Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 09 Mar 2024 16:59 IST

1. తెదేపా, జనసేన, భాజపా మధ్య పొత్తు ఖరారు: కనకమేడల

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం (TDP), జనసేన (Janasena), భాజపా (BJP) కలిసి పోటీ చేస్తాయని తెదేపా నేత కనకమేడల రవీంద్రకుమార్‌ (Kanakamedala Ravindra Kumar) తెలిపారు. రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని తెదేపా, భాజపా, జనసేన నిర్ణయించాయన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. భాజపాతో సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చింది: చంద్రబాబు

భాజపా, జనసేన పొత్తుతో ఎన్నికలకు వెళ్తున్నామని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ ముఖ్యనేతలతో శనివారం దిల్లీ నుంచి ఆయన  టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘‘సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిగాయి.. స్పష్టత వచ్చింది. పోటీ చేసే స్థానాలపై మరో సమావేశం తర్వాత నిర్ణయం ఉంటుంది’’ అని తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కొండలు, గుట్టలకు రైతుబంధు ఇవ్వకూడదని నిర్ణయించాం: భట్టి విక్రమార్క

గతంలో రైతు బంధును భారాస ప్రభుత్వం ఐదు నెలలపాటు ఇచ్చిందని, తాము వారి కంటే తక్కువ సమయంలోనే అందజేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. కొండలు, గుట్టలు, రోడ్లకు రైతు బంధు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. ప్రస్తుతం పాత డేటా ప్రకారమే ఇస్తున్నట్టు చెప్పారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నా కుటుంబం జోలికి వచ్చారు.. వదిలిపెట్టే ప్రసక్తే లేదు: దస్తగిరి

తన తండ్రి షేక్‌ హాజీవలిపై జరిగిన దాడి ఘటనపై మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి స్పందించారు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి బెయిల్‌పై బయట ఉండటం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, బెయిల్‌ రద్దు చేయాలని కోరారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అధిష్ఠానం నుంచి కిషన్‌రెడ్డికి పిలుపు

కేంద్ర మంత్రి, భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. రాష్ట్రంలో మిగిలిన 8 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై అధిష్ఠానంతో చర్చించనున్నారు. పార్టీలో చేరికలపై కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఆర్టీసీ ఉద్యోగులకు 21 శాతం ఫిట్‌మెంట్‌: పొన్నం ప్రభాకర్‌

ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్‌  పీఆర్సీని ప్రకటించారు. వారికి 21 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. జూన్‌ 1 నుంచి కొత్త ఫిట్‌మెంట్‌ అమలులోకి వస్తుందని చెప్పారు. దీంతో ఆర్టీసీపై నెలకు రూ.35 కోట్ల భారం పడనుందని అన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. టెస్టు మ్యాచ్‌లు ఆడితే అదనంగా రూ.45 లక్షలు

టెస్టు క్రికెట్‌ను మరింత విస్తరించేందుకు బీసీసీఐ(BCCI) చర్యలు చేపట్టింది. టీ20 లీగ్‌ల వైపు మొగ్గు చూపే క్రికెటర్లను అడ్డుకొనేందుకు తాజాగా ‘టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్‌ స్కీమ్‌’ను బీసీసీఐ ప్రవేశపెట్టింది. ఈమేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ఓ ప్రకటన చేశారు. దీనికోసం రూ.40 కోట్లను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మహిళా ఉద్యోగులకు జొమాటో కొత్త యూనిఫాం

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో (Zomato) అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వినూత్నంగా జరిపింది. తన సంస్థలో పనిచేసే డెలివరీ విమెన్‌కు కొత్త యూనిఫాం అందించింది. ఎరుపు రంగు కుర్తాలు అందిస్తూ.. ఇకపై యూనిఫాంలో భాగంగా కచ్చితంగా టీ-షర్ట్‌ ధరించాలనే నియమం లేదని తెలిపింది. సౌకర్యంగా ఉంటేనే టీ-షర్ట్‌ లేకపోతే కుర్తాను ఎంచుకోవచ్చని వెల్లడించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కాంగ్రెస్‌, భారాస నేతల మధ్య తోపులాట

జగిత్యాలలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా సాగింది. కాంగ్రెస్‌, భారాస నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. శనివారం జగిత్యాల తహసీల్దార్‌ కార్యాయలంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ ప్రారంభించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కబ్జాదారులకు నేతలు అండగా ఉండటం దురదృష్టకరం: వెంకయ్యనాయుడు

ప్రస్తుతం భూముల ఆక్రమణలు, కబ్జాలు పెరిగిపోయాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కబ్జాదారులకు నేతలు అండగా ఉండటం దురదృష్టకరమన్నారు. కాకినాడలో నిర్వహించిన అఖిల భారత తెలుగు సాహితీ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని