన్నం చేసేందుకు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు